కే హబ్ పనులు కదుల్తలేవ్.. నిర్మాణ దశలోనే కేయూ ఇంక్యుబేషన్​ సెంటర్​

  • కొత్త ఇన్నోవేషన్లు,  రీసెర్చ్​ కోసం శాంక్షన్​ చేసిన కేంద్ర ప్రభుత్వం
  • రూసా ఫండ్స్ రూ.50 కోట్లు కేటాయింపు
  • రెండేండ్లుగా సాగుతున్న పనులు 
  • పట్టించుకోని లీడర్లు, ఆఫీసర్లు

హనుమకొండ, వెలుగు:   కేంద్ర ప్రభుత్వ సహకారంతో వరంగల్​ కాకతీయ యూనివర్సిటీలో  ఏర్పాటు చేస్తున్న  కే హబ్​ నిర్మాణ పనులు కొనసాగుతూ ఉన్నాయి. స్టూడెంట్లలో  స్కిల్స్​ పెంచడంతో పాటు  ఇన్నోవేషన్స్,  రీసెర్చ్​ వైపు వారిని ఎంకరేజ్​ చేయాలనే ఉద్దేశంతో  కేంద్ర ప్రభుత్వం కే హబ్ శాంక్షన్​ చేసింది.  స్టార్టప్​ కంపెనీలకు ప్లాట్​ఫామ్​గా  నిలువడంతో పాటు రీసెర్చ్​ ల్యాబ్​ల  ఏర్పాటుకు ఈ  ఇంక్యుబేషన్​ సెంటర్ ఉపయోగపడ్తుంది.  అయితే దీని నిర్మాణ పనులు రెండేండ్లైనా పూర్తికాలేదు.   ప్రైవేటు వర్సిటీల్లో  ఇంక్యుబేషన్​ సెంటర్లను ఓపెనింగ్​ చేస్తున్న లీడర్లు, ఆఫీసర్లు యూనివర్సిటీలోని  కే హబ్​ను  లైట్ తీసుకోవడంతో   స్టూడెంట్లు,  రీసెర్చ్​ స్కాలర్స్​ అసహనం వ్యక్తం చేస్తున్నారు.  

రూ.50 కోట్లు శాంక్షన్​.. 

కేయూకు  రాష్ట్రీయ ఉచ్ఛతర్​ శిక్షా అభియాన్(రూసా) కింద కేంద్ర ప్రభుత్వం  కే -హబ్​ శాంక్షన్​ చేసింది. పరిశోధనలకు అనువుగా బిల్డింగ్​తో  పాటు ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ ల్యాబ్స్​ డెవలప్​ మెంట్​, ఇతర అన్ని రకాల సౌలతులు కల్పించేందుకు రూ.50 కోట్లు కూడా మంజూరు చేసింది.  ఇందులో మొదటి విడత పనుల్లో భాగంగా మూడు అంతస్తుల్లో  బిల్డింగ్​ కన్​స్ట్రక్షన్​ కోసం రూ.6  కోట్లు రిలీజ్​ చేసింది.  బిల్డింగ్​ కన్​ స్ట్రక్షన్​ తర్వాత ఇందులోనే  వివిధ డిపార్ట్​మెంట్లకు చెందిన ల్యాబులు  ఏర్పాటు చేయాల్సి ఉంది.  సెంటర్​ ఫర్​ ప్లాంట్​ జీనోమ్​ ఎడిటింగ్,  సెంటర్​ ఫర్​ ఇండిజీనియస్​ కల్చర్స్​, సెంటర్​ ఫర్​ జియోలాజికల్​ సైన్స్​ అండ్​  మైనింగ్​, సెంటర్​ ఫర్​ డ్రగ్​ డిజైన్​ అండ్​ డెవలప్​మెంట్​,  సెంటర్​ ఫర్​ నానో డ్రగ్​ డెలివరీ సిస్టమ్స్​, సెంటర్​ ఫర్​ మాలిక్యూలర్​ బయోలజీ అండ్​ మైక్రోబియల్​ టెక్నాలజీ తదితర ల్యాబ్స్ తో  పాటు స్టార్టప్​ కంపెనీలు ఏర్పాటు చేసుకునేందుకు ఇంక్యుబేషన్​ సెంటర్​ కూడా ఇందులోనే  ఏర్పాటయ్యే చాన్స్​ ఉంది.  ఇవన్నీ అందుబాటులోకి  వస్తే  ఆయా డిపార్ట్​మెంట్లలో ఉన్నత పరిశోధనలు జరిగే అవకాశం ఉంటుంది. 

ప్రైవేటుపైనే నజర్​..

కేయూలో  రీసెర్చ్​లకు  అనుగుణంగా ల్యాబ్స్​ లేకపోవడంతో  ఇబ్బందులు వస్తున్నాయని వివిధ కోర్సులు అభ్యసిస్తున్న  స్టూడెంట్లు ఆరోపిస్తున్నారు.  పరిశోధనలు సరిగా జరగడం లేదని చెప్తున్నారు.  పరిశోధనలతో పాటు స్టార్టప్​ కంపెనీలను ప్రోత్సహించేలా  మోడ్రన్​ ల్యాబ్స్​, ఇంక్యుబేషన్​ సెంటర్​ ప్రారంభమైతే  ఎంతగానో హెల్ప్​ అవుతుంది.  కానీ కే -హబ్​ పనులు,  ఓపెనింగ్​పై  లీడర్లు, ఆఫీసర్లు పెద్దగా పట్టించుకోవడం లేదనే విమర్శలున్నాయి.  మొన్ననే  వరంగల్ సిటీకి  వచ్చిన మంత్రి  కేటీఆర్​ ఉమ్మడి జిల్లా ప్రజాప్రతినిధులతో కలిసి ఎర్రగట్టుగుట్ట సమీపంలోని ఓ ప్రైవేట్​ కాలేజీలో ఇంక్యుబేషన్​ సెంటర్ ప్రారంభించారు. కానీ కాకతీయ యూనివర్సిటీలో నిర్మాణంలో ఉన్న కే -హబ్​ ఊసే ఎత్తలేదు. ఇకనైనా కే -హబ్ పనులు స్పీడప్​చేసి వీలైనంత  తొందరగా అందుబాటులోకి తీసుకురావాలని స్టూడెంట్స్​ డిమాండ్​ చేస్తున్నారు.

స్లోగా పనులు..

కే -హబ్​ పనులకు 2020 లోనే  అడ్మినిస్ట్రేషన్​ శాంక్షన్​ ఇవ్వగా..  కరోనా లాక్​ డౌన్​తో పనులు కాస్త ఆలస్యంగా స్టార్ట్ అయ్యాయి.  టీఎస్​ఈ డబ్ల్యూఐడీసీ(తెలంగాణ స్టేట్​ ఎడ్యుకేషనల్​ వెల్ఫేర్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​ మెంట్​ కార్పొరేషన్​) ఆధ్వర్యంలో  టెండర్లు పిలవగా.. ఓ ప్రైవేటు సంస్థ పనులు దక్కించుకుంది. 2021 లో  షురువైన పనులు ఆఫీసర్ల మానిటరింగ్​ లేక స్లోగా నడుస్తున్నాయి. తొందర్లోనే కే -హబ్​ను అందుబాటులోకి  తీసుకొస్తామని వర్సిటీ ఆఫీసర్లు పలుమార్లు చెప్పినప్పటికీ..  పనులు ఇంతవరకు పూర్తి కాలేదు.  ఫేజ్​ వన్​ కింద బిల్డింగ్​ కన్​స్ట్రక్షన్  వరకు  కంప్లీట్​ అయినా..  ల్యాబ్​లు, ఇంక్యుబేషన్​ సెంటర్లకు సంబంధించిన ఎక్విప్​మెంట్​ ఏర్పాటు చేయాల్సి ఉంది.  కానీ ఇంతవరకు ఆఫీసర్లు  కే -హబ్ ను పట్టించుకున్న దాఖలాలు  లేవని,  మిగతా పనులన్నీ ఎప్పుడు పూర్తి  చేస్తారో  తెలియని పరిస్థితి ఉందని స్టూడెంట్లు వాపోతున్నారు.  దీంతో ఈ అకడమిక్​ ఇయర్​ లోనైనా కే హబ్​ అందుబాటులోకి వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 

ఈ ఏడాదైనా అందుబాటులోకి తేవాలి

యూనివర్సిటీలో రీసెర్చ్​కు అంతగా సౌలతులు లేవు. కే హబ్​ తొందరగా స్టార్ట్​ చేస్తే మాకెంతో యూజ్​ఫుల్​గా ఉంటది. దీన్ని అందుబాటులోకి తేవడానికి ఇక్కడి లీడర్లు, ఆఫీసర్లు చొరవ తీసుకుంటలేరు.  ఇట్లయితే రీసెర్చ్​ , ఇన్నోవేషన్ ​రంగాల్లో ప్రైవేట్​ వర్సిటీల్లో చదివే స్టూడెంట్లతో పోలీస్తే మేం వెనకబడిపోయే చాన్స్​ ఉంది.
- వీరబోయిన తిరుపతి స్వామి, కేయూ స్టూడెంట్​