కేసీఆర్​ చెప్పినా ఆరూరి ఆగట్లే!

  • బీఆర్​ఎస్​లో ఉంటానంటూనే బీజేపీ వైపు అడుగులు
  • కిషన్‍రెడ్డి, మంద కృష్ణ మాదిగతో టచ్‍లోకి.. బీఆర్‍ఎస్‍ పెద్దల ఫోన్లు ఎత్తని రమేశ్‍
  • ఏ క్షణమైనా బీజేపీలో చేరే చాన్స్ 

వరంగల్‍, వెలుగు: కేసీఆర్‍ బుజ్జగించడంతో బీఆర్ఎస్​లోనే కొనసాగుతానని చెప్పిన ఆ పార్టీ వరంగల్‍ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍... 24 గంటల్లోనే రూట్​మార్చారు. గురువారం బీఆర్ఎస్​పెద్దల ఫోన్లు ఎత్తని ఆరూరి.. ఎమ్మార్పీఎస్‍ నేత మంద కృష్ణ మాదిగతో పాటు బీజేపీ స్టేట్‍ చీఫ్‍ కిషన్‍రెడ్డితో టచ్‍లోకి వెళ్లడంతో బీజేపీలో ఆయన​ చేరిక లాంఛనమేనని తెలుస్తోంది. 

రెండోరోజూ హైడ్రామా.. 

మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‍ హైడ్రామా రెండోరోజు గురువారమూ కొనసాగింది. బుధవారం వరంగల్​లో వందలాది మీడియా ప్రతినిధుల సమక్షంలో బీఆర్‍ఎస్‍ నేతలు రమేశ్‍ను బలవంతంగా హైదరాబాద్‍ తరలించడం, మధ్యలో బీజేపీ నేతలు అడ్డుకోవడం, ఈ క్రమంలో ఆయన అంగీ చినిగిపోవడం మొదలు సాయంత్రం బీఆర్‍ఎస్‍ అధినేత కేసీఆర్‍, హరీశ్​రావు సమక్షంలో బుజ్జగింపుల వరకు అంతా సినీ ఫక్కీలో సాగింది.

బుధవారం రాత్రే బీఆర్ఎస్ ​నేతల నుంచి బయటపడ్డ ఆరూరి గురువారం ఉదయం నుంచే బీజేపీ నేతలతో టచ్​లోకి వెళ్లారు. ఏక్షణమైనా బీజేపీలో చేరుతారనే ప్రచారం రోజంతా సాగింది. ఆయన ఇప్పటికే ఢిల్లీకి వెళ్లారని కొందరు.. కాదు కాదు హైదరాబాద్​లోనే మోదీ సమక్షంలో పార్టీలో చేరుతారని ఇంకొందరు మీడియాకు లీకులిచ్చారు. కానీ ఆరూరి ఎక్కడ ఉన్నారనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు.

అసెంబ్లీ ఎన్నికల్లో వర్ధన్నపేట నుంచి పోటీ చేసి ఓడిపోయిన రమేశ్​కు వరంగల్​ఎంపీ టికెట్​ఇచ్చేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారు. కానీ బీఆర్ఎస్​లో భవిష్యత్​ లేదని భావించిన ఆయన.. బీజేపీ నుంచి టికెట్​ఆఫర్‍ రావడంతో గులాబీ పార్టీని వీడాలని డిసైడ్‍ అయ్యారు. మంగళవారం బీజేపీ లీడర్లను కలిసి బుధవారం బీఆర్ఎస్​కు రాజీనామా చేసేందుకు సిద్ధమైన టైమ్​లోనే  హైడ్రామా జరిగింది.

బుధవారం ఎప్పట్లాగే వరంగల్​ టికెట్​ను తిరస్కరించిన రమేశ్.. బీఆర్‍ఎస్‍ పార్టీలో మాత్రం కొనసాగుతానని కేసీఆర్​కు మాటిచ్చారు. తీరా తెల్లారాక ఒట్టును కాస్తా గట్టున పెట్టి బీజేపీలోకి వెళ్లేందుకు రెడీ అయ్యారు. ఎమ్మార్పీఎస్‍ నేత మంద కృష్ణ మాదిగతో పాటు బీజేపీ స్టేట్‍ చీఫ్‍ కిషన్​ రెడ్డితో టచ్‍లోకి వెళ్లారు. ఈ క్రమంలో గురువారమే బీజేపీలో ఆరూరి చేరిక ఉంటుందని భావించినా చేరలేదు. శుక్రవారం వీలైతే కిషన్ రెడ్డి సమక్షంలో లేదంటే ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో చేరిక ఖాయమని ఆరూరి అనుచరుల ద్వారా తెలిసింది.