వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ కొనసాగుతోంది. మధ్యాహ్నం 2 గంటల వరకు 50 శాతం పోలింగ్ నమోదైంది. అత్యధికంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లాలో 50.52 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. మే 27వ తేదీ సోమవారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మూడు ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 605 పోలింగ్ స్టేషన్లలో పోలింగ్ జరగుతోంది. మొత్తం 4 లక్షల 63 వేల 839 మంది గ్రాడ్యుయేట్ ఓటర్లు ఓటు వేయనున్నారు.
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల బైపోల్ లో ఓటర్లను ప్రలోభాలకు గురిచేసేందుకు పార్టీల నాయకులు డబ్బులు పంచుతున్నారన్న ఆరోపణలతో పోలీసులు.. పోలింగ్ బూత్ ల దగ్గర తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హనుమకొండలోని ఆర్ట్స్ కాలేజి పోలింగ్ కేంద్ర ముందు ఓటర్లకు డబ్బులు పంచుతున్న వారిని పట్టుకున్నారు. ఓ వ్యక్తి దగ్గర నుంచి రూ.10 వేల పట్టుకున్నారు. ఆ డబ్బులు బీఆర్ఎస్ నాయకులవేనని కాంగ్రెస్, బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు.