డల్లాస్​ చేస్తమని..  ఖల్లాస్​ చేసిన్రు 

డల్లాస్​ చేస్తమని..  ఖల్లాస్​ చేసిన్రు 

హనుమకొండ, వెలుగు:   కొట్లాడి తెచ్చుకున్న  ప్రత్యేక  తెలంగాణలో  తొమ్మిదేండ్ల బీఆర్​ఎస్​ పాలనలో ఉమ్మడి వరంగల్ జిల్లా అన్ని రంగాల్లో  వెనుకబడిపోయిందని పలువురు వక్తలు ఆవేదన వ్యక్తం చేశారు.  కల్వకుంట్ల కుటుంబం కేవలం సిద్దిపేట, సిరిసిల్ల, గజ్వేల్ ను మాత్రమే డెవలప్​ చేసుకుంటోందని,  ఉమ్మడి వరంగల్ లోని  12 నియోజకవర్గాల్లో ఎక్కడా సరైన అభివృద్ధి జరగడం లేదని మండిపడ్డారు. హనుమకొండ నక్కలగుట్టలోని హరిత కాకతీయలో బుధవారం  ‘ తెలంగాణ రాష్ట్రంలో ఉమ్మడి వరంగల్​ జిల్లా అభివృద్ధి ఎంత..?’  అనే  అంశంపై తెలంగాణ ఉద్యమకారుల వేదిక, ఫోరమ్​ ఫరం బెటర్​ వరంగల్  ఆధ్వర్యంలో  మేధావులు, ఉద్యమకారుల చర్చా కార్యక్రమం నిర్వహించారు.  కేయూ రిటైర్డ్  ప్రొఫెసర్​ కూరపాటి వెంకటనారాయణ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి వివిధ  రంగాలకు చెందిన మేధావులు,  ప్రత్యేక తెలంగాణ ఉద్యమకారులు హాజరయ్యారు.  ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..   ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత  ఉమ్మడి వరంగల్ జిల్లా సర్వం నష్టపోయిందని,  అభివృద్ధిలో  రాష్ట్రంలోనే చివరి స్థానంలో ఉందని  అసంతృప్తి వ్యక్తం చేశారు.  ఇక్కడి నాయకులు తమ సీటు కాపాడుకోవడానికి రాజకీయ చైతన్యాన్ని కోల్పోయి  గులాబీ బాస్​ భజన చేస్తున్నారు తప్ప అభివృద్ధిని పట్టించుకోవడం లేదని మండిపడ్డారు.  

ఎమ్మెల్యే  టికెట్ల కోసం సీఎం కాళ్ల మీద పడి బతిమాలుకోవడాన్నే పనిగా పెట్టుకున్నారని విమర్శించారు.  ఉమ్మడి  వరంగల్​తో పాటు రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ‘బీఆర్​ఎస్​ హఠావో.. తెలంగాణ బచావో’  నినాదంతో ముందుకుపోవాలని పిలుపునిచ్చారు.  కమలాపూర్  రేయాన్స్​ ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వమే మూసేసిందని,  రైతుల భూములను కారు చౌకగా స్వాధీనం చేసుకొని ఏర్పాటు చేస్తామన్న  కాకతీయ మెగా టెక్స్​ టైల్​  పార్కులో  ఏ  ఒక్క  స్థానికుడికీ  ఉద్యోగ అవకాశం దక్కలేదన్నారు.  జనగామ, కొడకండ్ల, పాలకుర్తి, మహబూబాబాద్ లో పెడ్తామన్న  టెక్స్​ టైల్​ పార్కులు  ఏమయ్యాయని ప్రశ్నించారు.  ఇక్కడి పాలకులు నిత్యం కేంద్రంతో తగవులాడుతూ వరంగల్ కు  రావాల్సిన కోచ్ ఫ్యాక్టరీ రాకుండా చేశారని, వచ్చిన స్మార్ట్ సిటీ ఫండ్స్​ను ఉపయోగించకుండా నిర్లక్ష్యం చేశారని మండిపడ్డారు. 70  ఎకరాల సెంట్రల్​ జైలు  స్థలాన్ని  రూ.11 వేల కోట్లకు మహారాష్ట్ర బ్యాంకుకు తాకట్టు పెట్టారని ఆరోపించారు.  టైర్  రిట్రేడింగ్ యూనిట్​ ఇతర జిల్లాకు తరలించి, ఆ స్థలంతో వ్యాపారం చేస్తున్నారని, జనగామ, ములుగు, భూపాలపల్లి, మహబూబాబాద్ జిల్లాల్లో  మెడికల్ కాలేజీలకు కనీస సౌలతులు, డాక్టర్లు లేక కేవలం బోర్డులు మాత్రమే పెట్టి చేతులుదులుపుకొన్నారని మండిపడ్డారు.  కార్యక్రమంలో ఉద్యమకారులు, మేధావులు శివరాత్రి దుర్గయ్య, నరోత్తం రెడ్డి, ఈశ్వర్​ సింగ్​, సాయిని నరేందర్​, శశికాంత్​  పాల్గొని ప్రసంగించారు. 

తెలంగాణ బందీ అయ్యింది..

మా పాలన మాగ్గావాలని  ప్రాణాలను పణంగా పెట్టి తెలంగాణ ఉద్యమం చేసినం. తెలంగాణ వచ్చుడో, మేం సచ్చుడో అని పోరాడినం. కానీ పాలకులు బంగారు తెలంగాణ అని చెప్పుకుంటూ రాష్ట్రాన్ని మొత్తం లూటీ చేస్తున్నరు. కొట్లాడి తెచ్చిన తెలంగాణ ఇప్పుడు దొంగలు, దోపిడీదారుల చేతుల్లో బందీ అయ్యింది. అభివృద్ధి చేస్తారని కేసీఆర్ ను సీఎం చేసినం. ఉచిత పథకాలు కాకుండా పనిచేసుకొని బతికే పరిస్థితులు రావాలి.  ప్రొఫెసర్  జయశంకర్  కలలను నిజం చేయడానికి మరో పోరాటం చేస్తం. రాష్ట్ర ప్రజలు ‘బీఆర్ఎస్ హఠావో... తెలంగాణ బచావో’  నినాదంతో ముందుకుపోవాలె. 
 

రహీమున్నీసా బేగం, 

తెలంగాణ ఉద్యమకారిణి డల్లాస్  హామీ ఏమాయె.. 

సీఎం హోదాలో  కేసీఆర్  ఇక్కడి  స్లమ్  ఏరియాల్లో తిరిగి,  వరంగల్ ను డల్లాస్ చేస్తామని హామీ ఇచ్చారు.  ఏటా బడ్జెట్ లో స్పెషల్​ ఫండ్స్​ ఇస్తమని చెప్పి జనాలను మోసం చేసిన్రు. వరంగల్ కు ఉన్న రోడ్డు, రైల్వే మార్గాలతో పాటు మామునూరు ఎయిర్ పోర్టు అందుబాటులోకి తెస్తే  ఈ ప్రాంతాన్ని  అద్భుతంగా తీర్చిదిద్దవచ్చు. కానీ ఎయిర్ పోర్టు సదుపాయం లేక రాంపూర్ లో ఏర్పాటైన మూడు ఐటీ కంపెనీలు తిరిగి వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి.  టూరిజం హబ్​కు ఇక్కడ మంచి వనరులున్నా పాలకులు నిర్లక్ష్యం చేస్తున్నరు. వరంగల్ సిటీని రెండో రాజధానిగా ప్రకటించాలి. అప్పుడే ఫ్యాక్టరీలు, ఆఫీసులు ఇక్కడికి వచ్చి వరంగల్ డెవలప్ అయ్యే చాన్స్​ ఉంటుంది.
 -
తిరునహరి శేషు, తెలంగాణ ప్రజావేదిక చైర్మన్ 

కుటుంబ పాలన పోవాలి..

ప్రత్యేక  తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లాను  దిగజార్చుతారని ఉద్యమకారులు ఎప్పుడూ అనుకోలేదు.  రాష్ట్రంలో ఉన్న పాలకులు  వారివారి ప్రాంతాలను డెవలప్​ చేసుకుంటూ ఉమ్మడి వరంగల్ అభివృద్ధిని నిర్లక్ష్యం చేశారు. అందుకే అన్ని రకాల వనరులున్నా  ఉమ్మడి వరంగల్​ లోని ఆరు జిల్లాలు అభివృద్ధిలో వెనుకబడ్డాయి.  నాయకులు వ్యాపారాలు,  కాంట్రాక్టులతో వందల కోట్లు వెనకేసుకుంటున్నారు.  ఫామ్ హౌస్ లు, రూ.కోట్ల విలువైన  వాహనాలు, బిల్డింగులు కట్టుకుని పేదలను పట్టించుకోవడంలేదు. అందుకే కల్వకుంట్ల కుటుంబ పాలన అంతమైతేనే  ప్రజలకు న్యాయం జరుగుతుంది. 

- రిటైర్డ్  ప్రొఫెసర్​ కూరపాటి వెంకటనారాయణ

అభివృద్ధిలో అట్టడుగుకు..

తెలంగాణ వచ్చాక వరంగల్ లో ఫ్యాక్టరీలు పెడ్తరని, వలసలు తగ్గి ఉపాధి అవకాశాలు మెరుగవుతాయను కున్నం. కానీ వరంగల్ జిల్లా అన్ని విధాలా నిర్లక్ష్యానికి గురైంది.  తలసరి ఆదాయంలో వరంగల్ జిల్లా 28వ స్థానంలో ఉంటే,  జీడీపీలో  రాష్ట్రంలోనే 15వ ప్లేస్ లో ఉంది.  సిద్దిపేట, నిజామాబాద్​, సిరిసిల్లతో పోలిస్తే ఉమ్మడి జిల్లా చాలా వెనుకబడి ఉంది.  కేంద్ర ప్రభుత్వం వరంగల్ ను అత్యంత వెనుకబడిన ప్రాంతంగా గుర్తించి వివిధ స్కీంల కింద ఫండ్స్​ ఇస్తుంటే..  పాలకులు వాటిని ఇతర జిల్లాలకు పెడ్తున్నారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటులో మహబూబ్ నగర్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాలతో పోలిస్తే వరంగల్ వెనుకబడి ఉండడం బాధాకరం. రాష్ట్రానికి రెండో రాజధాని అని చెబ్తూనే వరంగల్ ను అట్టడుగుకు తొక్కేశారు. 
 -
పుల్లూరు సుధాకర్​,  ఫోరం ఫర్ బెటర్ వరంగల్ అధ్యక్షుడు