​ముంపు ముప్పుపై ఫోకస్ .. గ్రేటర్ నాలాల్లో పూడిక పేరుకుపోయి ఇబ్బందులు

​ముంపు ముప్పుపై ఫోకస్ .. గ్రేటర్ నాలాల్లో పూడిక పేరుకుపోయి ఇబ్బందులు
  • సరైన టైంలో డీసిల్టేషన్ జరగక సమస్యలు 
  • సిటీలో 33 నాలాల పూడికతీతకు ముందస్తు కసరత్తు
  • మే నెలాఖరు నాటికి పూర్తి చేసేలా యాక్షన్​

హనుమకొండ, వెలుగు: వరంగల్ నగరంలో పూడికతో నిండిన నాలాలు వరద ముంపునకు కారణమవుతున్నాయి. చెత్తాచెదారం, ప్లాస్టిక్ వ్యర్థాలు నిండిపోవడంతో వర్షాలు పడినప్పుడు ఆ నీళ్లన్నీ కాలనీలను ముంచెత్తుతున్నాయి. కాగా, ఏటా వర్షాలు సమీపిస్తున్న తరుణంలోనే నాలాల డీసిల్టేషన్​ ప్రక్రియ చేపట్టడం, ఆ తర్వాత నామమాత్రంగా పనులు చేపట్టి చేతులు దులుపుకోవడం పరిపాటిగా మారింది. దీంతో కాలనీల్లోకి వరద నీరు చేరి ఇబ్బందులు తలెత్తేవి. ఈ నేపథ్యంలో గ్రేటర్ మేయర్ గుండు సుధారాణి ఆదేశాల మేరకు ఈసారి ముందస్తు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. వర్షాకాల ప్రారంభానికి ముందే నాలాల డీసిల్టేషన్​ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు.

ఏటా హడావుడి పనులే..

గ్రేటర్​ వరంగల్ పరిధిలో నయీంనగర్, బొందివాగు, భద్రకాళితోపాటు వడ్డేపల్లి, సమ్మయ్యనగర్, కాకాజీకాలనీ, అలంకార్, పెద్దమ్మగడ్డ, శివనగర్, ఉర్సు డీకే నగర్, శాకరాసికుంట, 12 మోరీలు, రామన్నపేట, రంగంపేట పెద్ద మోరీ తదితర అన్నీ కలిపి 33 ప్రధాన నాలాలున్నాయి. అందులో చాలావరకు గుర్రపు డెక్క, చెత్తాచెదారం, ప్లాస్టిక్​ వ్యర్థాలు, పూడికతో నిండిపోయి వర్షాకాలం వచ్చిందంటే వరద ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడుతున్నాయి. 

దీంతో గ్రేటర్​ ఆఫీసర్లు ప్రతి ఏడాది పెద్ద మొత్తంలో నిధులు వెచ్చించి డీసిల్టేషన్​ ప్రక్రియ చేపడుతున్నారు. గడిచిన ఐదేండ్లలో పూడికతీత కోసం మొత్తంగా రూ.7.09 కోట్ల వరకు ఖర్చు చేయగా, గతేడాది రూ.90 లక్షలు, 2023లో రూ.2.32 కోట్లు, 2022లో రూ.1.69 కోట్లు ఖర్చు చేశారు. అందులో చాలావరకు పనులు పూర్తి చేయకుండానే కాంట్రాక్టర్లు నిధులు మిగుల్చుకున్నారనే ఆరోపణలు వచ్చాయి. 

నెల రోజులు టార్గెట్..

గతంతో పోలిస్తే ఈసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో ముంపు పరిస్థితులు తలెత్తకుండా గ్రేటర్​ ఆఫీసర్లు కసరత్తు చేస్తున్నారు. గత అనుభవాల దృష్ట్యా ముంపు ముప్పు తలెత్తకుండా ఈసారి వేసవిలోనే డీసిల్టేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు దాదాపు రూ.60 లక్షలు కేటాయించినట్లు తెలిసింది. ఈ మేరకు ఇప్పటికే డీసిల్టేషన్​కు సంబంధించిన టెండర్ల ప్రక్రియ మొదలు పెట్టగా, వచ్చే నెల మొదటి వారంలోగా పనులు స్టార్ట్ చేయాలని చూస్తున్నారు. 

జూన్​నుంచి వర్షాలు మొదలయ్యే అవకాశం ఉండటంతో ఆలోగా నాలాల డీసిల్టేషన్​ప్రక్రియ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు. కొందరు కాంట్రాక్టర్లు ఏటా నామమాత్రపు పనులతో సరిపెడుతుండగా, బల్దియాలోని కొందరు బడా ఆఫీసర్లే వారికి సహకరిస్తున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. పర్సంటేజీలకు ఆశపడి లైట్​తీసుకుంటున్నారనే విమర్శలున్నాయి. నాలాల డీసిల్టేషన్​ప్రక్రియ సమర్థవంగా పూర్తి చేసేందుకు గ్రేటర్​ఉన్నతాధికారులు తగిన చొరవ చూపాలని నగర ప్రజలు డిమాండ్​చేస్తున్నారు. 

మే చివరి నాటికి పూర్తి చేస్తం..

నాలాల పూడికతీతకు ఇప్పటికే చర్యలు ప్రారంభించాం. మే నెలాఖరు వరకు పనులన్నీ పూర్తి చేసేలా అధికారులకు ఆదేశాలిచ్చాం. టెండర్​ప్రక్రియ పూర్తి కాగానే పూడికతీత పనులు చేపట్టి, వర్షాకాలంలో ముంపు ముప్పు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటాం. 

గుండు సుధారాణి,  గ్రేటర్​ వరంగల్ మేయర్