వరంగల్ కోటను పరిరక్షించుకుందాం

వరంగల్ కోటను పరిరక్షించుకుందాం

కాకతీయుల కీర్తి ప్రతిష్టలను దశదిశలా వ్యాపింపజేసిన అద్భుత నిర్మాణం వరంగల్ కోట. దక్షిణ భారతదేశ వాస్తు శిల్పకళకు గొప్ప తార్కాణం ఇది. గోలకొండ తర్వాత అతి పెద్దదైన ఈ కోట పరిరక్షణ విషయంలో నిర్లక్ష్యం జరుగుతోంది. కోట చుట్టూ అక్రమనిర్మాణాలు వెలుస్తున్నాయి. వాటిపై అధికారులు నోటీసులిచ్చి వదిలేయడమే తప్ప చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ఇప్పటికైనా వరంగల్​కోటను పరిరక్షిస్తే రామప్ప లాగే దీనికి కూడా యునెస్కో వారసత్వ గుర్తింపు దక్కే ఆస్కారం ఉంటుంది. రాజులు పోయారు.. రాజ్యాలు పోయాయి. కానీ వారు నిర్మించిన కోటలు, రాజ ప్రసాదాలు, ప్రజా వినియోగ భవనాలు, దేవాలయాలు, బావులు, చెరువులు వంటి సాంస్కృతిక చిహ్నాలు గతకాలపు వైభవాలకు, వాస్తు కళా నైపుణ్యాలకు, రాచఠీవికి నిదర్శనాలుగా మన కండ్లముందు అలాగే ఉన్నాయి. అటువంటి వాటిలో కొన్ని రాష్ట్రానికి, దేశానికి గర్వకారణంగా ఉంటూ ప్రపంచ దృష్టిని సైతం ఆకర్షిస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు పొందిన, కాకతీయుల నిర్మాణ కౌశల్యమైన రామప్ప దేవాలయం ఇందుకు ఉదాహరణ. 

రక్షణ కోసం ఏర్పాటు
బ్రిటీష్ వారు భారతదేశంలోని అనేక ముఖ్య ప్రాంతాల్లో కోటలు నిర్మించారు. ఒక రాజ్యం ఆక్రమణ సంపూర్ణం కావాలంటే వారికున్న కోటలను చేజిక్కించుకుంటేనే పూర్తి అవుతుందనే భావన రాజుల్లో ఉండేది. అందుకే కోటల నిర్మాణంలోనే కాదు రక్షణ విషయంలోనూ చాలా జాగ్రత్తలు తీసుకునేవారు. శత్రుదుర్భేద్యంగా నిర్మించిన రాతి గోడలు గత చరిత్రలకు సాక్షీభూతాలే కాదు, అనేక రహస్యాలకు, యుద్ధ వ్యూహాలకు గుర్తులు. రాజులు వేయించిన శాసనాలు, నాణాలతోపాటు వారి రాజ్యపాలన తీరుతెన్నులు కోటల్లో కనబడతాయి. కోటలు నాలుగు రకాలు. అవి స్థల, జల, గిరి, వన దుర్గంలు. వరంగల్ కోట స్థల దుర్గం. ఇది దక్షిణ భారతదేశ వాస్తు శిల్పకళకు గొప్ప తార్కాణం. దేశవ్యాప్తంగా సజీవంగా ఉన్నవాటిలో ఇది ఒకటి. ఇక్కడ సజీవంగా అనడంలో ఉద్దేశం మానవ జీవనం నేటికినీ కోట లోపల కొనసాగడమే.

ఏడు ప్రాకారాలు
వరంగల్ కోటకు ఏడు ప్రాకారాలు ఉన్నట్లుగా చెబుతారు. వాటినే కోటలుగా పిలుస్తారు. ఇప్పుడున్న చారిత్రక ఆధారాల ప్రకారం మూడు ప్రాకారాలు మాత్రమే కనబడుతున్నాయి. ఆ ప్రాకారాల అవశేషాలు మనం ఇప్పటికీ చూడవచ్చు. మొదటి ప్రాకారం మట్టితో నిర్మించారు. దీన్ని ధరణి కోట అని పిలుస్తారు. రెండో ప్రాకారంలో ఉన్నది రాతి కోట. గ్రానైటు రాళ్లతో నిర్మితమైనది. రాతి కోటకు నాలుగు వైపులా పెద్ద పెద్ద ఏకశిలా రాతి ద్వారాలు ఉన్నాయి. ఈ ద్వారాలను కాకతీయ కళాతోరణాలు లేక కీర్తి తోరణ శిల్పాలుగా పిలుస్తున్నారు. ఈ కళాతోరణాలనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత అధికారిక చిహ్నంగా ప్రకటించింది. మట్టి కోటకు నాలుగు దిక్కులా ఉన్న ప్రధాన ద్వారాలను కలుపుతూ గణపతి దేవుడు ఖిల్లా వరంగల్‌‌‌‌ చుట్టూ15 మీటర్ల ఎత్తయిన రాతి గోడను నిర్మించారు. ఈ గోడపై బురుజులు కూడా ఉన్నాయి. వాటిపైన సాయుధ దళాలు నిరంతరం పహారా కాయడానికి అనుకూలంగా ఉన్నాయి. రక్షణ కోసం కోట చుట్టూ లోతైన కందకం తవ్వారు. దీనిలో ఎప్పుడూ10 అడుగుల మేర నీటిని నింపి ఉంచేవారు. ఇందులో మొసళ్లను, విషసర్పాలను వదిలేవారు. ఈ కోట నిర్మాణంను గణపతి దేవుడు సా.శ.1199లో ప్రారంభిస్తే, ఆయన వారసురాలు అయిన రాణి రుద్రమదేవి పూర్తి చేసినట్లుగా తెలుస్తోంది. వరంగల్ మహా నగరంగా విస్తరించడంతో భూముల ధరలకు రెక్కలు వచ్చాయి. ఇప్పుడున్న కోటను కాస్తా తవ్వి, చదునుచేసి స్థిరాస్తిగా మార్చి తర్వాత ప్లాట్లుగా చేస్తున్నారు. ప్రభుత్వం వాటిని తొలగించి కోట రక్షణకు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- డా. సందెవేని తిరుపతి, చరిత్ర పరిరక్షణ సమితి