వరంగల్ మాస్టర్ ప్లాన్ రెడీ : కేటీఆర్

వరంగల్ మాస్టర్ ప్లాన్ రెడీ : కేటీఆర్

వరంగల్ పట్టాణాభివృద్దికి, భవిష్యత్తు అవసరాలకు అనుగణంగా మాస్టర్ ప్లాన్ తయారు చేస్తున్నామన్నారు మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్. తెలంగాణలో రెండో పెద్ద నగరం వరంగల్ సమగ్రాభివృద్ధికి అనుగుణంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్ తుది దశకు చేరుకుందని తెలిపారు. వరంగల్ మాస్టర్ ప్లాన్ ముసాయిదాపై  మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి దయాకర్ రావు, ఈటల రాజేందర్ చర్చించారు. వరంగల్ ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కేటియార్ స్వయంగా మాస్టర్ ప్లాన్ పై ప్రజాప్రతినిధులకు వివరించారు.

వరంగల్ మాస్టర్ ప్లాన్ పై అన్ని వర్గాల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నామన్నారు మంత్రులు. ఇప్పటికే కుడా పరిధిలోకి వచ్చే వివిధ వర్గాలు, భాగస్వాములతో విస్తృతంగా చర్చించిన తర్వతే.. మాస్టర్ ప్లాన్ ముసాయిదాను తయారు చేశామన్నారు. ఇప్పటి వరకు దాదాపు నాలుగువేల సూచనలు, సలహాలు, అభ్యంతరాలొచ్చాయని తెలిపారు. వీటిని సానూకూలంగా తీసుకుని నగర సమగ్రాభివృద్ది కోసం ముసాయిదాను తయారు చేశామన్నారు. వరంగల్ ప్రస్తుత ముసాయిదా మాస్టర్ ప్లాన్ 2041 వరకు కావల్సిన అవసరాలను దృష్టిలో ఉంచుకుని రూపొందించామన్నారు.

వరంగల్ నగరానికి ఉన్న చారిత్రక ప్రత్యేకతను… పర్యావరణ, పురావస్తు అంశాలకు ప్రాధాన్యత ఇస్తూ, చెరువులు, రోడ్లు, కాలనీల విషయంలో క్షుణ్ణంగా అధ్యయనం చేయాలన్నారు కేటీఆర్. మాస్టర్ ప్లాన్ ఆమోదం తర్వాత GISతో అనుసంధానం చేస్తామన్నారు. మాస్టర్ ప్లాన్ ముసాయిదాలోని అంశాలను పరిశీలించేందుకు  ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఒక నోడల్ అధికారి ఏర్పాటు చేసి స్ధానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకోవాలన్నారు. స్థానికంగా ప్రజల నుంచి వచ్చే సలహాలను మరోసారి పరిశీలించాలని అధికారులకు అదేశాలిచ్చారు. హెచ్ఎండీఏ తరహాలో ల్యాండ్ పూలింగ్, భూ హక్కుల బదిలీ విధానం లాంటివి చేపట్టాలన్నారు కేటీఆర్.