బిల్లులు రాలేదని మనస్తాపం.. కేయూలో గ్రేడ్-4 ఉద్యోగి మృతి

బిల్లులు రాలేదని మనస్తాపం.. కేయూలో గ్రేడ్-4 ఉద్యోగి మృతి

హనుమకొండ, వెలుగు : చేసిన పనులకు 8 నెలలుగా బిల్లులు రాకపోవడంతో మనస్తాపం చెందిన వరంగల్ ​కాకతీయ యూనిర్సిటీ ఉద్యోగి చనిపోయాడు. వర్సిటీ ఆఫీసర్లను నమ్ముకుని పనులు చేయిస్తే, బిల్లులు ఆపి వేధించారని మృతుని కుటుంబసభ్యులు ఆరోపిస్తూ డెడ్​బాడీతో ఆందోళనకు దిగారు. వారి కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన కాలె మధుసూదన్(42) కేయూలో గ్రేడ్–4 ఉద్యోగి. జాబ్​తోపాటు వర్సిటీలో టెండర్లు దక్కించుకుని కాంట్రాక్ట్ ​వర్క్స్ ​చేయిస్తుంటాడు. న్యాక్ A+ గ్రేడ్ కోసం.. వర్సిటీ అధికారులు రూ.30 లక్షల పనులకు టెండర్ ​వేయగా, మధుసూదన్ ​దక్కించుకున్నాడు. గతేడాది మార్చి, ఏప్రిల్​లో పనులు పూర్తిచేశాడు. అయితే బిల్లులు చెల్లించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించారు.

మొదట కొంత మొత్తాన్ని చెల్లించి .. తర్వాత పట్టించుకోలేదు. వాటి కోసం పలుమార్లు న్యాక్​ పర్చేసర్​ కమిటీ మెంబర్ల తోపాటు వర్సిటీ ఉన్నతాధికారులను సంప్రదించాడు. ఫలితం లేకపోవడంతో మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే ఆరోగ్యం దెబ్బతినింది. ఈ నెల 2న పక్షవాతం రావడంతో ప్రైవేట్​ హాస్పిటల్​లో అడ్మిట్​ అయ్యాడు. అక్కడ చికిత్స పొందుతూ కోమాలోకి వెళ్లాడు. అక్కడి నుంచి హైదరాబాద్ లోని హాస్పిటల్​కు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ ఆదివారం చనిపోయాడు. మృతుడికి భార్య, కూతురు, కొడుకు ఉన్నారు.

డెడ్​బాడీతో వీసీ బిల్డింగ్​ ఎదుట ఆందోళన

వర్సిటీ అధికారులు సకాలంలో బిల్లులు రిలీజ్ చేయకపోవడంతోనే మధుసూదన్​ చనిపోయాడని కుటుంబసభ్యులు ఆదివారం సాయంత్రం డెడ్​బాడీతో అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు ఆందోళనకు దిగారు. రాత్రి వరకు వీసీ బిల్డింగ్​ఎదుట నిరసన తెలిపారు. కేయూ విద్యార్థి, ఉద్యోగ సంఘాల నేతలు మద్దతు తెలిపారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొనడంతో హనుమకొండ ఏసీపీ కిరణ్ కుమార్, పోలీస్ అధికారులు వచ్చి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. వినకపోవడంతో ఏసీపీ కేయూ వీసీ తాటికొండ రమేశ్​కు ఫోన్​ చేసి, మృతుడి భార్య కోమలతో మాట్లాడించారు. వీసీ హామీతో ఆందోళన విరమించారు.