- కేసీఆర్‌కు లేఖ రాసిన వరంగల్ లోక్ సభ అభ్యర్థి
- అవినీతి, లిక్కర్ స్కామ్‌తో బీఆర్‌ఎస్ ప్రతిష్ట దిగజారింది
- జిల్లా నాయకుల సహకారం లేదు
- ఈ పరిస్థితుల్లో పోటీ చేయలేనని ప్రకటన
హైదరాబాద్, వెలుగు : బీఆర్‌ఎస్‌కు ఆ పార్టీ వరంగల్ లోక్‌సభ అభ్యర్థి కడియం కావ్య షాక్ ఇచ్చారు. ఎన్నికల రేసు నుంచి తప్పుకుంటున్నానని కేసీఆర్‌కు గురువారం ఆమె లేఖ రాశారు. అవినీతి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయని, వరంగల్‌లో పార్టీ నేతల మధ్య సమన్వయం లేదని ఆమె తన లేఖలో పేర్కొన్నారు.
ఇలాంటి పరిస్థితుల్లో తాను పోటీ చేయలేనని స్పష్టం చేశారు. ‘‘కొన్ని రోజులుగా పార్టీ నాయకత్వంపై మీడియాలో వస్తున్న అవినీతి, భూ కబ్జాలు వార్తలు, ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్ వంటి వ్యవహారాలు పార్టీ ప్రతిష్టను దిగజార్చాయి. జిల్లాలోని నాయకుల మధ్య సమన్వయం, సహకారం లేదు. ఎవరికి వారే యమునా తీరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో పార్టీకి మరింత నష్టం కలుగుతోంది. ఈ పరిస్థితుల్లో నేను పోటీ నుంచి విరమించుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అని తన లేఖలో కావ్య పేర్కొన్నారు. ఈ విషయంలో కేసీఆర్, పార్టీ కార్యకర్తలు తనను మన్నించాలని ఆమె కోరారు.
కాంగ్రెస్‌వైపు చూపు?
కడియం కావ్య బీఆర్ఎస్‌లో యాక్టివ్ లీడరేమీ కాదు. కానీ, ఆమె తండ్రి, బీఆర్‌ఎస్ నాయకుడు, ఎమ్మెల్యే కడియం శ్రీహరి కావ్యకు టికెట్ ఇప్పించారు. రెండు రోజుల క్రితమే ఎర్రవెల్లిలోని ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్‌ను కలిసిన కావ్య, తనకు టికెట్ ఇచ్చినందుకు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. ఇంతలోనే మనసు మార్చుకుని పోటీ నుంచి తప్పుకున్నారు. అయితే, ఆమె తన తండ్రి శ్రీహరితో కలిసి కాంగ్రెస్‌లో చేరుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
గురువారం శ్రీహరి, కావ్య ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలను కలిసినట్లు చెప్పుకుంటున్నారు. శ్రీహరి లేదా కావ్య తమ పార్టీ అభ్యర్థిగా పోటీచేసే అవకాశం ఉందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇప్పటి వరకు కాంగ్రెస్ నుంచి పోటీచేసే వరంగల్ అభ్యర్థిని ఆ పార్టీ ప్రకటించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరుతోంది.