స్పెషలాఫీసర్ల పాలన షురూ

హైదరాబాద్, వెలుగు: వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట మున్సిపాలిటీలో స్పెషలాఫీసర్ల పాలన షురూ కానుంది. ఈ మున్సిపల్ పాలకవర్గాల గడువు ముగియడంతో ప్రభుత్వం నియమించిన స్పెషల్ ఆఫీసర్లు సోమవారం ఉదయం బాధ్యతలు చేపట్టనున్నారు. వీటితో పాటు ఇంకో ఐదు మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉన్నా.. ప్రభుత్వం వార్డుల విభజన పూర్తి చేయలేదు. దీంతో స్పెషలాఫీసర్ల పాలన అనివార్యమైంది. సిద్దిపేట మున్సిపాలిటీ పాలకవర్గం గడువు ఇంకో నెల రోజుల్లో ముగియనుండటంతో అక్కడా స్పెషల్ ఆఫీసర్కే పగ్గాలు అప్పగించనున్నారు. ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ మొత్తం పూర్తి చేసి ఎన్నికలు నిర్వహించడానికి ఇంకో 45 రోజులకు పైగా టైం పడుతుందని ఆఫీసర్లు చెప్తున్నారు. 

మేలో ఎన్నికలకు చాన్స్

వరంగల్, ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్లు, అచ్చంపేట, సిద్దిపేట, జహీరాబాద్, నకిరేకల్, కొత్తూరు, జడ్చర్ల మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహించడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ నిరుడు డిసెంబర్లోనే సన్నద్ధత వ్యక్తం చేసింది. వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రాసెస్ పూర్తి చేయాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాసింది. అప్పుడు ప్రభుత్వం దానిని పక్కన పెట్టడంతో ఎన్నికలు నిర్వహించలేకపోయారు. కొత్తగా ఏర్పడిన కొత్తూరు, నకిరేకల్, జడ్చర్ల మున్సిపాలిటీల చైర్పర్సన్ స్థానాలకు రిజర్వేషన్లు ఖరారు చేయాల్సి ఉంది. మున్సిపాలిటీల్లో వార్డుల విభజన ప్రక్రియ ఈ నెల 30తో పూర్తికానుంది. ఆ తర్వాత స్టేట్ ఎలక్షన్ కమిషన్ వార్డుల వారీగా ఓటర్ల లిస్టు ప్రకటిస్తుంది. ఎస్ఈసీ ప్రకటించే ఓటర్ల లిస్టు ఆధారంగా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ బీసీ ఓటర్ల గణన చేపట్టి, అభ్యంతరాలు స్వీకరించాల్సి ఉంటుంది. అనంతరం వార్డుల వారీగా రిజర్వేషన్లు ఖరారు చేసి, వాటిలో సగం వార్డుల చొప్పున మహిళలకు రిజర్వ్ చేయాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రాసెస్ ఏప్రిల్లో పూర్తి చేసే చాన్స్ ఉన్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం వార్డులు, మున్సిపల్ చైర్పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు చేసి ఎస్ఈసీకి అందజేస్తే ఆ తర్వాత ఎలక్షన్ నోటిఫికేషన్ జారీ చేస్తారు.  ప్రీ ఎలక్షన్ ప్రాసెస్ మే నెలలో పూర్తి చేసే అవకాశమున్నట్టు ఆఫీసర్లు  చెప్తున్నారు. మే నెలాఖరులో ఆయా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించే అవకాశమున్నట్టు పేర్కొంటున్నారు.