- కవరేజీకి వెళ్తే ఇంట్లో బంధించి ఫోన్లు గుంజుకుని వార్నింగ్
- ఎమ్మెల్యే తీరును ఖండించిన యూనియన్లు, ప్రెస్ క్లబ్
- బహిరంగ క్షమాపణ చెప్పకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరిక
వరంగల్, వెలుగు: న్యూస్ కవరేజీ కోసం వెళ్లిన సీనియర్ వీడియో రిపోర్టర్లను వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఆదివారం బంధించి బెదరించిన ఘటన చర్చనీయాంశమైంది. ఓ ఛానల్‍కు చెందిన వరంగల్ స్టాఫ్ రిపోర్టర్ గుంటి విద్యాసాగర్ ఎమ్మెల్యే నరేందర్ ఇంటర్వూ కోసం వెళ్లారు. శనివారం జిల్లా పర్యటనలో మంత్రి కేటీఆర్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా మీ పేరు ఎందుకు ప్రకటించలేదని ప్రశ్నించారు. ‘మంది టిక్కెట్లయితే ప్రకటిస్తడు.. ఇంటొని టిక్కెట్ అయితే ప్రకటించాల్సిన అవసరంలేదు’ అని ఎమ్మెల్యే సమాధానమిచ్చారు. మంత్రి కేటీఆర్ కు కౌంటర్‍గా కొండా మురళీ మాటల యుద్ధం ఏంటని మరో ప్రశ్న వేయగా.. ఎమ్మెల్యే నరేందర్ సీరియస్ అయ్యారు.
‘మీరు ఇట్లచేస్తే ఇద్దరు ఇంట్లనుంచి బయటకు పోరు మరీ’ అని వార్నింగ్ ఇస్తూ చిత్రీకరిస్తున్న కెమెరా గుంజుకున్నారు. ఆపై తలుపులు మూసి ఇష్టారీతిన తిట్టారని బాధితుడు ఆరోపించారు. ఫోన్ తీసుకుని అందులో ఉన్న డేటా డిలీట్ చేశారన్నారు. ఎమ్మెల్యే జర్నలిస్టును బెదిరిస్తున్న వీడియోలు బయటకొచ్చాయి. కాగా, ఎమ్మెల్యే నరేందర్ తీరుపై జర్నలిస్టులు ఆగ్రహం వ్యక్తం చేశారు. శనివారం తూర్పు లో జరిగిన కేటీఆర్ పర్యటనలో జర్నలిస్టులపై పోలీసులు దాడులు చేయగా.. తెల్లారి ఏకంగా ఎమ్మెల్యేనే డైరెక్ట్‌గా బెదిరింపులకు దిగడాన్ని తప్పుబట్టారు. యూనియన్ల నేతలు, గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్ కమిటీ బాధ్యులు మాట్లాడుతూ.. కవరేజీ కోసం వెళ్లిన జర్నలిస్టులను నిర్బంధించి , ఫోన్లు ధ్వంసం చేయడాన్ని ఖండించారు. ఎమ్మెల్యే వెంటనే క్షమాపణలు చెప్పాలని.. లేదంటే అందరితో కలిసి ఆందోళనలు చేపడ్తామని హెచ్చరించారు.