అనుమతులు లేకుండానే.. ఫంక్షన్​ హాల్​, రిసార్ట్​ నిర్మాణం

  • ఎస్సారెస్పీ కాల్వ కబ్జా..  చర్యలు తీసుకోని ఆఫీసర్లు

వరంగల్​ / నర్సంపేట, వెలుగు :  నర్సంపేట టౌన్​లోని బిట్స్​ కాలేజీ సమీపంలో వరంగల్​ మెయిన్​ రోడ్​ పక్కన అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి.   ఓ డాక్టర్​ ఎలాంటి  అనుమతులు  తీసుకోకుండానే  ఫంక్షన్​ హాల్​, రిసార్ట్​ నిర్మిస్తున్నాడు.  ఎస్సారెస్పీ డీబీఎం 40/1 పిల్ల కాల్వను కలిపేసుకున్నాడు.  కాల్వకు సంబంధించి ఇరువైపులా 21 ఫీట్ల వెడల్పు భూమిని కబ్జా చేశాడు. దానిపై రేలింగ్​ వేశాడు. ఫంక్షన్​ హాల్​ నిర్మాణాలకు నాలా అనుమతితో పాటు ఇంజనీరింగ్​ ఆఫీసర్ల నుంచి  నో ఆబ్జక్షన్​ సర్టిఫికెట్​ తీసుకోవాలి. కానీ అవేమీ లేకుండానే  యథేచ్చగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నాడు.  ఆర్​ అండ్​బీ మెయిన్​ రోడ్​కు 20 ఫీట్ల సెట్​ బ్యాక్​ను సైతం వదిలిపెట్టలేదు. 

పార్కింగ్​కు ఎలాంటి ప్లేస్​ లేదు. ఈరూట్​లో నిత్యం వేలాది మంది నర్సంపేట టూ వరంగల్​కు ప్రయాణిస్తుంటారు. స్థానికులు అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పంచాయతీ, ఇరిగేషన్​, ఆర్​అండ్​బీ ఆఫీసర్లు రంగంలోకి దిగారు. నిర్మాణాలను   ఆపివేయించారు. అక్రమ నిర్మాణదారుడికి రాములు నాయక్​తండా పంచాయతీ సెక్రటరీ శ్రావణికుమారి మూడు సార్లు నోటీసులు ఇవ్వడంతో అక్రమ నిర్మాణాదారుడు ఆన్​లైన్​  అనుమతి  కోసం డీటీసీపీకి దరఖాస్తు చేసుకున్నాడు. 

ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే..

మూడు డిపార్టుమెంట్ల అనుమతులు  లేకుండానే దర్జాగా ఫంక్షన్​ హాల్​, రిసార్ట్స్​ను కడుతున్నారు.    చిన్నపాటి ఇల్లు కట్టుకుంటే  అనుమతి,  రోడ్​ సెట్​ బ్యాక్​ అంటూ  ఆఫీసర్లు  సవాలక్ష నిబంధనలు పెడ్తారు.   అయితే ఏకంగా మెయిన్​ రోడ్​ పక్కనే పెద్ద ఫంక్షన్​ హాల్​ నిర్మిస్తున్నా ఆఫీసర్లు ఆవైపు కన్నెత్తి చూడకపోవడం విస్మయానికి గురిచేస్తోంది. అభ్యంతరాలు రావడంతో ఆలస్యంగా తేరుకున్న ఆఫీసర్లు స్పాట్​ను పరిశీలించారు.  అవి అక్రమ నిర్మాణాలేనని తేల్చారు. ఆన్​లైన్​లో పర్మిషన్​ కోసం దరఖాస్తు చేసుకోవాల్సిందిగా అక్రమ నిర్మాణదారుడికి సూచించారు. దీంతో సరైన కాగితాలు లేవని డీటీపీసీ ఆఫీసర్లు ఆన్​లైన్​లో వచ్చిన దరఖాస్తును తిరస్కరించారు.

 కలెక్టర్​కు నివేదిక పంపారు. కలెక్టర్​ ఆదేశాల కోసం ఎదురు చూస్తున్నట్లు డీఎల్​పీఓ వెంకటేశ్వర్లు చెప్పారు. మొత్తం మీద మూడు శాఖల ఆఫీసర్లు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోకుండా ఆలస్యం చేస్తున్నారనే చర్చ సాగుతోంది. ఇదే టైంలో అక్రమంగా నిర్మించిన ఫంక్షన్​ హాల్​ను కూలగొట్టకుండా ఉండేందుకు సదరు నిర్మాణదారుడు అధికార పార్టీకి చెందిన లీడర్ల ద్వారా ఆఫీసర్లపై ఒత్తిడి  తెస్తున్నట్లు సమాచారం.  అయితే కండ్లెదుటే  అక్రమనిర్మాణం జరుగుతున్నా, మూడు నోటీసులను ఖాతరు చేయకపోయినా అధికారులు ఎందుకు సీరియస్​ చర్యలు తీసుకోవడం లేదని పలువురు ప్రశ్నిస్తున్నారు.