ఉమ్మడి వరంగల్ జిల్లా సంక్షిప్త వార్తలు

నగామ, వెలుగు: వరి కోతలు షురూ అయినా కొనుగోలు సెంటర్లు తెరవక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఈనెల 22 నుంచి కొనుగోళ్లు ప్రారంభించాలని సర్కారు చెప్పినా క్షేత్ర స్థాయిలో ఏర్పాట్లు లేవు. ఇప్పటికే పలువురు రైతులు కోతలు కోసి అమ్మేందుకు సిద్ధంగా ఉన్నారు. కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో చేసేదేమీ లేక జనగామ అగ్రికల్చర్​ మార్కెట్​యార్డుతో పాటు బయట దళారులకు అమ్ముకుంటున్నారు. నిత్యం వేలాది వడ్ల బస్తాలు మార్కెట్​కు వస్తున్నాయి. ఇదంతా ఆఫీసర్ల దృష్టిలో ఉన్నా సెంటర్ల ఏర్పాటులో జాప్యం చేయడం విమర్శలకు తావిస్తోంది.

సెంటర్ల పై క్లారిటీ లేదు

వడ్ల కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్​ సీహెచ్.శివలింగయ్య ఇటీవల ఆఫీసర్లకు ఆదేశాలు జారీ చేశారు. కానీ సంబంధిత శాఖల ఆఫీసర్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే   నెల మొదటి వారంలో తెరిచే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. గత సీజన్ లోనూ ఇదే తీరుగా వ్యవహరించారు. సగం వడ్లు జనగామ అగ్రికల్చర్​ మార్కెట్​ యార్డులో అమ్ముకున్నాక కొనుగోలు సెంటర్లు ఒక్కొక్కటిగా ప్రారంభించారు.

దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.  గత వానాకాలం సీజన్​లో 185 కొనుగోలు సెంటర్లు  ఏర్పాటు చేసి సుమారు లక్షా 38 వేల మెట్రిక్​ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారు. ఈసారి జిల్లావ్యాప్తంగా 2 లక్షల 12 వేల ఎకరాల్లో రికార్డు స్థాయిలో వరి సాగైంది. 2 లక్షల మెట్రిక్​ టన్నుల ధాన్యం సేకరించాలని ఆఫీసర్లు లక్ష్యంగా పెట్టుకున్నారు. ఈ పరిస్థితుల్లో గత వానాకాలం కంటే ఎక్కువ సెంటర్లను ఏర్పాటు చేయాల్సి ఉండగా ఈసారి 150 వరకు ఏర్పాటు చేయాలనే యోచన చేస్తున్నట్లు తెలుస్తోంది. 

మార్కెట్​ కు వేలాది బస్తాల వడ్లు

వరి కోతలు షురూ కావడంతో జనగామ అగ్రికల్చర్​ మార్కెట్​ కు నిత్యం వేలాది బస్తాల వరి ధాన్యం వస్తోంది. ప్రస్తుతం క్వింటా వడ్లకు రూ.2,060  మద్దతు ధర ఉండగా వ్యాపారులు రూ.1,750 వరకు ధర పెడుతున్నారు. అయితే ఎక్కువగా రూ.1500 నుంచి రూ.1600 మధ్యే ధర పలుకుతోంది. సెప్టెంబర్​లో జనగామ అగ్రికల్చర్​ మార్కెట్​లో 6,337 క్వింటాళ్ల వడ్ల కొనుగోళ్లు జరిగాయి, ప్రస్తుతం 48,753 బస్తాలు రాగా 31, 689 క్వింటాళ్ల వడ్లను వ్యాపారులు కొనుగోలు చేశారు. మొత్తంగా ఇప్పటివరకు 38,027 క్వింటాళ్ల వడ్లు 
అమ్ముడయ్యాయి. 

సెంటర్​ లేక మార్కెట్​కు తెచ్చిన..

కొనుగోలు సెంటర్​ లేక వడ్లను జనగామ మార్కెట్​కు తెచ్చిన. ఇంకా ధర పడలేదు. సుమారు 40 క్వింటాళ్ల వరకు అయితయని అంచనా.. ధర ఎంత ఇస్తరో.. సర్కారు సెంటర్ అయితే క్వింటాకు రూ.2060 పడేది. మార్కెట్​లో వ్యాపారులు తక్కువకే కొంటరు. నష్టపోక తప్పేట్టు లేదు.  - గుర్రం శివకుమార్​, గానుగుపాడ్​ రైతు, జనగామ మండలం

తక్కువ ధర పడ్డది 
మార్కెట్​కు 30 బస్తాల వడ్లు తెచ్చిన. క్వింటాకు రూ.1660 మాత్రమే పడ్డది. సర్కారు సెంటర్​ ఇంకా ఏర్పాటు చేయకపోవడంతో ఇక్కడ అమ్మిన. పెట్టుబడికి అప్పులు తెచ్చిన దగ్గర ఆగుత లేరు. సర్కారు సెంటర్​ ఏర్పాటు అయ్యేదాక వడ్లు అమ్మకుంట ఉండాల్నంటే ఇబ్బందే. అందుకే తప్పని పరిస్థితిలో అమ్ముకున్న.  - నక్కల పోశయ్య, రైతు, మరిగడి, జనగామ మండలం

సైబర్​ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలి: ఎస్పీ సంగ్రాంసింగ్

ములుగు, వెలుగు: సైబర్​ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ సంగ్రాంసింగ్ జి.పాటిల్​ సూచించారు. సైబర్​ నేరాలపై శుక్రవారం ఎస్పీ 
ఫోన్​ఇన్ లో పలువురికి సందేహాలను నివృత్తి చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ అక్టోబర్​లో ప్రపంచ వ్యాప్తంగా ‘సీ యువర్​ సెల్ఫ్​ ఇన్​సైబర్​, టుగేదర్​ వి మేక్ ఇట్​ సేఫర్’ అనే థీమ్​తో అవగాహన నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా జిల్లాలో షీటీంలతో కలిసి అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. పలువురు ఫోన్​ కాల్​, ఇన్​స్టాగ్రాంలో వేసిన ప్రశ్నలకు ఎస్పీ సమాధానం చెప్పారు.

సైబర్​ నేరాలపై అవగాహన అవసరం

వరంగల్ క్రైం, వెలుగు: సైబర్ నేరాలపై ప్రజలు అవగాహనతో మెలగాలని వరంగల్ సీపీ డా.తరుణ్​ జోషి సూచించారు. జాతీయ సైబర్ భద్రత అవగాహన మాసంలో భాగంగా సైబర్ క్రైమ్స్​కు గురైన  బాధితులకు అందించే సహకారం గురించి శుక్రవారం ఫోన్​ఇన్ ప్రోగ్రామ్​ నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం 3 నుంచి 4 గంటల వరకు నిర్వహించిన ఈ ఫోన్ ఇన్ ప్రోగ్రాంకు  వివిధ ప్రాంతాలకు చెందిన 46 మంది ఫోన్ చేయగా.. వారికి సీపీ ఓపిగ్గా సమాధానం ఇచ్చారు. 

రాజగోపాల్​రెడ్డిని గెలిపించాలి: మాజీ ఎమ్మెల్యే మొలుగూరి

పరకాల, వెలుగు: మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్​రెడ్డినే గెలిపించాలని పరకాల మాజీ ఎమ్మెల్యే మొలుగూరి భిక్షపతి కోరారు. శుక్రవారం యాద్రాద్రి జిల్లా చౌటుప్పల్ మండలం గుండ్లబావి గ్రామంలో  మొలుగూరి భిక్షపతి ప్రచారం నిర్వహించారు. కమలం గుర్తుకు ఓటు వేసి రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓటర్లను కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్య వర్గ సభ్యులు కాచం గురుప్రసాద్, హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శులు ఆర్ పీ జయంత్ లాల్, సదానందం, వరంగల్ జిల్లా కార్యదర్శి శ్రీనివాస్, పరకాల టౌన్ అధ్యక్షులు భిక్షపతి, నడికూడ మండల అధ్యక్షుడు రాజిరెడ్డి పాల్గొన్నారు.

సీఏ డబ్బులు కాజేసిందని..మహిళల రాస్తారోకో

నర్సంపేట, వెలుగు: తమ సంఘాలకు సంబంధించిన డబ్బులు వాడుకున్న సీఏపై చర్యలు తీసుకుని, డబ్బులు రికవరీ చేయాలని డిమాండ్​ చేస్తూ ఖానాపురం మండల కేంద్రంలో పొదుపు సంఘాల మహిళలు శుక్రవారం రాస్తారోకో చేపట్టారు. దీంతో నర్సంపేట–మహబూబాబాద్ ​హైవేపై గంటన్నరపాటు రాకపోకలు నిలిచిపోయాయి. ఖానాపురం మండలం కొత్తూరు విలేజ్​లో 40 పొదుపు సంఘాలు ఉన్నాయి.

22 సంఘాలకు కొన్ని రోజుల కింద నిర్వహించిన సోషల్​ఆడిట్​లో రూ.20 లక్షలు సీఏ విజిత సొంతానికి వాడుకున్నట్లు బయటపడింది. అయితే తాను వాడుకున్న డబ్బును నెలలోపు చెల్లిస్తానని చెప్పి, ఇప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోమని చెప్పడంతో సీఏ విజిత రెండు ఇళ్లకు సంఘ సభ్యులు తాళాలు వేశారు. దీంతో సీఏ పోలీసులను ఆశ్రయించింది. తమ డబ్బులను కాజేయడమే కాకుండా పోలీసులకు కంప్లైంట్​ చేయడంతో 40 సంఘాలకు చెందిన మహిళలంతా మండలకేంద్రానికి చేరుకొని హైవేపై రాస్తారోకో చేపట్టారు. పోలీసులు స్పాట్​కు చేరుకుని మహిళలతో  మాట్లాడి రాస్తారోకోను 
విరమింపజేశారు.

పోలీస్​ అమరుల త్యాగాలు వెలకట్టలేనివి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు

హనుమకొండ సిటీ, వెలుగు: పోలీస్​అమరుల త్యాగాలు వెలకట్టలేనివని మంత్రి ఎర్రబెల్లి దయాకర్​ రావు అన్నారు. వరంగల్ పోలీస్ పరేడ్ గ్రౌండ్ లో శుక్రవారం నిర్వహించిన పోలీస్ అమరవీరుల సంస్మరణ కార్యక్రమానికి మంత్రి చీఫ్​ గెస్ట్​గా హాజరయ్యారు. ముందుగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా  పలువురు పోలీస్ అమరవీరులతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. అనంతరం మంత్రి దయాకర్​ రావు మాట్లాడుతూ కర్తవ్య నిర్వహణలో కొందరు పోలీసులు ప్రాణాలు కోల్పోవడం బాధాకరమని పేర్కొన్నారు.  కార్యక్రమంలో వరంగల్ సీపీ డా.తరుణ్ జోషి, ఇతర  పోలీసు అధికారులు పాల్గొన్నారు.

మహబూబాబాద్​, వెలుగు: మహబూబాబాద్​లో పోలీస్​ అమరుల సంస్మరణ కార్యక్రమంలో కలెక్టర్ శశాంక, ఎస్పీ శరత్​చంద్ర పవార్​పాల్గొన్నారు. కార్యక్రమంలో అడిషనల్​ కలెక్టర్​ అభిలాష అభినవ్, డీఎస్పీలు సదయ్య, రఘు, రమణ బాబు, జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు. 

రఘునాథపల్లి ,వెలుగు :  పోలీసు అమరవీరులు ఆశయాలను కొనసాగించాలని జనగామ కలెక్టర్  శివలింగయ్య అన్నారు.  పోలీసు అమర వీరుల సంస్మరణ దినం సందర్భంగా శుక్రవారం రఘునాథపల్లి పోలీసు స్టేషన్ ఆవరణలోని  పోలీసు అమరవీరులు స్తూపానికి నివాళులర్పించారు. 

స్టేషన్​ఘన్​పూర్​​లో ఓపెన్​హౌజ్​

స్టేషన్​ఘన్​పూర్​, వెలుగు: పోలీస్​ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ పోలీస్​స్టేషన్​లో శుక్రవారం ఓపెన్​హౌజ్​ నిర్వహించారు.

ఫిల్టర్​ ఇసుక దందాపై టాస్క్​ ఫోర్స్  రైడ్​

అనంతసాగర్​లో ఐదుగురి అరెస్ట్​ 

హనుమకొండ, వెలుగు: అక్రమంగా సాగుతున్న ఫిల్టర్​ ఇసుక దందాపై టాస్క్​ఫోర్స్​ పోలీసులు కొరడా ఝుళిపించారు. గురువారం 'వెలుగు' పేపర్​ లో 'లీడర్ల సపోర్ట్​ తో ఫిల్టర్ ఇసుక దందా' పేరున వార్త పబ్లిష్ అయిన విషయం తెలిసిందే. ఈ అక్రమ దందా వ్యవహారాన్ని లోకల్​ ఆఫీసర్లు 'మామూలు'గా తీసుకోగా.. శుక్రవారం టాస్క్​ఫోర్స్​ పోలీసులు స్పెషల్​ రైడ్స్​ చేపట్టారు.

జేసీబీ, డోజర్ సహా ఐదు ట్రాక్టర్లను సీజ్​ చేశారు. హసన్ పర్తి మండలం అనంతసాగర్​లో  ఫిల్టర్​ ఇసుక డంప్​పై  రైడ్ చేసి.. ఐదుగురు నిందితులను అరెస్ట్​ చేశారు.  అనంతసాగర్​కు చెందిన వట్టి జీవన్​ రెడ్డి, బైకాని కుమారస్వామి, వడ్డేపల్లికి చెందిన అజ్మీరా శ్రీను, ధర్మసాగర్​కు చెందిన రాపాక నగేశ్​, ధారంగుల శ్రీనులను అరెస్ట్​ చేసినట్లు టాస్క్​ఫోర్స్​ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. 

అసలు దొంగలు తెరవెనుకే..

అనంతసాగర్ లో ఈ దందా వెనుక ఓ ఇద్దరు అధికార పార్టీ లీడర్లు ఉన్నట్లు తెలుస్తోంది. కానీ టాస్క్​ఫోర్స్​ పోలీసులు రైడ్​ చేసిన టైంలో  స్పాట్​లో ఉన్న ఐదుగురిని మాత్రమే అరెస్ట్​ చేశారు. కాగా ఈ ఫిల్టర్ ఇసుక దందా వెనుక అనంతసాగర్​ కు చెందిన ఓ ప్రజాప్రతినిధి భర్త, మండల స్థాయి లీడర్​ కీలకంగా వ్యవహరిస్తున్నారు. ఈ విషయం పోలీస్​, రెవెన్యూ, మైనింగ్​, ఎలక్ట్రిసిటీ ఆఫీసర్ల దృష్టిలో కూడా ఉంది. అయినా వారు సరైన విధంగా యాక్షన్​ తీసుకోకపోవడం వల్లే ఈ దందా యథేచ్ఛగా సాగుతోందనే విషయం స్పష్టమవుతోంది. 

దేశాన్ని ఏకం చేసేందుకే భారత్​ జోడో యాత్ర ఎమ్మెల్యే సీతక్క

ములుగు, వెలుగు: దేశాన్ని ఏకం చేసేందుకే కాంగ్రెస్​ నేత రాహుల్​ గాంధీ భారత్ జోడో యాత్ర చేస్తున్నారని మహిళా కాంగ్రెస్​ జాతీయ ప్రధాన కార్యదర్శి, ములుగు ఎమ్మెల్యే సీతక్క అన్నారు. జోడో యాత్రకు సంఘీభావంగా శుక్రవారం ములుగులో కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు నల్లెల్ల కుమారస్వామి ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ దేశాన్ని ఏకం చేయడమే తమ లక్ష్యమని, దేశ ప్రజలు రాబోయే రోజుల్లో కాంగ్రెస్​ను గెలిపిస్తారన్నారు.

ఈనెల 23న తెలంగాణలోకి భారత్ జోడో యాత్ర అడుగుపెడుతున్నందున జిల్లా నాయకులు అధిక సంఖ్యలో హాజరై యాత్రను సక్సెస్​చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్​ జిల్లా అధ్యక్షుడు బానోతు రవిచందర్​, బ్లాక్​ కాంగ్రెస్​ అధ్యక్షుడు బైరెడ్డి భగవాన్​ రెడ్డి, కాంగ్రెస్​ మండలాధ్యక్షుడు ఎండీ.చాంద్​ పాషా, లీడర్లు మల్లాడి రాంరెడ్డి, దాసరి సుధాకర్​, ఎండీ.ఆయూబ్​ ఖాన్​, రవి, వెంకన్న, జయరాంరెడ్డి, అనంతరెడ్డి పాల్గొన్నారు. 

పురిటి నొప్పులతో తల్లడిల్లిన గర్భిణి.. అడవిలోనే డెలివరీ చేసిన 108 సిబ్బంది
ఏటూరునాగారం, వెలుగు:
ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం గొత్తికోయగూడేనికి చెందిన గర్భిణి మడకం అంజలికి శుక్రవారం పురిటినొప్పులు మొదలయ్యాయి. 108 కు కుటుంబసభ్యులు ఫోన్​చేశారు. రోడ్డు సరిగా లేకపోవడంతో అంబులెన్స్​గొత్తికోయ గూడేనికి చేరుకోలేదు. 108 సిబ్బంది అక్కడికి చేరుకొని అంజలికి డెలివరీ చేశారు. అనంతరం మంచంపైనే అంబులెన్స్​వరకు మోసుకొచ్చి కన్నాయిగూడెం పీహెచ్​సీకి తరలించారు.

వైస్​ ఎంపీపీ కుటుంబానికి పరామర్శ 

ఏటూరునాగారం, వెలుగు: రోడ్డు ప్రమాదంలో కొడుకును కోల్పోయిన ఏటూరునాగారం వైస్​ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి కుటుంబాన్ని ఎంపీపీ విజయనాగరాజు, ఎంపీటీసీలు పరామర్శించారు. ఈ నెల 11న హనుమకొండలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సంజీవరెడ్డి కుమారుడు జయసింహా రెడ్డి (18) చనిపోయాడు.

శుక్రవారం వరంగల్​లోని దేశాయిపేటలో నిర్వహించిన జయసింహా రెడ్డి పెద్దకర్మ కార్యక్రమానికి కో ఆప్షన్ సభ్యులు ఎండీ. ఖలీల్,  ఎంపీటీసీలు అల్లి సుమలత, భరత్, లక్ష్మీనారాయణ, ధనలక్ష్మి, స్వప్న , నరసింహులు, శ్రీలతా హాజరయ్యారు. పార్టీ మండల అధ్యక్షుడు సునీల్​ కుమార్​, మల్లారెడ్డి, ఖాఝాపాషా, కిరణ్​ పాల్గొన్నారు.