
- ఒక్క నెల ఈఎంఐ కట్టకపోవడంతో అసభ్యకరంగా తిట్టిన ఉద్యోగులు
గ్రేటర్ వరంగల్, వెలుగు : ఒక్క నెల ఈఎంఐ కట్టడం ఆలస్యమైనందుకు ఫైనాన్స్ కంపెనీ ఉద్యోగులు వేధించడం, అసభ్యకరంగా తిట్డడంతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన వరంగల్ నగరంలోని ఇంతేజార్‌గంజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం జరిగింది. సీఐ షుకూర్ తెలిపిన వివరాల ప్రకారం... వరంగల్‌లోని కాశీబుగ్గ శాంతినగర్‌కు చెందిన పర్లపల్లి శ్రీనివాస్ (37) మేస్త్రీగా పనిచేస్తున్నాడు. ఇతడు పరకాలలోని ఐఐఎఫ్‌ఎల్ ఫైనాన్స్ సంస్థలో హోమ్‌లోన్ తీసుకున్నాడు.
ఇటీవల ఆర్థిక పరిస్థితి బాగా లేకపోవడంతో మార్చి నెల ఈఎంఐ కట్టలేదు. పెండింగ్ ఈఎంఐని వచ్చే నెలలో కడుతామని చెప్పినా పట్టించుకోకుండా సంస్థకు చెందిన ఉద్యోగులు మారేపల్లి సందీప్, రాజు కలిసి శ్రీనివాస్‌ను వేధించడం మొదలు పెట్టారు. ఈఎంఐ కట్టకపోతే ఇల్లును వేలం వేస్తామని బెదిరించడంతో పాటు అసభ్యకరంగా తిట్టారు.
దీంతో మనస్తాపానికి గురైన శ్రీనివాస్ శుక్రవారం ఇంట్లో ఎవరూ లేని టైంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కొద్దిసేపటి తర్వాత గుర్తించిన కుటుంబ సభ్యులకు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతుడి భార్య దీపిక ఫిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. ఈఎంఐ కోసం వేధించిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు.