వరంగల్​, కరీంనగర్ స్మార్ట్​సిటీ కలలు కరిగిపోతున్నయ్

  • గత్యంతరం లేక  ప్రాజెక్టులను తగ్గించుకుంటున్న ఆఫీసర్లు
  • గ్రేటర్​ వరంగల్ లో 101 పనుల్లోంచి 39 పనులు కట్​
  • లిస్టులోంచి ఎగిరిపోయిన హనుమకొండ స్మార్ట్​ బస్టాండ్​
  • కరీంనగర్​లోనూ మల్టీ లెవెల్
  • కార్ ​పార్కింగ్​ జోన్​, కమాండ్​ కంట్రోల్​ సిస్టమ్ ​గాయబ్?
  • రెండేండ్ల గడువు పొడిగించినా ఇంకా పెండింగ్​లోనే పనులు

హనుమకొండ/కరీంనగర్​, వెలుగు: రాష్ట్ర సర్కారు నిర్లక్ష్యం వల్ల వరంగల్​, కరీంనగర్ నగరవాసుల స్మార్ట్​సిటీ కలలు కరిగిపోతున్నాయి. కేంద్రం ఇచ్చే ఫండ్స్​కు తగినట్లు సకాలంలో మ్యాచింగ్​ గ్రాంట్ ​రిలీజ్​ చేయకపోవడంతో పైసల్లేక రెండుచోట్ల స్మార్ట్​సిటీ పనులు ఎక్కడియక్కడ ఆగిపోతున్నాయి. చిన్నాచితక పనులే ముందరపడని పరిస్థితుల్లో ప్రధాన ప్రాజెక్టులపై ఆఫీసర్లు ఆశలు వదులుకుంటున్నారు. వరంగల్​లో మొదట అనుకున్న 101 ప్రాజెక్టులను 62కి తగ్గించిన ఆఫీసర్లు కీలకమైన హనుమకొండ స్మార్ట్ సిటీ​ బస్టాండ్​ను లిస్టులోంచి తొలగించారు. అటు కరీంనగర్​లోనూ మల్టీ లెవెల్​ కార్ ​పార్కింగ్​ జోన్​, కమాండ్​ కంట్రోల్​ సిస్టమ్ ​లాంటి 40 ప్రాజెక్టులను దాదాపు పక్కనపెట్టేశారు.

అంచనాలకు మించి ప్రాజెక్టులు.. 

2016 జూన్​లో  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన స్మార్ట్​సిటీ ప్రాజెక్టు కింద రాష్ట్రంలోని వరంగల్, కరీంనగర్  ఎంపికయ్యాయి. 2016 –17 నుంచి ఐదేండ్ల పాటు కేంద్రం ఏటా రూ.100 కోట్ల చొప్పున ఇస్తే మరో రూ.100 కోట్లను రాష్ట్ర సర్కారు మ్యాచింగ్​ గ్రాంట్​గా ఇవ్వాలి. అలా వచ్చే రూ.వెయ్యి కోట్ల ఫండ్స్​తో ఈ రెండు సిటీల్లోనూ రోడ్లు, జంక్షన్లు, పార్కులు, బస్​బేలు, ఇతరత్రా మౌలిక వసతులు అభివృద్ధి చేయాలి. కానీ రాష్ట్ర సర్కారు మొదటి రెండు విడతల మ్యాచింగ్ గ్రాంటే ఇప్పటివరకు పూర్తిస్థాయిలో ఇవ్వకపోవడంతో మిగిలిన మూడు విడతల ఫండ్స్​ ఆగిపోయాయి. వాస్తవానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి ఫండ్స్ వస్తాయనే ఆశతో వరంగల్​ స్మార్ట్​సిటీ డీపీఆర్​ను రూ.2,860 కోట్లతో,  కరీంనగర్ డీపీఆర్​ను  రూ. 1878 కోట్లతో ఆఫీసర్లు రూపొందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఐదేండ్లలో వెయ్యి కోట్లు ఇస్తే మిగిలిన మొత్తాన్ని పీపీపీ (పబ్లిక్  ప్రైవేట్ పార్ట్​నర్​షిప్​ ) పద్ధతిలో సేకరించాలని భావించారు. కానీ రాష్ట్ర సర్కారు సకాలంలో మ్యాచింగ్ ​గ్రాంట్స్​ఇవ్వకపోవడంతో కేంద్రం నుంచి రావాల్సిన ఫండ్స్​ కూడా ఆగిపోయి స్మార్ట్​సిటీ పనులన్నీ సందేహంలో పడ్డాయి. 

వరంగల్​లో పనుల కుదింపు  

వరంగల్​లో దాదాపు రూ.2,860 కోట్ల అంచనా వ్యయంతో మొత్తం 101 ప్రాజెక్టులకు ప్రపోజల్స్ రెడీ చేసి ​రాష్ట్రప్రభుత్వానికి పంపించారు. స్మార్ట్​సిటీ కింద ఎంపికైన వరంగల్​కు కేంద్ర ప్రభుత్వం  2016–19 మధ్య రూ.100 కోట్లు, 2019–20 మధ్య మరో రూ.96 కోట్లు విడుదల చేసింది. మ్యాచింగ్​ గ్రాంట్​ కింద రాష్ట్రప్రభుత్వం కూడా రూ.196 కోట్లు రిలీజ్​ చేసి, పనులయ్యాక యూసీలు సబ్మిట్​ చేస్తే కేంద్రం మిగతా గ్రాంట్​ను విడుదల చేసేది. కానీ రాష్ట్ర సర్కారు మూడేండ్ల పాటు అటు మ్యాచింగ్ ​గ్రాంట్​ ఇవ్వక, ఇటు పనులు పూర్తిచేసి యూటీలను సమర్పించకపోవడంతో కేంద్రం నుంచి ఫండ్స్​ ఆగిపోయాయి. చివరికి గ్రేటర్​ వరంగల్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని నగరంలో వివిధ పనులు స్పీడప్​ చేసేందుకు 2021–22లో తన గ్రాంట్​ కింద రూ.50 కోట్లు రిలీజ్​ చేసి చేతులుదులుపుకుంది. ఈలోగా 2020 ఆగస్టులో వచ్చిన వరదలతో సిటీలో చాలా లోపాలు బయటపడడం, సరిపడా ఫండ్స్​ లేకపోవడంతో  గ్రేటర్​ ఆఫీసర్లు, స్మార్ట్​ సిటీ అడ్వైజరీ ఫోరమ్​ మీటింగ్​ నిర్వహించి ప్రపోజల్స్​ లో మార్పులు చేశారు.

101 ప్రాజెక్టులను 83కు కుదించారు

ఈక్రమంలో 101ప్రాజెక్టులను 83కు కుదించారు. ఫండ్స్​ కూడా రూ.2,328 కోట్లకు తగ్గించుకున్నారు. ఈ క్రమంలోనే 2021 జూన్​ నాటికి స్మార్ట్ సిటీ స్కీం గడువు ముగిసిపోవడం, తర్వాత కేంద్రం మరో రెండేండ్లు గడువు ఇవ్వడంతో ఇప్పుడు ఆ ప్రాజెక్టులను 62కు కుదించారు. ఇప్పటికే స్మార్ట్ రోడ్లు, ఇతర పనులు నత్తనడకన సాగుతుండగా.. తాజాగా కుదించిన పనుల్లో ముఖ్యమైన పనులు పక్కన పెట్టారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఉదాహరణకు స్మార్ట్ సిటీ కింద రూ.100 కోట్లతో డెవలప్​ చేసేందుకు ఎంపిక చేసిన హనుమకొండ బస్టాండ్ పనులను ఇప్పుడు లిస్ట్​ లోంచి తొలగించారు. దీంతో మళ్లీ దాన్ని ఎప్పుడు, ఎలా డెవలప్​ చేస్తారో తెలియని పరిస్థితి. ​పీపీపీ పద్ధతిలో రూ.135 కోట్లతో హనుమకొండ అశోక సెంటర్, భద్రకాళి టెంపుల్​ వద్ద ప్లాన్​ చేసిన పార్కింగ్​ ఏరియా డెవలప్​ మెంట్​ ప్రాజెక్ట్​ పనులు కూడా క్యాన్సిల్ చేశారు. వీటితో పాటు కమాండ్​ కంట్రోల్​ సెంటర్​, జూపార్క్​, పోతన మ్యూజియం డెవలప్​మెంట్, చిన్నవడ్డేపల్లి చెరువు అభివృద్ధి,​ ఇలా ముఖ్య మైన పనులన్నింటినీ పక్కనపెట్టారు. రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి ప్రణాళికాబద్ధంగా నడుచుకుంటే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

కరీంనగర్​లో రోడ్లు.. డ్రైనేజీలే.. 

స్మార్ట్​సిటీ కింద ఎంపికైన కరీంనగర్​కు సైతం కేంద్ర ప్రభుత్వం  2016 –19 మధ్య రూ.100 కోట్లు, 2019–20 మధ్య మరో రూ.96 కోట్లు రిలీజ్​చేసింది. 2021-దాకా పైసా ఇయ్యని రాష్ట్ర సర్కారు 2021– 22 లో 80 కోట్లు, 2022– 23 లో 80 కోట్లు ఇచ్చింది.  ఇంకా బ్యాలెన్స్​ రూ. 36 కోట్లు రిలీజ్​చేసి, పూర్తయిన పనులకు సంబంధించిన యూటీలు సమర్పిస్తే తప్ప కేంద్రం నుంచి ఫండ్స్​ వచ్చేలా లేవు. ఇప్పటికే స్మార్ట్​ సిటీ స్కీము గడువును కేంద్రం రెండేళ్లు పొడిగించింది. అది కూడా వచ్చే ఏడాది జూన్​తో ముగుస్తుంది. కానీ ఫండ్స్​లేక పనులన్నీ అసంపూర్తిగా మిగిలాయి. మొత్తంగా 40 ప్రాజెక్టులు ప్రమాదంలో పడ్డాయి. కొన్నింటికి టెండర్లు ప్రాసెస్ లో ఉన్నాయని ఆఫీసర్లు చెప్తున్నా చాలావరకు డీపీఆర్ దశ దాటలేదు. మల్టీ పర్పస్ స్కూల్ ఆవరణలో రూ.7.2 కోట్లతో చేపట్టిన పార్కు నిర్మాణం 50 శాతమే పూర్తయింది. రూ. 16.90 కోట్లతో అమృత్​సర్ ​మాదిరి అభివృద్ధి చేస్తామన్న టవర్ సర్కిల్ కు అతీగతి లేకుండా పోయింది.

ఇక సిటీలో కీలకమైనదిగా భావిస్తున్న మల్టీ లెవల్ కార్ పార్కింగ్ జోన్​కు ఆఫీసర్లు మంగళం పాడినట్లే చెప్తున్నారు. ఈ ఒక్క ప్రాజెక్టుకే రూ. 100 కోట్లు ఖర్చయ్యే అవకాశముంది. రూ.150కోట్లతో చేపడుతామన్న కమాండ్ కంట్రోలింగ్ సిస్టమ్ ఊసే ఎత్తడం లేదు. రూ. 50 కోట్లతో  వేములవాడ బై పాస్ లో టూరిజం డెవలప్ మెంట్ ప్రతిపాదన, రూ. 25 కోట్లతో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆధునికీకరణ, రూ.12 కోట్లతో చేపడుదామనుకున్న గంజ్ హైస్కూల్ డిజిటల్  క్లాస్ రూమ్స్​కు అతిగతి లేకుండా పోయింది. డిజిటల్ లైబ్రరీ, వైఫై జోన్స్, మాడర్న్​ స్లాటర్ హౌజ్,  సిగ్నలింగ్, సెక్యూరిటీ కెమెరాలు, వేస్ట్ వాటర్ మేనేజ్ మెంట్  వంటి ప్రాజెక్టులపైనా నీలినీడలు కమ్ముకుంటున్నాయి. 

ముఖ్యమైన వాటికి ప్రాధాన్యం దక్కలే

వరంగల్​లో స్మార్ట్​ సిటీ కింద గుర్తించిన పనులు ఇప్పటికే పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇంతవరకు సగం కూడా కాలేదు. చేపట్టిన పనులు కూడా  ఏండ్ల తరబడి సాగుతూనే ఉన్నాయి. వాస్తవానికి స్మార్ట్​ సిటీలో భాగంగా ఇప్పటివరకు చేపట్టి పనుల్లో జనాలకు అవసరమయ్యే, ముఖ్యమైన పనులకు ప్రాధాన్యం దక్కలేదు. ఇదే విషయాన్ని ఇదివరకు జరిగిన మీటింగుల్లో కూడా ప్రస్తావించాం. నగర జనాభా, ఇక్కడి అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రాధాన్య క్రమంలో పనులు చేపడితే బాగుంటుంది.

– పుల్లూరు సుధాకర్​, స్మార్ట్​సిటీ అడ్వయిజరీ ఫోరమ్​మెంబర్