వరంగల్ లోక్ సభ సెగ్మెంట్ హాట్​సీట్ .. ప్రధాన పార్టీల టికెట్ల కోసం తీవ్ర పోటీ

  • బీజేపీ పరిశీలనలో మంద కృష్ణ మాదిగ పేరు!
  • బీఆర్‍ఎస్‍ నుంచి మాజీ ఎమ్మెల్యే అరూరి ప్రయత్నాలు 
  • కాంగ్రెస్‍ టికెట్​ కోసం సిరిసిల్ల రాజయ్య, దొమ్మాటి సాంబయ్య పావులు
  • గాడ్‍ ఫాదర్ల సాయంతో తీవ్రంగా ప్రయత్నిస్తున్న మరికొందరు 

వరంగల్‍, వెలుగు: అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయో లేదో సీనియర్​లీడర్ల కన్ను పార్లమెంట్‍ ఎన్నికలపై పడింది. మూడు ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ టికెట్ల కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వరంగల్ ఎంపీ(ఎస్సీ) స్థానం కోసం పోటీ పడుతున్న ఆశావహుల సంఖ్య భారీగానే ఉంది. సిట్టింగు స్థానాన్ని కాపాడుకోవాలని బీఆర్ఎస్ చూస్తుండగా, మెజారిటీ ఎమ్మెల్యేలు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ సీటును కూడా దక్కించుకోవాలని ప్లాన్​చేస్తోంది.

రిజర్వుడు స్థానం కావడంతో బలమైన నేతను బరిలో దింపాలని బీజేపీ చూస్తోంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ ‘తెలంగాణ’ సెంటిమెంట్‍ పనిచేసింది. బీఆర్ఎస్ కు కలిసొచ్చింది. ఈసారి ఆ పరిస్థితి లేదు. పైగా వరంగల్​లోక్​సభ సెగ్మెంట్​పరిధిలోని ఆరు అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేలే ఉన్నారు. ఒక్క స్టేషన్​ఘన్​పూర్​లో మాత్రమే బీఆర్ఎస్​ఎమ్మెల్యే ఉన్నారు. బీఆర్‍ఎస్ కు బీజేపీ, కాంగ్రెస్​నుంచి గట్టి పోటీ ఎదురుకానుంది. 

మంద కృష్ణకే అంటూ ప్రచారం

బీజేపీ వరంగల్‍ ఎంపీ టికెట్​ను ఎమ్మార్పీఎస్‍ అధినేత మంద కృష్ణ మాదిగకు ఇస్తారనే ప్రచారం జరుగుతోంది. ఎస్సీ వర్గీకరణ పోరాటంతో మందకృష్ణ.. ప్రధాని మోదీ సహా బీజేపీ అగ్రనేతలకు దగ్గరయ్యారు. గత నెలలో హైదరాబాద్‍లో నిర్వహించిన సభలో మంద కృష్ణను తన చిన్న సోదరునిగా భావిస్తున్నట్లు మోదీ చెప్పారు. స్పెషల్​హెలికాప్టర్‍ ఇచ్చి మరీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన సేవలు వినియోగించుకున్నారు.

మంద కృష్ణకు సముచిత గౌరవం ఇచ్చేందుకు కమలం పార్టీ పెద్దలు రెడీగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. వరంగల్ లోక్​సభ స్థానం నుంచి మంద కృష్ణను పోటీకి దింపాలని బీజేపీ పెద్దలు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వర్ధన్నపేట అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన వరంగల్‍ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కొండేటి శ్రీధర్‍ కూడా తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు.  

అరూరి తీవ్ర ప్రయత్నం

రెండు సార్లు వరంగల్​ఎంపీగా నెగ్గిన పసునూరి దయాకర్‍ ను కాదని, ఈసారి బీఆర్ఎస్​అధిష్టానం కొత్తవాళ్లకు చాన్స్​ఇస్తుందని ప్రచారం జరుగుతోంది. వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్‍ పేరు ఎక్కువగా వినిపిస్తోంది. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన రమేశ్ లోక్​సభ ఎన్నికల్లోనూ పోటీ చేయాలని చూస్తున్నారు. రిజర్వుడు సీటు కావడం ఆయనకు కలిసొచ్చే అంశం. పార్టీ జిల్లా అధ్యక్షునిగా రాజకీయ గురువు కడియం శ్రీహరితోపాటు మిగిలిన పార్టీ నేతలతో అరూరికి మంచి సంబంధాలు ఉన్నాయి. ఎంతో ఖర్చుతో కూడుకున్న ఎంపీ ఎన్నికలకు రమేశ్‍ రెడీగా ఉన్నట్లు సమాచారం. అయితే సిట్టింగ్‍ ఎంపీగా దయాకర్‍ మూడోసారి అవకాశం కోసం తనవంతు ప్రయత్నాలు చేస్తున్నారు. 

కాంగ్రెస్ టికెట్‍కు ఫుల్లు డిమాండ్‍

కొత్తగా అధికారం చేపట్టిన కాంగ్రెస్‍ టికెట్​కోసం ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యతోపాటు గత ఎన్నికల్లో ఇక్కడి నుంచి పోటీ చేసిన దొమ్మాటి సాంబయ్య పేర్లు ఇప్పటివరకు ముందు వరుసలో ఉన్నాయి. మాస్‍ లీడర్‍గా సిరిసిల్ల రాజయ్యకు పార్టీ గుర్తింపు ఇచ్చినా.. అప్పట్లో వారి ఇంట్లో జరిగిన కోడలు, మనుమడు, మనుమరాలి ఆత్మహత్య ఇష్యూతో దూరం పెట్టింది. ప్రస్తుతం ఆయన పార్టీలో యాక్టివ్‍ అయ్యారు. ఎస్సీ నియోజకవర్గం వర్ధన్నపేట ఎమ్మెల్యే టిక్కెట్‍ ఆశించగా, కేఆర్‍.నాగరాజుకు ఇవ్వడంతో సైడయ్యారు. కాంగ్రెస్‍ పవర్‍లోకి రావడంతో పాత మిత్రులతో కలిసి ఎంపీ టికెట్​కోసం ముమ్మర ప్రయత్నం చేస్తున్నారు.

అయితే పోలీస్‍ జాబ్‍ను వదులుకుని రాజకీయాల్లోకి వచ్చిన దొమ్మాటి సాంబయ్య కాంగ్రెస్‍ కష్టకాలంలో ఉన్నప్పటి నుంచి పనిచేస్తున్నారు. గత పార్లమెంట్‍ ఎన్నికల్లో కాంగ్రెస్‍ తరఫున ఆయనే పోటీ చేశారు. మరోసారి అవకాశం ఇవ్వాలని గాడ్‍ఫాదర్లతో గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. వీరికితోడు నమిండ్ల శ్రీనివాస్‍, పెరుమాండ్ల రామకృష్ణ, మహిళా కోటాలో భారతి, ఇతర జిల్లాల నేతలు టికెట్​దక్కించుకోవాలని చూస్తున్నారు.