- ముందుకు సాగని వరంగల్ ఇన్నర్ రింగ్ రోడ్డు పనులు
- పరిహారం ఇవ్వకుండానే భూముల చుట్టూ ఫెన్సింగ్ వేసిన ఆఫీసర్లు
- పైసలు రాక, భూములు లేక ఇబ్బందుల్లో రైతులు
- నెలలో పనులు స్టార్ట్ చేస్తామని కేటీఆర్‌కు హామీ ఇచ్చిన లీడర్లు
- కుడా, రెవెన్యూ ఆఫీసర్ల మధ్య కుదరని కో ఆర్డినేషన్
వరంగల్, వెలుగు : గ్రేటర్ వరంగల్ చుట్టూ నిర్మించాలనుకున్న ఇన్నర్ రింగ్ రోడ్డు పనులకు ఏళ్లు గడుస్తున్నా మోక్షం కలగడం లేదు. భూపాలపల్లి, ములుగు రోడ్డులోని దామెర జంక్షన్ నుంచి ఖమ్మం హైవేలోని నాయుడు పెట్రోల్ బంక్ వరకు రింగ్ రోడ్డు వేస్తామని కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ ఆఫీసర్లు రైతుల నుంచి నాలుగేళ్ల కిందే భూములు తీసుకున్నారు. కానీ రైతులకు పరిహారం చెల్లించేందుకు, రింగ్ రోడ్డు పనులు చేసేందుకు మాత్రం ముందుకు రావడం లేదు. దీంతో అటు పరిహారం రాక, ఇటు పనులు చేసుకోనివ్వక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
200 ఫీట్లు.. 8 కిలోమీటర్లు
హైదరాబాద్, కరీంగనగర్, భూపాలపల్లి, ములుగు, నర్సంపేట, ఖమ్మం మీదుగా వచ్చే భారీ వాహనాలు వరంగల్, హనుమకొండ నగరంలోకి రాకుండా దారి మళ్లించేందుకు ఇన్నర్ రింగ్ రోడ్డు నిర్మించాలని ప్లాన్ చేశారు. ఆరెపల్లి దామెర జంక్షన్ నుంచి కొత్తపేట, ఏనుమాముల మార్కెట్, జాన్‍పాక, కీర్తినగర్, స్తంభంపల్లి, చింతల్, ఖిలా వరంగల్, దూపకుంట రోడ్, గవిచర్ల క్రాస్‌రోడ్డు మీదుగా రంగశాయిపేట నాయుడు పెట్రోల్ బంక్ వరకు 8 కిలోమీటర్ల మేర 200 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి ప్రపోజల్స్ రెడీ చేశారు. ఈ రింగ్ రోడ్డుకు ఫండ్స్ సమకూర్చే బాధ్యతను కుడాకు, నిర్మాణ పనుల బాధ్యతను ఆర్‌అండ్‌బీ డిపార్ట్‌మెంట్‌కు అప్పగించారు. రింగ్ రోడ్డు నిర్మాణం కోసం 89.36 ఎకరాల భూమి అవసరం కాగా ఇందులో 60 నుంచి 70 ఎకరాలు ప్రైవేట్ వ్యక్తుల నుంచి సేకరించాల్సి ఉంది. 2010లో ప్రపోజల్స్ రెడీ చేయగా భూ సేకరణ కోసం 2012లో ప్రభుత్వం రూ. 20 కోట్లు కేటాయించింది. మొదటి దశలో 25 ఎకరాల భూసేకరణ పూర్తి కాగా, మిగతా 40 ఎకరాలను ఒకేసారి సేకరిస్తామని ఆఫీసర్లు చెప్పారు.
పరిహారం ఇవ్వకుండానే ఫెన్సింగ్ నాటిన్రు
ఇన్నర్ రింగ్ రోడ్డు భూ సేకరణ కోసం ఆఫీసర్లు 2019 మే 2న పేపర్ ప్రకటన ఇచ్చారు. రైతుల పర్మిషన్‌తో సంబంధం లేకుండానే తమకు అవసరమైన సర్వే నంబర్ల నుంచి భూమిని సేకరిస్తున్నట్లు ప్రకటించారు. మొత్తం 360 మంది నుంచి భూములు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. వారికి పరిహారం చెల్లించకుండానే భూములను స్వాధీనం చేసుకొని ఫెన్సింగ్, మొక్కలు నాటారు. గతంలో రూ. 3 వేల నుంచి రూ. 5 వేలు పలికిన గజం భూమి ప్రస్తుతం రూ. 12 వేల నుంచి రూ. 20 వేల మధ్య నడుస్తోంది. భూములు తీసుకున్న ఆఫీసర్లు పరిహారం ఇవ్వకపోవడం, సాగు చేసుకుందామంటే భూముల్లోకి రానివ్వకపోవడంతో రైతులు ఆందోళనకు దిగారు. తహసీల్దార్ మొదలు కలెక్టర్ వరకు, కార్పొరేటర్ మొదలు మినిస్టర్ వరకు కలిసి తమ సమస్యను విన్నవించారు. 2021 నవంబర్‍లో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ను కలువగా నెలలోపు అందరికీ పరిహారం ఇప్పిస్తానని మాటిచ్చారు. కానీ ఇంకా 210 మందికి పరిహారం అందలేదు. ఇటు పైసలు రాక, అటు భూములు లేక బిడ్డల పెండ్లి చేయకపోతున్నామని, అప్పులు కట్టలేకపోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రెవెన్యూ, కుడా ఆఫీసర్లు చెరో 10 సార్లు సర్వే చేసిన్రు
పరిహారం విషయాన్ని ఆఫీసర్లు, లీడర్లు పట్టించుకోవడం లేదు. సర్వేల పేరుతో ఏండ్ల తరబడి టైం వేస్ట్ చేస్తున్నారు. కుడా, రెవెన్యూ ఆఫీసర్లు ఇప్పటికే చెరో 10 సార్లు సర్వే చేసిన్రు. వారంలో కొత్త నోటిఫికేషన్ వేస్తామని ఆఫీసర్లు జనవరి నుంచి చెబుతున్నారు. పెరిగిన భూముల ధరలకు అనుగుణంగా పరిహారం ఇవ్వాలి.
- గంగుల దయాకర్ , ఐఆర్‌ఆర్ బాధితుల సంఘం అధ్యక్షుడు
మంత్రికి మాటిచ్చినా.. కలిసి పనిచేయట్లే
ఈ నెల 5న మంత్రి కేటీఆర్ వరంగల్ పర్యటన సందర్భంగా గ్రేటర్ కార్పొరేషన్, కుడా ఆఫీసర్లతో రివ్యూ నిర్వహించి ఇన్నర్ రింగ్ రోడ్డు పనులపై ప్రశ్నించారు. సమస్యలేమీలేవని, భూ సేకరణ దాదాపు పూర్తైందని నెల రోజుల్లోపు రోడ్డు పనులు ప్రారంభిస్తామని ఎమ్మెల్యేలు, ఆఫీసర్లు సమాధానం ఇచ్చారు. మంత్రికి మాటిచ్చి 10 రోజులు గడుస్తున్నా పనులు మాత్రం స్టార్ట్ కావడం లేదు. కో ఆర్డినేషన్‌తో పనిచేయాల్సిన కుడా, రెవెన్యూ ఆఫీసర్లు ఎవరికి వారుగా సర్వేలు చేస్తూ రిపోర్టులు తయారు చేస్తున్నారు. ప్రస్తుతం భూముల ధరలు పెరిగినందున మరోసారి గెజిట్ నోటిఫికేషన్ ఇచ్చి నిర్వాసితులతో చర్చలు జరపాల్సి ఉంటుంది. కోర్టు కేసులు ఉన్న ల్యాండ్ విషయంలో అసలు బాధితులకు డబ్బులిచ్చేలా ఫండ్స్ డిపాజిట్ చేయాలి. అన్ని శాఖల ఆఫీసర్లు కో ఆర్డినేషన్‌తో పనిచేయాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు చేప ట్టడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.