కేఎంసీలో మరోసారి ర్యాగింగ్​..జూనియర్‍ మెడికోను కొట్టిన సీనియర్లు

  • మంచినీళ్లు తెమ్మంటే తేలేదని రూమ్​కు వెళ్లి దాడి  
  •  మట్వాడా పీఎస్​లో 10 మందిపై ఫిర్యాదు
  •  ఏడుగురు సీనియర్లపై కేసులు నమోదు

వరంగల్‍/వరంగల్‍ సిటీ, వెలుగు : వరంగల్ కాకతీయ మెడికల్‍ కాలేజీలో ప్రీ ఫైనల్‍ ఎగ్జామ్స్​కు ప్రిపేర్‍ అవుతున్న జూనియర్‍ మెడికోను మంచినీళ్లు తెమ్మంటే తేలేదనే కారణంతో సీనియర్లు చితకబాదారు. ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. బాధితుడు మనోహర్‍, కేఎంసీ ప్రిన్సిపాల్‍ మోహన్‍దాస్‍, సీఐ వెంకటేశ్వర్లు కథనం ప్రకారం.. గుజరాత్‍ కు చెందిన మనోహర్‍ సోలంకి కేఎంసీలో ఎంబీబీఎస్‍ ఫస్ట్ ఇయర్​ చదువుతున్నాడు. పరీక్షలు ఉండడంతో ఈ నెల 13వ తేదీన అర్ధరాత్రి ప్రిపరేషన్‍ తర్వాత రీడింగ్‍ రూం నుంచి తానుండే ఎన్‍ఎంహెచ్‍-1 హాస్టల్‍కు బయలుదేరాడు. ఈ క్రమం లో బర్త్​డే పార్టీ చేసుకుంటున్న సీనియర్లు హాస్టల్‍ వద్ద నిలబడి ఉన్నారు. అటుగా వెళ్తున్న మనోహర్‍ను పిలిచి అందరికీ మంచినీళ్లు తెచ్చివ్వాలని ఆర్డర్​ వేశారు. అప్పటికే ఆలస్యం కావడంతో మనోహర్‍ వారు చెప్పిన పని చేయకుండా రూంకు వెళ్లాడు. దీంతో ఆగ్రహం చెందిన సీనియర్లు మనోహర్​ ఉండే గదికి వెళ్లి మరీ కొట్టారు. దీంతో అతడి మెడ, కడుపు భాగంలో గాయాలయ్యాయి. అధికారులకు సమాచారమిచ్చిన మనోహర్‍ 15న మట్వాడా పీఎస్​లో పోలీస్‍ స్టేషన్‍లో పదిమందిపై ఫిర్యాదు చేశాడు.   

బయటకు రానియ్యలే..

కేఎంసీలో ర్యాగింగ్‍ ఘటన 13వ తేదీ అర్ధరాత్రి జరిగితే ఆదివారం వరకు విషయాన్ని బయటకు రానివ్వకుండా అధికారులు దాచిపెట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు సీనియర్లు సాయికిరణ్‍, అభినవ్‍ మోరె, సిల్వర్‍ శ్రీహరి, సూర్యప్రకాశ్‍, లోకేశ్, హరికృష్టతో కలిపి మొత్తం ఏడుగురిపై సెక్షన్‍ 294/బీ, 323, 340 ప్రొహిబిషన్‍ ఆఫ్ ర్యాగింగ్‍ యాక్ట్​ కింద కేసులు నమోదు చేశారు. 

Also Rard:  బీసీ, మహిళా బిల్లులపై ఒత్తిడి పెంచుతం: నామా

 

మరికొందరిని గుర్తించాల్సి ఉందని వరంగల్‍ ఏసీపీ బోనాల కిషన్‍ తెలిపారు. బాధితుడు యూజీసికి సైతం ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. మంగళవారం కేఎంసీ యాంటీ ర్యాగింగ్‍ కమిటీ సమావేశమై బాధ్యులపై డిసిప్లినరీ యాక్షన్‍ తీసుకోనున్నట్లు తెలుస్తోంది.

మెడికో ప్రీతి సూసైడ్‍ మరువకముందే

ఈ ఏడాది ఫిబ్రవరిలో వరంగల్‍ కాకతీయ కాలేజీ ఫస్ట్​ఇయర్​ స్టూడెండ్‍ ధరావత్‍ ప్రీతిని సీనియర్‍ స్టూడెంట్‍ సైఫ్‍ ర్యాగింగ్‍ చేయడంతో ఆమె సూసైడ్‍ చేసుకుంది. ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ప్రీతి తాను పనిచేస్తున్న ఎంసీఎం హాస్పిటల్‍ వద్ద అనుమానాస్పద మృతిలో స్పృహ తప్పిపడిపోవడం, ట్రీట్‍మెంట్ అందించే క్రమంలో మరణించడంతో స్టూడెంట్‍ యూనియర్లు, గిరిజన, ప్రజా సంఘాలు ఆందోళనలకు దిగాయి. బాధ్యుడిపై చర్యలు తీసుకునే విషయంలో అధికారులు, పోలీసుల తీరుపై విమర్శలు వచ్చాయి. ఎన్నో అనుమానాలు, కోర్టు మొట్టికాయల తర్వాత చివరకు సైఫ్‍ ర్యాగింగ్‍ వల్లే జూనియర్‍ మెడికో చనిపోయిందని తేల్చారు. ఈ క్రమంలో కాలేజీలో ఎటువంటి ర్యాగింగ్‍ జరిగినా చాలా సీరియస్‍గా ఉంటుందని అధికారులు తేల్చిచెప్పారు. తీరాచూస్తే.. మరోసారి 10 మంది సీనియర్లు జూనియర్‍పై దాడి చేసి కొట్టడం సంచలనంగా మారింది.