వరంగల్, వెలుగు: సర్కారు ఆమోదం కోసం పంపిన వరంగల్ సిటీ కొత్త మాస్టర్ ప్లాన్ 34 నెలలుగా సీఎం కేసీఆర్ టేబుల్ మీదే పడిగాపులు పడుతోంది. దీంతో రాష్ట్రంలో రెండో పెద్ద సిటీగా రూపొందుతున్న గ్రేటర్ వరంగల్‌లో ఇంకా 50 ఏండ్ల కిందటి ప్లాన్‌నే అమలు చేస్తున్నారు. 2041 వరకు సిటీ అవసరాలకు సరిపోయేలా 2013లోనే అధికారులు మాస్టర్ ప్లాన్తయారు చేశారు. దాన్ని 2020 మార్చిలో ఆమోదించిన మున్సిపల్ శాఖ మంత్రి సీఎం ఆమోదం కోసం పంపారు. అప్పటి నుంచి ఫైల్సీఎం పేషీలో మరుగున పడిపోయింది. వరంగల్స్మార్ట్సిటీ కావాలన్నా.. కేటీఆర్ హామీ ఇచ్చినట్లు ఫ్యూచర్ సిటీగా డెవలప్ చేయాలన్నా కొత్త మాస్టర్ ప్లాన్ అమలు చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఏండ్లు గడుస్తున్నా ప్లాన్‍కు ఆమోదం రాక.. అభివృద్ధి పనులు ఇష్టానుసారంగా చేపడుతున్నారు. అక్రమార్కులు చెరువులు, కుంటలను కబ్జా చేస్తున్నారు. ఎక్కడపడితే అక్కడ అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. ఫలితంగా వరదలొచ్చినప్పుడు జనాలు అవస్థలు పడాల్సి వస్తోంది.
ఇప్పటికీ 1972నాటి మాస్టర్ ప్లానే
గ్రేటర్ వరంగల్ సిటీలో ఇప్పటికీ 50 ఏండ్ల కిందటి మాస్టర్ ప్లాన్‌నే అమలు చేస్తున్నారు. 1971లో రూపొందించిన మాస్టర్ ప్లాన్ ను.. 20 ఏండ్ల అవసరాలను దృష్టిలో పెట్టుకుని 1972లో సవరించారు. ఈ లెక్కన కొత్త ప్లాన్1991లోనే అమల్లోకి రావాలి. కానీ ఆ దిశగా అధికారులు చొరవ తీసుకోలేదు. 2013లో కొత్త ప్లాన్ రూపొందించినా ఎలక్షన్ల బిజీతో పక్కనపెట్టారు. మొదట్లో 60 చదరపు కిలోమీటర్ల పరిధిలో ఉన్న నగరానికి సంబంధించి మాస్టర్ ప్లాన్ రెడీ చేశారు. క్రమంగా నగరం విస్తరించి 1,801 చదరపు కిలోమీటర్లకు పెరగడం, సిటీతోపాటు181గ్రామాల్లోని దాదాపు1.4 లక్షల జనాభా అవసరాలకు తగ్గట్టు ప్లాన్ ఉండాలని సర్కారు పెద్దలు సూచించారు.
స్మార్ట్ సిటీ, హృదయ్, అమృత్ పథకాలకు కూడా వరంగల్ ఎంపిక కావడంతో.. లీఅసోసియేట్స్, కుడా ప్లానింగ్ విభాగం కలిసి ప్లాన్ లో మార్పులు చేశాయి. కొత్త మాస్టర్‌ప్లాన్ ప్రకారం రెసిడెన్షియల్, కమర్షియల్, మిక్స్ డ్ యూజ్, ఇండ్రస్ట్రియల్ జోన్లు, గ్రోత్ కారిడార్స్, అగ్రికల్చర్, హెరిటేజ్ కన్షర్వేషన్ తదితర జోన్లను డెవలప్ చేయాలి. రిక్రియేషన్ జోన్ కింద పార్కులు, గార్డెన్లు, ప్రొటెక్టెడ్ జోన్ కింద వాటర్ బాడీస్, ఫారెస్ట్, కెనాల్స్ అభివృద్ది చేయాల్సి ఉంది. కానీ ప్లాన్ లేక ఇవేమీ జరగడంలేదు.
రెండోసారి అధికారంలోకి రాగానే హడావుడి
టీఆర్ఎస్రెండోసారి అధికారంలోకి వచ్చిన వెంటనే రూలింగ్ పార్టీ లీడర్లు కొత్త మాస్టర్ ప్లాన్ పై హడావుడి చేశారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, స్థానిక ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలతో రెండు, మూడు సార్లు మీటింగ్ పెట్టారు. ప్లాన్ ను ఓకే చేసి.. మంత్రి కేటీఆర్‍కు పంపారు. వరంగల్, హైదరాబాద్‍లో దీనిపై పలుసార్లు చర్చలు జరిపిన తర్వాత 2020 మార్చి11న మంత్రి కేటీఆర్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఆయన ఫైలును సీఎం ఆఫీస్ పంపగా.. ప్లాన్ శాస్ట్రీయంగా లేదని, కొన్ని మార్పులు చేయాలని కేసీఆర్ చెప్పినట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో మంత్రి కేటీఆర్ ప్రచారం చేస్తూ.. త్వరలోనే మాస్టర్ ప్లాన్‍కు ఆమోద ముద్ర వేసి వరంగల్ ను ఫ్యూచర్ సిటీ చేస్తామని హామీ ఇచ్చారు. ఇప్పటివరకు 2041ప్లాన్ అతీగతీ లేదు. ‘స్మార్ట్ సిటీల ఏర్పాటు మాస్టర్ ప్లాన్ అమలుతోనే సాధ్యం. సరైన మాస్టర్ ప్లాన్ లేకపోతే నగరాలు డెవలప్ కాలేవు’ ఇది నీతి అయోగ్ చెప్పిన మాట. కాగా, వరంగల్ నగరం స్మార్ట్ సిటీల జాబితాలో చేరి ఆరేళ్లు గడుస్తోంది. అయినా ఇంకా మాస్టర్ ప్లాన్‍కు మోక్షం కలగలేదు.