వరంగల్: కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో నిబంధనలు పాటించడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. కొందరికి అనుకూలంగా నోటిఫికేషన్ లోని రూల్స్ ను అధికారులు మార్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పార్ట్ టైం అభ్యర్ధులకు అవకాశం ఇవ్వటాన్ని విద్యార్థులు తప్పుపడుతున్నారు. కాకతీయ యూనివర్సిటీ పీహెచ్డీ ఆడ్మిషన్లపై గందరగోళం కొనసాగుతోంది. కొంతమందికి అనుకూలంగా చివరి నిమిషంలో అధికారులు రూల్స్ మార్చారంటూ స్టూడెంట్స్ మండిపడుతున్నారు. అధికారుల తీరుకు వ్యతిరేకంగా ఆందోళనకు సిద్ధమవుతున్నారు. యూజీసీ గైడ్ లైన్స్ ప్రకారం పీహెచ్ డీ కేటగిరి వన్ అడ్మిషన్లకు ఫుల్ టైమ్ స్కాలర్స్ అర్హులంటూ మొదట నోటిఫికేషన్ విడుదల చేశారు. అప్లికేషన్స్ తీసుకొని గత నెల 20 నుంచి 28 వరకు డిపార్ట్ మెంట్ల వారీగా ఇంటర్వ్యూలు నిర్వహించారు. చివరి రోజు మే 28 న నోటిఫికేషన్ రూల్స్ లో ఫుల్ టైమ్ తప్పనిసరి అనే నిబంధనను సవరించారు. ప్రభుత్వ డిగ్రీ, పీజీ కాలేజీల్లో పని చేసే అధ్యాపకులకు 25 శాతం కేటగిరీ వన్ సీట్లు ఇచ్చేలా మార్పులు చేశారు.
లెక్చరర్లకు అనుకూలంగా..
అకడమిక్ రికార్డ్స్ రిసెర్చ్ పబ్లికేషన్, ప్రజంటేషన్, ఇంటర్వ్యూ తరువాత వచ్చిన మెరిట్ ఆధారంగా పీహెచ్డీలో అడ్మిషన్లు కల్పిస్తారు. అభ్యర్థులు ఇతర సంస్థల్లో పని చేస్తున్నట్లయితే ఇంటర్వ్యూకు ముందే నో ఆబ్జెక్షన్ సర్టిఫికెట్ సమర్పించాల్సి ఉంటుంది. అయితే పీజీ, డిగ్రీ కాలేజీలలో పనిచేస్తున్న లెక్చరర్లకు అనుకూలంగా నిబంధనలు మార్చారని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. కేయూ పీహెచ్డీ అడ్మిషన్లలో జరిగిన తప్పిదాలపై ఉన్నత విద్యామండలి చైర్మన్ కు ఫిర్యాదు చేస్తామని వారు చెబుతున్నారు. కాగా.. డీన్ కమిటీ ఆదేశాల మేరకు 25 శాతం పార్ట్ టైం రిసెర్చ్ స్కాలర్ కు పీహెచ్ డీ లో అవకాశం కల్పించామని వర్సిటీ రిజిస్టార్ ప్రొఫెసర్ వెంకటరాం రెడ్డి చెబుతున్నారు. ఎంపికలో తప్పిదాలు జరగలేదని ఆయన తెలిపారు. ఇంటర్వ్యూలు పూర్తయ్యే టైమ్ లో చివరిరోజు రూల్స్ ఎలా మారుస్తారని విద్యార్థులు ప్రశ్నిస్తున్నారు. దీనిపై సత్వరమే ఉన్నత విద్యామండలి విచారణ జరపాలని డిమాండ్ చేస్తున్నారు.