- రూ.2 లక్షల అప్పుకు..రూ.7 లక్షలు కట్టమన్న వడ్డీ వ్యాపారులు
- మట్వాడ మహిళా పోలీస్‌స్టేషన్ ఆవరణలో ఘటన
వరంగల్ సిటీ, వెలుగు : వడ్డీ వ్యాపారుల వేధింపులు భరించలేక మహిళా పోలీస్ స్టేషన్ ఆవరణలో ఓ మహిళ ఆత్మహత్యాయత్నం చేసుకుంది. ఈ ఘటన ఒక రోజు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చికిత్స పొందుతున్న బాధితురాలు ఆఫ్రీన్, ఆమె బంధువుల కథనం ప్రకారం.. వరంగల్ కొత్తవాడకు చెందిన ఆఫ్రీన్ ఏడాది కింద వడ్డీ వ్యాపారస్తులైన రెహాన్ దగ్గర రూ.70 వేలు, కున్న దగ్గర రూ. లక్షా 30 వేలు తీసుకుంది. రెహాన్ రోజుకు 750 చొప్పున వసూలు చేస్తుండగా, కున్న నెలకు రూ.30 వేల చొప్పున తీసుకునేవాడు. ఇలా ఇంతవరకు ఇద్దరికి రూ.లక్షా 70 వేల వరకు కట్టింది. మధ్యలో కొంత ఇబ్బంది కావడంతో కట్టలేదు. దీంతో కట్టిన డబ్బులను వడ్డీ కింద జమ చేసుకున్నారు. ఇంకా రూ.7 లక్షల వరకు కట్టాలని బెదిరిస్తున్నారు. ఇంటికి వచ్చి సతాయిస్తుండడంతో అఫ్రీన్ బుధవారం మట్వాడ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లింది.
అయితే పోలీసులు వడ్డీ వ్యాపారస్తులను పిలిపించినా బయటకు వెళ్లి మాట్లాడుకోవాలని పంపించారు. వారు పోలీస్‌స్టేషన్ ఆవరణలోకి వెళ్లి మాట్లాడుకుంటున్నారు. అయితే రెహాన్, కున్న తమకు రూ.7 లక్షలు ఇవ్వాల్సిందేనని బెదిరించడంతో ఏం చేయాలో తెలియక బ్యాగులో ఉన్న హెయిర్‌డై తాగింది. వెంట వచ్చిన మరో మహిళ అఫ్రీన్‌ను వరంగల్ ఎంజీఎం హాస్పిటల్లో చేర్పించింది. మట్వాడ పీఎస్సీఐ సీహెచ్ రమేశ్ మాట్లాడుతూ ఆఫ్రిన్ తమకు ఫిర్యాదు చేసిందని, తాము బయట మాట్లాడుకోవాలని చెప్పామని, కానీ వారి మధ్య గొడవ జరిగి ఆఫ్రీన్ హెయిర్‌డై తాగిందన్నారు. ఆమె కొడుకు ఫిర్యాదు ఇస్తే కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామన్నారు.