ఏనుమాముల మార్కెట్ ఎట్టికి.. పాలకవర్గం లేదు.. పనిచేసేవారూ లేరు..

ఏనుమాముల మార్కెట్ ఎట్టికి.. పాలకవర్గం లేదు.. పనిచేసేవారూ లేరు..
  • రెండున్నరేళ్లుగా నియామకం కాని పాలకవర్గం
  • రెండు నెలల కింద సెక్రటరీపై సస్పెన్షన్‌‌ వేటు
  • 129 మంది సిబ్బంది ఉండాల్సిన చోట.. 27 మందే..
  • ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న దళారులు.. నష్టపోతున్న రైతులు

వరంగల్, వెలుగు : ఆసియాలోనే రెండో అతిపెద్ద మార్కెట్‌‌గా చెప్పుకునే వరంగల్‍ ఏనుమాముల మార్కెట్‌‌ పరిస్థితి పేరు గొప్ప.. ఊరు దిబ్బగా మారింది. మార్కెట్‌‌కు రెండున్నరేండ్లుగా పాలకవర్గం లేకపోగా, రెండు నెలల నుంచి సెక్రటరీ పోస్ట్‌‌ ఖాళీగా ఉంది. మరో వైపు సిబ్బంది సైతం అరకొరగా ఉండడంతో రైతుల సమస్యలు పట్టించుకునే వారే కరువయ్యారు. మార్కెట్‌‌లో పర్యవేక్షణ లేకపోవడంతో వ్యాపారులు, దళారులే రాజ్యమేలుతున్నారు. 

పాలకవర్గం ఎంపికలో రాజకీయం

ఏనుమాముల మార్కెట్‌‌కు పాలకవర్గం లేక రెండున్నరేండ్లు దాటింది. బీఆర్‌‌ఎస్‌‌ ప్రభుత్వంలో దిడ్డి భాగ్యలక్ష్మితో కూడిన పాలకవర్గం గడువు 2022 ఆగస్ట్‌‌ 18న ముగిసింది. తర్వాత సొంత పార్టీ ఎమ్మెల్యేల రాజకీయాల కారణంగా కొత్త పాలకవర్గ ఏర్పాటును పట్టించుకోలేదు. 2023 డిసెంబర్‌‌లో కాంగ్రెస్‌‌ అధికారంలోకి వచ్చాక పాలక వర్గ ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. అయితే వరంగల్‌‌ తూర్పు, పరకాల, వర్ధన్నపేట ఎమ్మెల్యేల మధ్య ఇంటర్నల్‍ కాంపిటీషన్‌‌ నడిచింది. 

చివరకు ఎస్సీ మహిళా రిజర్వేషన్‌‌ కోటాలో ఎర్ర ప్రియాంక చైర్మన్‌‌గా, బండి జనార్దన్‌‌ వైస్‌‌ చైర్మన్‌‌గా 18 మందితో కూడిన పాలకవర్గాన్ని ఈ ఏడాది జనవరి 28న ప్రభుత్వం ప్రకటించింది. అయితే పాలకవర్గ ఎంపికపై ఎమ్మెల్యేల మధ్య వార్‌‌ నడవడంతో... ఈ ఇష్యూ కాస్తా హైకమాండ్‌‌ వద్దకు చేరింది. దీంతో కమిటీ ఎంపిక ఆగింది. తర్వాత పాలకవర్గ ఏర్పాటుపై ఇప్పటివరకు క్లారిటీ రావడంలేదు. అయితే ముందుగా ప్రకటించినట్లు ప్రియాంకతో కూడిన పాలకవర్గమే పనిచేస్తుందా ? లేక మరొకరికి అవకాశం ఇస్తారా ? అన్న విషయం ఎటూ తేలడం లేదు.

అవినీతి ఆరోపణలతో సెక్రటరీపై వేటు

ఏనుమాముల మార్కెట్‌‌కు పాలకవర్గం లేకపోవడంతో సెక్రటరీ నిర్మల అన్నీతానై వ్యవహరించారు. కానీ... టెంపరరీ రిజిస్ట్రేషన్ల ద్వారా రైతులకు దక్కాల్సిన సీసీఐ మద్దతు ధరను వ్యాపారులకు కట్టబెట్టారని ఆరోపణలు రావడంతో విజిలెన్స్‌‌ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో వరంగల్‌‌ ప్రాంతీయ వ్యవసాయ మార్కెటింగ్‍ శాఖ పరిధిలోని ఏడుగురు మార్కెట్‌‌ సెక్రటరీలపై ప్రభుత్వం వేటు వేసింది. ఇందులో ఏనుమాముల మార్కెట్‌‌ కార్యదర్శి నిర్మల సైతం ఉన్నారు. ఫిబ్రవరి రెండో వారంలో ఆమెపై వేటు పడగా.. ఇప్పటివరకు కొత్త సెక్రటరీని నియమించలేదు. నర్సంపేట మార్కెట్‌‌ సెక్రటరీ రెడ్డినాయక్‌‌ను ఏనుమాముల మార్కెట్‌‌కు ఇన్‌‌చార్జ్‌‌గా నియమించడంతో సమస్యలు పరిష్కారం కావడం లేదు.

129 మందికి...27 మందే...

ఏనుమాముల మార్కెట్‌‌ను సిబ్బంది కొరత వేధిస్తోంది. మార్కెట్‌‌ పరిధిలో మొత్తం 129 మంది సిబ్బంది పనిచేయాల్సి ఉండగా ప్రస్తుతం 27 మందే ఉన్నారు. దీంతో రైతుల సమస్యలను పట్టించుకునే వారే కరువయ్యారు. మరో వైపు ఉన్నవారిపై పనిభారం పడుతోంది. 

దళారుల చేతుల్లో పత్తి, మిర్చి రైతులు ఆగం

ఉమ్మడి వరంగల్‌‌ జిల్లాతో పాటు రాష్ట్రంలోని ఇతరత్రా జిల్లాలు, పక్క రాష్ట్రాల నుంచి రైతులు తమ పంటలను విక్రయించుకునేందుకు ఏనుమాముల మార్కెట్‌‌కు వస్తుంటారు. పత్తి, మిర్చి విక్రయించేందుకు లక్షలాదిగా తరలివచ్చే రైతులతో ఏడాదిలో సుమారు 10 నెలలు ఈ మార్కెట్‌‌ కళకళలాడుతుంటుంది. ప్రస్తుతం ఒక్కోరోజు సగటున 40 వేల బస్తాల నుంచి 90 వేల బస్తాల వరకు మిర్చిని తీసుకొస్తున్నారు. వ్యాపారులు సిండికేట్‌‌ మారి తేమ, ఇతర కారణాలు చూపుతూ రైతులను నిలవునా ముంచేస్తున్నారు. 

గతేడాది క్వింటాల్‌‌ పత్తి రూ.11 వేలు పలుకగా.. ఈ సారి రూ.7 నుంచి 8 వేలు మాత్రమే పలికింది. అలాగే క్వింటాల్‌‌ మిర్చి గతంలో రూ.21 వేల నుంచి రూ.22 వేలు పలుకగా.. ప్రస్తుతం రూ.13 వేలు కూడా దాటడం లేదు. మార్కెట్‌‌కు పాలకవర్గం, సెక్రటరీ లేకపోవడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో తెలియక రైతులు ఆందోళన చెందుతున్నారు.