పర్వతగిరి, వెలుగు : వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం చెరువు కొమ్ముతండాలో ఎన్నికల ప్రకటన రాకముందే సర్పంచ్ ఏకగ్రీవం ఘటనపై ఆఫీసర్లు విచారణ చేపట్టారు. తహసీల్దార్ వెంకటస్వామి, ఎంపీడీవో శంకర్‌నాయక్, ఎంపీవో శ్రీనివాస్, సెక్రటరీ రమాదేవి మంగళవారం తండాకు చేరుకున్నారు. ఏకగ్రీవ సర్పంచ్‌గా చెప్పుకున్న దారావత్ బాలాజీ, మాజీ సర్పంచ్ దేశీరాం, తండా పెద్ద మనుషులు, గిరిజనులతో జీపీ ఆఫీస్ వద్ద మీటింగ్ నిర్వహించారు. జీపీ ఎలక్షన్స్ రూల్స్, ఎన్నిక తీరును తండావాసులకు వివరించారు.
తండాలో డెవలప్ మెంట్ పనులు కావాలంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. చట్టానికి వ్యతిరేకంగా నిర్వహించుకునే ఎన్నికలు చెల్లవని తేల్చిచెప్పారు. అయితే.. ఏకగ్రీవ సర్పంచ్ ఎన్నిక అగ్రిమెంట్, ఫొటోలు, మాట్లాడిన వీడియోలతో వార్తలు రావడం, అలా చేస్తే చర్యలు ఉంటాయని అధికారులు హెచ్చరించడంతో బాలాజీ మాట మార్చాడు. విరాళాల ద్వారా ఆలయాలు నిర్మిస్తామని, పదవుల కోసం కాదన్నారు. కాగా, అగ్రిమెంట్ ఘటనతో తనకు సంబంధం లేదని బాలాజీ వాంగ్మూలం ఇవ్వడంతో పాటు లెటర్ రాసి ఇచ్చినట్లు అధికారులు తెలిపారు.