పవర్ జనరేషన్ తోనే పరిష్కారం..!

పవర్ జనరేషన్ తోనే  పరిష్కారం..!
  • మడికొండ డంపింగ్​ యార్డులో ఇప్పటికే 7 లక్షల టన్నులకు పైగా వ్యర్థాలు
  • పొల్యూషన్ కు తాళలేక పది రోజులుగా ఉద్యమిస్తున్న స్థానికులు
  • వరంగల్ లో పవర్ ప్లాంట్ ఏర్పాటుకు ముందుకు పడని అడుగులు
  • హుజురాబాద్ వేస్ట్​ టూ ఎనర్జీ ప్లాంట్ ఓపెన్ అయితేనే సొల్యూషన్

హనుమకొండ, వెలుగు: వరంగల్ డంప్​ యార్డు సమస్యకు సరైన సొల్యూషన్​ దొరకడం లేదు. కాలుష్యంతోపాటు రోగాలకు కారణమవుతున్న డంప్​యార్డును తరలించాలని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పోరాటం చేస్తుండగా, కొత్తగా ఉత్పత్తవుతున్న వేస్టేజీతో చెత్త గుట్టలుగా పేరుకుపోతోంది.

 డైలీ వెలువడుతున్న చెత్తకు అనుగుణంగా ప్రాసెస్​ చేసే విధానాలు లేకపోవడం, కొత్త చెత్తను వేసేందుకు వేరే చోట్లా స్థలం లేకపోవడంతో అధికారులు కూడా తలలు పట్టుకుంటున్నారు. డంపింగ్​ యార్డులో చేపట్టిన బయో మైనింగ్​ డెడ్​ స్లోగా నడుస్తుండటం, ఇక్కడ ప్రతిపాదించిన పవర్​జనరేషన్​ప్లాంట్​కాగితాలకే పరిమితమవడం సమస్యగా మారగా, హుజురాబాద్​ సమీపంలో ఏర్పాటు చేయనున్న ఇంటిగ్రేటెడ్​ వేస్ట్​ టు ఎలక్ట్రిసిటీ జనరేషన్ ప్లాంట్​తోనే వరంగల్ డంప్​ యార్డు సమస్యకు పరిష్కారం లభించే అవకాశం కనిపిస్తోంది. 

పవర్​ జనరేషన్ కాగితాలకే పరిమితం..

మడికొండ డంప్​ యార్డులో దాదాపు 7 లక్షల మెట్రిక్​ టన్నుల వ్యర్థాలు పోగైనట్లు అధికారుల అంచనా. అందులో 3 లక్షల టన్నులు శుద్ధి చేసేందుకు మూడేండ్ల కిందట బయో మైనింగ్​ చేపట్టగా, పనులు నత్తనడకన సాగుతుండటం వల్ల ఇప్పటివరకు 2.1 లక్షల టన్నుల వరకు శుద్ధి అయినట్లు తెలిసింది. 

నగరంలో రోజువారీగా 450 నుంచి 500 టన్నుల వరకు చెత్త వెలువడుతుండగా, ఆ చెత్తనంతా శుద్ధి చేసేందుకు గతంలో అధికారులు ప్రతిపాదించిన ప్రాజెక్టులన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. స్మార్ట్ సిటీ పథకంలో భాగంగా దాదాపు రూ.18 కోట్ల అంచనాతో ఇక్కడి చెత్తను క్యాపింగ్ చేసి గ్రీనరీ డెవలప్​ చేసేందుకు ప్రపోజల్స్​ పెట్టారు. మరో రూ.18 కోట్లతో 'వేస్ట్​ టూ ఎనర్జీ' విద్యుత్తు ఉత్పత్తి ప్లాంట్​ ఏర్పాటుకు కూడా సన్నాహాలు చేశారు.

 ఆ తర్వాత దక్షిణ కొరియాకు చెందిన సేజింగ్​అనే కంపెనీ ప్రతినిధులు నిరుడు ల్యాండ్​ ఫిల్​ గ్యాస్​ విధానం ద్వారా ఎలక్ట్రిసిటీ జనరేషన్​ కోసం డంప్​యార్డును పరిశీలించారు. చైనా, వియత్నాం, థాయ్​లాండ్, ఉజ్బెకిస్తాన్​ దేశాల్లో ఈ విధానం ద్వారా విద్యుదుత్పత్తి చేస్తుండగా, అదే తీరుగా ఇక్కడా ప్లాంట్​ఏర్పాటు చేసేందుకు డంప్​ యార్డును విజిట్​చేశారు. కానీ వివిధ కారణాలతో ఆ ప్రక్రియకు కూడా బ్రేకులు పడ్డాయి. అనంతరం కేంద్ర ప్రభుత్వ గోబర్​ ధన్​ స్కీం కింద ఇక్కడ బయో గ్యాస్​ ప్లాంట్ల కోసం కూడా ప్రతిపాదనలు పంపించారు. ఆ ప్రపోజల్స్​ కూడా కాగితాల్లోనే ఉండిపోయాయి.

కాలుష్యంతో రోగాల బారిన జనాలు..

మడికొండ డంప్​యార్డులో స్టార్ట్​ చేసిన బయోమైనింగ్​ ప్రక్రియ డెడ్​ స్లోగా నడుస్తుండటం, ఇతర ప్రాజెక్టులు కాగితాల దశ దాటకపోవడంతో ఇక్కడ పెద్ద ఎత్తున వ్యర్థాలు పోగవుతున్నాయి. గాలి, నీరు కాలుష్యమై చుట్టుపక్కలున్న మడికొండ, రాంపూర్, ఎల్కుర్తి, అయోధ్యపురం, సోమిడి, ధర్మసాగర్, టేకులగూడెం తదితర గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 

అక్కడ గాలి క్వాలిటీ 243 పీఎంగా ఉండటం ఆందోళన కలిగిస్తుండగా, జనాలు శ్వాసకోశ వ్యాధుల బారిన పడి అనారోగ్యానికి గురవుతున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త చెత్తను డంప్​ యార్డుకు తీసుకురావద్దంటూ పది రోజులుగా ఉద్యమం చేస్తున్నారు. దీంతో కొత్త చెత్తను డంప్​ ఎక్కడ చేయించాలో తెలియక ఆఫీసర్లు తలలు పట్టుకుంటున్నారు.

హుజురాబాద్​ ప్లాంట్ తోనే సొల్యూషన్!

వరంగల్ లో ప్రతిపాదించిన పవర్​జనరేషన్ ప్లాంట్ కు అడుగులు పడకపోగా, హుజురాబాద్​లో ఏర్పాటు చేస్తున్న ప్లాంటుతోనే మడికొండ డంప్​యార్డు సమస్యకు సొల్యూషన్​ దొరికే అవకాశం కనిపిస్తోంది. హుజురాబాద్​ సమీపంలోని కొత్తపల్లి శివారులో దాదాపు రూ.150 కోట్లతో 25 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్​ వేస్ట్​టూ ఎనర్జీ ప్లాంట్​ ఏర్పాటు చేస్తుండగా, ఆరు మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తికి నిత్యం 788.81 టన్నుల చెత్తను అక్కడికి తరలించాల్సి ఉంటుంది. 

ఈ మేరకు వరంగల్ నుంచి 518.6 టన్నులు, కరీంనగర్​ నుంచి 186 టన్నులు, హుజూరాబాద్‌ మున్సిపాలిటీ నుంచి 19.74 టన్నులు, జమ్మికుంట 18.64 టన్నులు, నర్సంపేట నుంచి 15.64 టన్నులు, పరకాల 10.32 టన్నులు, హుస్నాబాద్‌ 9.32 టన్నులు, వర్ధన్నపేట 5.79 టన్నులు, కొత్తపల్లి నుంచి 4.67 టన్నుల చెత్తను ప్లాంట్​కు తరలిస్తారు. 

ప్రస్తుతం ఆ ప్లాంట్​ టెండర్​ దశలో ఉండగా,  తొందర్లోనే వినియోగంలోకి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఆ ప్లాంట్ వినియోగంలోకి వస్తే మడికొండ డంప్​యార్డు సమస్యకు పరిష్కారం దొరికినట్టేనని స్పష్టం చేస్తున్నారు. కాగా, సమస్యను సాల్వ్​ చేసేందుకు ఆఫీసర్లు తీసుకుంటున్న చర్యలు ఏమేరకు ఫలితాన్నిస్తాయో చూడాలి.