
- కూలిన బ్రిడ్జిలు, తెగిన నాలాలు
- చెల్లాచెదురైన డివైడర్స్
- టెంపరరీ రిపేర్లు కూడా మొదలుపెట్టని ఆఫీసర్లు
- అప్పటిదాకా కనీసం వార్నింగ్ బోర్డులు కూడా పెట్టలే
- ఎప్పుడు ఏ ప్రమాదం జరుగుతుందోననే ఆందోళన
వరంగల్, వెలుగు: ఇటీవలి వరదలకు గ్రేటర్వరంగల్ సిటీలోని మెయిన్ రోడ్లన్నీ తుక్కుతుక్కయ్యాయి. వారం పాటు కురిసిన వర్షాలు, వరదలకు ప్రధాన జంక్షన్లలో కొత్తగా వేసిన రోడ్లు ఐదారు మీటర్ల వెడల్పుతో కోతపడ్డాయి. కొన్నిచోట్ల కొట్టుకుపోయాయి. వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రై సిటీ పరిధిలో అడుగడుగునా భారీ గుంతలు కనిపిస్తుండగా.. కాలనీల మధ్య కనెక్టివిటీగా ఉండే బ్రిడ్జిలు కూలిపోయాయి. కిలోమీటర్ల మేర నాలాలు తెగి ప్రమాదకరంగా తయారయ్యాయి. ఇన్నాళ్లు మెయిన్ రోడ్ల మధ్య అందంగా కనిపించిన ఐరన్ డివైడర్స్, వాటి మధ్య పెట్టిన పూలచెట్లు విరిగి చెల్లాచెదురయ్యాయి. అక్కడక్కడ వరద ప్రవాహం వెళ్లేందుకు అధికారులు డివైడర్లను కూల్చడంతో వివిధ అవసరాల కోసం వేసిన కేబుల్స్ రోడ్లకు మీదికి వచ్చాయి. డివైడర్ల మధ్యలో ఉండే సెంట్రల్ లైటింగ్దెబ్బతినడంతో 20 కిలోమీటర్ల డిస్టెన్స్ లో వరంగల్ రోడ్లపై ప్రయాణించడం గగనమవుతోంది. ఇప్పటివరకు ఆఫీసర్లు రోడ్లు, బ్రిడ్జిలు, నాలాలకు టెంపరరీ రిపేర్లు కూడా మొదలుపెట్టలేదు. కనీసం అప్పటివరకైనా హెచ్చరిక బోర్డులు సైతం ఏర్పాటు చేయకపోవడంతో ఎప్పుడే ప్రమాదం జరుగుతుందోనని వాహనదారులు భయపడ్తున్నారు.
మెయిన్ రోడ్లపై అడుగుకో గుంత..
వరదలకు గ్రేటర్ జిల్లాల్లో 240 కిలోమీటర్ల రోడ్లు దెబ్బతింటే, సిటీలోనే 20 కిలోమీటర్ల మేర మెయిన్ రోడ్లు, సుమారు 11 కిలోమీటర్ల సీసీ రోడ్లు, 24.02 కిలోమీటర్ల మేర నాలాలు దెబ్బతిన్నట్లు ఆఫీసర్లు చెప్తున్నారు. మెయిన్ రోడ్లలో హైదరాబాద్ వైపు మడికొండ మొదలు వరంగల్ దాటాక ధర్మారం వరకు.. వరంగల్ నుంచి ఖమ్మం రోడ్‍లోని నాయుడు పెట్రోల్‍పంపు వరకు.. హనుమకొండ మీదుగా కరీంనగర్ వెళ్లే రూట్లో హసన్‍పర్తి వరకు అడుగుకో గుంత ప్రయాణికులకు చుక్కలు చూపుతున్నాయి. హనుమకొండలోని వరంగల్ పశ్చిమ, వర్ధన్నపేట నియోజకవర్గాల పరిధిలోని సిటీలో.. రెడ్డి చికెన్‍సెంటర్, కేయూసీ, బీమారం, రామారం, చింతగట్టు, పెద్దమ్మ గడ్డ రోడ్, పోచమ్మకుంట, ముచ్చర్ల రోడ్, పెగడపల్లి రోడ్, సమ్మయ్య నగర్, టీవీ టవర్ నగర్, అంబేద్కర్ నగర్, గోకుల్‍నగర్, రాజాజీనగర్, నందిదారే నగర్, శ్రీనివాస నగర్, సరస్వతి నగర్, పరిమళకాలనీల ప్రధాన రోడ్లన్నీ కోతలతో, గుంతలతో అధ్వానంగా తయారయ్యాయి. వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బొందివాగు ప్రభావంతో సుబేదారి నుంచి హంటర్ రోడ్ మీదుగా వరంగల్ వెళ్లే రోడ్లు కూడా ధ్వంసమయ్యాయి.
ప్రధానంగా బొందివాగు నాలా ఉప్పొంగే ప్రాంతమైన సంతోషిమాత ఆలయ పరిసరాల్లో భారీ నష్టం జరిగింది. ఖమ్మం బ్రిడ్జి, హంటర్ రోడ్, సీఎస్‍ఆర్ గార్డెన్ జంక్షన్లో వేసిన కొత్త రోడ్లు కొట్టుకుపోయాయి. పోతననగర్, ఎన్‍టీఆర్‍నగర్, ఎస్సార్‍నగర్, ఏనుమాముల మార్కెట్‍రోడ్, దేశాయిపేట, పైడిపల్లి రోడ్‍తో పాటు పదుల సంఖ్యలో కాలనీల్లో భయంభయంగా జర్నీ చేయాల్సి వస్తోంది.
నయీంనగర్, జవహర్‍కాలనీ.. షేప్‍ఔట్
గ్రేటర్ వరంగల్ లో కాలేజీలు, స్కూళ్లు, ఇనిస్టిట్యూషన్లు, కోచింగ్ సెంటర్లు, హాస్టళ్లతో పాటు హనుమకొండ నయీంనగర్ ఏరియా షేప్‍ఔట్ అయిపోయింది. వరద ప్రవాహంతో నయీంనగర్ నాలా కరీంనగర్– హనుమకొండ ప్రధాన రోడ్డును 10 ఫీట్ల లోతుతో చీల్చేసింది. ఈ ఏరియాలో హెవీ వెహికిల్స్ ఎక్కడ దిగబడుతాయో చెప్పరాకుండా ఉంది. ప్రధానమైన ఈ నయీంనగర్ నాలా రెండువైపులా ఐదారు మీటర్ల వరకు కోతకు గురై షాపులన్నీ వరదలో కొట్టుకుపోయాయి. ఎక్కడో సిటీ అవతల ఉండే తాటిచెట్లు పెట్రోల్ బంక్‌లోకి కొట్టుకొచ్చాయి. చిరు వ్యాపారులకు సంబంధించి వస్తువులు, బండ్లు, గదులు కొట్టుకుపోవడంతో రోడ్డున పడ్డారు. కేయూ 100 ఫీట్ల రోడ్డులోని జవహర్‍కాలనీ భూకంప ప్రాంతాన్ని తలపిస్తోంది. కాలనీలకు అనుసంధానంగా ఉండే బ్రిడ్జి కొట్టుకుపోయింది.
రోడ్డు మొత్తం ధ్వంసమైంది. కేయూసీ ప్రధాన రోడ్డుపై రెండేండ్లుగా డక్ట్ పనులు నడుస్తున్న క్రమంలో వరంగల్ నుంచి హనుమకొండ మీదుగా కాజీపేట వెళ్లే 11వ నంబర్ బస్సు ఈ మార్గంలో నడుస్తుండగా..ఇప్పుడు రాకపోకలకు ఇబ్బందిగా మారింది. ఇన్నేండ్లలో ఏనాడూ వరదనీరు చూడని కాకతీయ యూనివర్సిటీ రోడ్డులో పెగడపల్లి డబ్బాల వద్ద నడుంలోతు నీరు ప్రవహించడంతో రోడ్లు, డివైడర్లు పూర్తిగా దెబ్బతిన్నాయి.
కనిపించని వార్నింగ్ బోర్డులు, బారికేడ్లు
సిటీ అంతటా వేలాది మంది ప్రయాణించే ప్రధాన రోడ్లు, బ్రిడ్జిలు, నాలాలు చాలాచోట్ల డేంజరస్‌గా మారాయి. హైదరాబాద్, కరీంనగర్ మీదుగా వచ్చేవారికి ఇక్కడి పరిస్థితులు తెలిసే అవకాశంలేదు. ఈ క్రమంలో దెబ్బతిన్న ప్రాంతాల్లో బారికేడ్లు, రేడియంతో కూడిన వార్నింగ్ బోర్డులు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. ఎక్కడా అలాంటి దాఖాలాలు లేవు. ఒకట్రెండుచోట్ల చీకట్లో కనపడని ప్లాస్టిక్ రిబ్బన్లు కట్టి వదిలేశారు. దెబ్బతిన్న రోడ్లు, నాలాలు, బ్రిడ్జిలకు రిపేర్లు చేసేవరకు కనీసం ఎలాంటి ప్రమాదాలు జరగకుండా అధికారులు తగిన ఏర్పాట్లు చేయకపోవడంపై వరంగల్ పబ్లిక్ ఫైర్ అవుతున్నారు.
ఎక్కడా వార్నింగ్ బోర్డులు పెట్టలే
రోడ్లు కోతలు గురైనచోట, గుంతలు పడ్డకాడ.. బ్రిడ్జిలు, నాలాలు దెబ్బతిన్నచోట రాత్రిపూట కనిపించేలా వార్నింగ్ బోర్డులు పెట్టలేదు. ధర్నాలు, రాస్తారోకోల టైంలో రోడ్ల మీద పెట్టేందుకు పోలీసులు వందలాది బారికేడ్లు వాడుతారు. ఇలాంటి సమయాల్లో బారికేడ్లు పెడితే ఎలాంటి ప్రమాదం జరగకుండా ఉంటుంది.
- రాకేశ్, (గోపాల్‍పూర్, హనుమకొండ)