- పరిహారం తేల్చట్లే !
- వరంగల్-మంచిర్యాల గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మాణం భూములు కోల్పోనున్న రైతులు
- ప్రజాభిప్రాయ సేకరణ చేసి ఏడాది దాటిపోయింది
- ఎకరాకు రూ.కోటి చెల్లించాలని రైతుల డిమాండ్
- జోరుగా రియల్ వెంచర్లు
కోల్‌బెల్ట్/జైపూర్, వెలుగు: మంచిర్యాల జిల్లా నుంచి పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల మీదుగా వరంగల్ వరకు112 కిలోమీటర్ల మేర నేషనల్హైవే గ్రీన్ఫీల్డ్స్రహదారి నిర్మాణానికి కేంద్రం ప్రభుత్వం 2020 డిసెంబర్లో ప్రతిపాదించింది. ఇప్పటి వరకు జిల్లాలో భూసేకరణ చేయకపోవడంతో హైవే నిర్మాణ పనులు స్టార్ట్ కాలేదు. భూములకు పరిహారం ఇచ్చే విషయంపై ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించి ఏడాది దాటినా ఇప్పటి వరకు ఎకరానికి ఎన్ని డబ్బులు చెల్లిస్తారనే విషయంపై ప్రభుత్వం, ఆఫీసర్లు స్పందించడం లేదు. రెండు పంటలు పండే భూములకు పరిహారం ఎంత ఇస్తారో తెలియక మంచిర్యాల జిల్లా జైపూర్ మండల రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎకరాకు రూ. కోటి నష్టపరిహారం ఇవ్వాలని లేకపోతే భూములు ఇచ్చేది లేదని రైతులు తెగేసీ చెబుతున్నారు.
112 కి.మీ పొడవున నేషనల్ హైవే…
మంచిర్యాల జిల్లా నుంచి వరంగల్ వరకు 112 కిలోమీటర్ల మేర నేషనల్ హైవే ఫోర్ లేన్ గా నిర్మించనున్నారు. మంచిర్యాల- చెన్నూరు నేషనల్ హైవే 63 ఆనుకొని జైపూర్ మండలం నర్వ శివారులో రసూల్‌పల్లి పక్క నుంచి మండలంలోని ఎస్టీపీపీ రైల్వే ట్రాక్, ఎల్కంటి, షెట్పల్లి ఎక్స్‌రోడ్, నర్సింగపూర్, మద్దులపల్లి, కుందారం, కిష్టాపూర్, వేలాల, గోపాలపూర్ మీదుగా గోదావరి నది దాటుతుంది. పెద్దపల్లి జిల్లా మంథని, భూపాలపల్లి జిల్లా మీదుగా వరంగల్ జిల్లా వరకు ఈ దారి వెళ్లనుంది. జైపూర్ మండలం పరిధిలో 25 కిలోమీటర్ల ఫోర్‌లేన్ రహదారి నిర్మించాల్సి ఉంది. రసూల్ పల్లె వద్ద నేషనల్ హైవే 63, కొత్త హైవేను కలుపుతూ జంక్షన్ ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా హైవే అందుబాటులోకి వస్తే మంచిర్యాల, ఆసిఫాబాద్ జిల్లా ప్రజలు వరంగల్, కొత్తగూడెం, విజయవాడ లాంటి ప్రాంతాలకు వెళ్లేందుకు 60 కి.మీ మేర దూరంతో పాటు సమయం తగ్గనుంది. సరుకుల రవాణా కూడా ఈజీ కానుంది.
ఏడాది కిందట పబ్లిక్ హియరింగ్ …
మంచిర్యాల, పెద్దపల్లి, భూపాలపల్లి జిల్లాల పరిధిలో 1,767 ఎకరాల భూములను సేకరించాలని ఆఫీసర్లు నిర్ణయించారు. మంచిర్యాల జిల్లాలో 25 కిలోమీటర్ల ఫోర్‌లేన్ రోడ్డు కోసం రామారావుపేట, ఇందారం, ముదికుంట, నర్వ, టేకుమట్ల, ఎల్కంటి, షెట్పల్లి, నర్సింగాపూర్, బెజ్జాల, కుందారం, రొమ్మిపూర్, కిష్టాపూర్, వేలాల, గోపాలపూర్ సహా 14 గ్రామాల్లో 866 మంది నుంచి 320 ఎకరాల భూములను సేకరించాల్సి ఉంది. గతేడాది మార్చిలో జైపూర్ మండలం షెట్పల్లి కేంద్రంగా భూముల సేకరణ కోసం ఆఫీసర్లు ప్రజాభిప్రాయ సేకరణ కూడా చేపట్టారు.
పరిహారం పై క్లారిటీ లేదు
భూముల సేకరణ కోసం పబ్లిక్ హియరింగ్ నిర్వహించిన ఆఫీసర్లు ఇప్పటి వరకు రైతులు కోల్పోయే భూములకు ఎంత నష్ట పరిహారం ఇస్తారనే విషయంపై క్లారిటీ ఇవ్వలేదు. ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని, ఎకరాకు రూ.కోటి ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఫోర్‌లేన్ రోడ్డుకు ఇరువైపులా సర్వీసు రోడ్లను నిర్మించాలని పబ్లిక్ హియరింగ్ సందర్భంగా రైతులు కోరారు. రోడ్డు నిర్మాణం కాకముందే ఒక పక్క రియల్ ఎస్టేట్ వ్యాపారులు రైతులను మచ్చిక చేసుకొని తక్కువ ధరకు భూములు కొనుగోలు చేసి వెంచర్లు ఏర్పాటు చేస్తున్నారు. ఫిబ్రవరి 2023లో నిర్వాసిత రైతులకు నోటీసులు జారీ చేసిన ఆఫీసర్లు ఇప్పటివరకు పరిహారం కోసం అవార్డు ప్రకటించ లేదు. దీంతో రోడ్డు పనులు స్టార్ట్ కాలేదు. మూడు జిల్లాలో ఫోర్‌లేన్ రోడ్డు పనులు మొదలు కాపోవడంతో నిర్మాణ అంచనాలు రూ.7,612 కోట్ల నుంచి రూ.10,573 కోట్లకు చేరాయి. ఇదే మార్గం గుండా నాగ్‌పూర్ నుంచి విజయవాడ వరకు గ్రీన్‌ఫీల్డ్ కారిడార్ నేషనల్ హైవే నిర్మాణానికి రూ.14,666 కోట్ల నిధుల ప్రతిపాదనలతో 405 కిలో మీటర్ల పొడవు రహదారి నిర్మించనున్నారు. హైవే కింద భూములు కోల్పోయే నిర్వాసితుల తప్పుల సవరణ దరఖాస్తుల స్వీకరణ చేపట్టామని జైపూర్ మండల తహసీల్దార్ మోహన్‌రెడ్డి చెప్పారు. 2013 చట్టం ప్రకారం రైతులకు జనరల్ అవార్డు కింద పరిహారం చెల్లిస్తామన్నారు.
ఎకరాకు రూ.కోటి పరిహారం ఇవ్వాలి
రెండు పంటలు పండే జీవనాధారమైన భూములను రోడ్డు కోసం కోల్పోతున్నాం. అసలు పరిహారం ఎంత ఇస్తారో చెప్పడం లేదు. మార్కెట్ రేట్ ప్రకారం ఎకరాకు రూ.కోటి వరకు పరిహారం చెల్లిస్తే భూములిస్తాం.
-రావుల వెంకటి, కుందారం