మెడికల్ సీట్ల పేరుతో ఘరానా మోసం...కోట్లు కొట్టేశాడు

వరంగల్లో ఘరానా మోసం వెలుగు చూసింది. మెడికల్ సీట్ల పేరుతో కోట్లు కొట్టేసిన దొంగలు దొరికిపోయారు. మెడికల్ సీట్ల పేరుతో దందాకు తెరలేపిన  ఆంధ్రప్రదేశ్  తూర్పుగోదావరి జిల్లాకు చెందిన చాగంటి నాగ సాయి శ్రీనివాస్ను టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.  నిందితుడి దగ్గర నుంచి రూ. 3 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. 

వివరాల్లోకి వెళ్తే..

తూర్పు గోదావరికి చెందిన చాగంటి నాగ సాయి శ్రీనివాస్..మెడికల్ సీట్లు ఇప్పిస్తామని..తనకు ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లోని ప్రముఖ మెడికల్ కాలేజీల్లో తెలిసిన వారున్నారని విద్యార్థులకు నమ్మబలికాడు. వారి నుంచి రూ. కోట్లు వసూలు చేశాడు. అయితే ఇదే క్రమంలో వరంగల్కు చెందిన బరిగెల విజయ్ కుమార్ కూతురు కోసం ఎంబీబీఎస్ సీటు కోసం ప్రయత్నిస్తున్నాడు. ఈ  సమయంలో చాగంటి నాగసాయి శ్రీనివాస్ విజయ్ కుమార్తో  పరిచయం ఏర్పరచుకున్నాడు.  తాను వైష్ణవి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ స్థాపించానని..దాని ద్వారా మెడికల్ సీట్లు ఇప్పిస్తానని నమ్మబలికాడు. అందుకు రూ. 40 నుంచి 50 లక్షలు ఖర్చు అవుతుందన్నాడు. అతని వద్ద నుంచి సుమారుగా రూ. 9 లక్షలు వసూలు చేశాడు. ఆ తర్వాత నాగసాయి శ్రీనివాస్ను మెడికల్ సీటు గురించి అడిగితే తప్పించుకు తిరుగుతున్నాడు. దీంతో మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. 

పక్కా సమాచారంతో అరెస్ట్..

జులై 2వ తేదీ ఆదివారం నిందితుడు మిగతా డబ్బుల కోసం వస్తున్నాడని సమాచారం అందడంతో వరంగల్ సుబేదారి ఫారెస్ట్ ఆఫీస్ దగ్గర నాగసాయి శ్రీనివాస్ను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు నాగసాయి శ్రీనివాస్ 2006 నుంచి 2014 వరకు తూర్పు గోదావరిలో అమూల్య వొకేషనల్ కాలేజీని నడిపించాడని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత 2014 నుంచి 2018 వరకు శ్రీ ఎడ్యుకేషనల్ కన్సల్టెన్సీ నడిపించాడని చెప్పాడు.  హైదరాబాద్లో రాజేష్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుని ..ఇక్కడ వివిధ కాలేజీల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలు సేకరించేవాడని వెల్లడించారు. అందుకు నాగ సాయి శ్రీనివాస్ రూ. 30 వేలు చెల్లించేవాడని చెప్పారు. 

డబ్బులు సరిపోలేవు..కొత్త దందా..

వీటి ద్వారా వచ్చే ఆదాయం సరిపోకపోవడంతో అక్రమంగా డబ్బు సంపాదించాలనే ఆలోచనతో విశాఖలో 2020లో వైష్ణవి ఎడ్యుకేషనల్ సర్వీసెస్ ద్వారా నీట్ పరీక్షలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులకు మెడికల్ సీట్లు ఇప్పిస్తానని ఆశ చూపి వారి నుంచి లక్షల్లో వసూలు చేశాడు. ఈ విధంగా ఏపీ, తెలంగాణలో దాదాపు 30 మంది విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి కోట్లు వసూలు చేశాడని పోలీసులు తెలిపారు. ఇతనిపై ఇప్పటి వరకు 5 కేసులు నమోదయ్యాయని చెప్పారు.