
వరంగల్/హనుమకొండ, వెలుగు: కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఒక్క మంచి పని కూడా చేయలేదని మంత్రి హరీశ్ రావు మండిపడ్డారు. ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతోందని ఫైర్ అయ్యారు. ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ ఆధ్వర్యంలో బుధవారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్‍లో ‘కార్మిక యుద్ధభేరి’ ముగింపు సభ నిర్వహించారు. దీనికి హరీశ్ రావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘బీజేపీ ప్రభుత్వానికి కేవలం అదానీ, అంబానీ లాంటి వ్యాపారవేత్తలు తప్ప.. కార్మికులు కనిపించడం లేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మి కార్మికులను రోడ్డున పడేస్తోంది” అని ఆయన మండిపడ్డారు. బీజేపీ ప్రభుత్వ హయాంలో రూపాయి విలువ తగ్గడంతో పాటు సిపాయిల విలువ కూడా తగ్గిందని కామెంట్ చేశారు. ‘‘చివరకు బార్డర్ లో ప్రాణాలు పణంగాపెట్టి పోరాడుతున్న జవాన్లను కూడా బీజేపీ ప్రభుత్వం వదల్లేదు. అగ్నిపథ్ పేరుతో యువత కేవలం నాలుగేండ్లు ఉద్యోగం చేసి ఇండ్లకు పోవడమేంటి?” అని ప్రశ్నించారు. కేంద్రం ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే.. కేసీఆర్ మాత్రం ఎల్‍ఐసీ, బీహెఈఎల్ లాంటి సంస్థలకు పనులు అప్పజెప్పి వాటిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారన్నారు.
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలేవీ: ఎర్రబెల్లి
ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని చెప్పి బీజేపీ అధికారంలోకి వచ్చిందని, మరి ఆ ఉద్యోగాలేవీ? అని మంత్రి ఎర్రబెల్లి దయాకర్‍రావు ప్రశ్నించారు. కేసీఆర్ కార్మికుల సంక్షేమం కోసం పని చేస్తున్నారని, కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేస్తున్నారని అన్నారు. కార్మిక మాసోత్సవంలో భాగంగా హెల్త్ చెకప్స్, ఇన్సూరెన్స్. ఇండ్ల స్థలాలు పంపిణీతో పాటు కార్మికుల పిల్లలకు స్కూళ్లు, కాలేజీల్లో అడ్మిషన్లు ఇప్పిస్తున్నామని ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ తెలిపారు.
80 శాతం డెలివరీలు సర్కారు దవాఖానల్లోనే
రాష్ర్ట సర్కారు దవాఖానలు చరిత్ర సృష్టించాయని హెల్త్ మినిస్టర్ హరీశ్ రావు వెల్లడించారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో అత్యధిక డెలివరీలు నిర్వహించి..దేశ చరిత్రలోనే మన రాష్ట్రం సరికొత్త రికార్డు నెలకొల్పినట్లు బుధవారం ఆయన ట్వీట్ చేశారు. సంగారెడ్డి, నారాయణ్ పేట్, మెదక్, జోగులాంబ గద్వాల జిల్లాల్లో 80 శాతం పైగా ప్రసవాలు ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే అయ్యాయని తెలిపారు. 16 జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో 70 శాతం ప్రసవాలు నమోదైనట్లు చెప్పారు.
దసరాకల్లా వరంగల్ ఆస్పత్రి
వరంగల్ సెంట్రల్ జైలు స్థలంలో నిర్మిస్తున్న 24 అంతస్తుల సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనులు 68 శాతం పూర్తయ్యాయని.. దసరా నాటికి అందుబాటులోకి వస్తుందని హరీశ్ రావు చెప్పారు. బుధవారం హస్పిటల్ పనులను పరిశీలించిన తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. వరంగల్ జైలు భూమిని కుదువపెట్టి హాస్పిటల్ నిర్మాణం కోసం రూ.1,150 కోట్లు అప్పు తెచ్చిన విషయంపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వమే గ్యారంటీ సంతకం చేసి అప్పు తెచ్చిందని, ఆ అప్పును ప్రభుత్వమే కడుతుందన్నారు.