
ఎంజీఎంలో అంబులెన్స్ దందా
పేషెంట్ల కండీషన్ ను బట్టి రేట్లు
20 కిలోమీటర్లకు రూ.3వేలు
రాజధానికి రూ.15వేలు
హనుమకొండ, వెలుగు : వరంగల్ ఎంజీఎం కేంద్రంగా సాగుతున్న ప్రైవేట్ అంబులెన్సుల దందాకు అడ్డుకట్ట పడడం లేదు. చావుబతుకుల మధ్య ఉన్న పేషెంట్లను వేరే ఆసుపత్రులకు తరలించాలన్నా.. డెడ్‌బాడీలను ఇండ్లకు చేర్చాలన్నా అంబులెన్స్ ఓనర్లు రూ.వేలకు వేలు గుంజుతున్నారు. అందరూ సిండికేట్అయి కిలోమీటర్‌కు రూ.100కు తగ్గకుండా వసూలు చేస్తున్నారు. ప్రభుత్వ అంబులెన్స్‌లు సరిపడా లేకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్ యజమానులు.. వెంటిలేటర్ ఉంటే ఒక రేటు.. లేకుంటే ఇంకో రేటు చెప్పి దోచుకుంటున్నారు. బాధితుల అవసరాన్ని క్యాష్ చేసుకుంటుండడంతో ఎంతోమంది నిరుపేదలు తీవ్రంగా నష్టపోతున్నారు. ఎంజీఎం ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్తే.. ఆసుపత్రిలోకి ప్రైవేటు అంబులెన్స్ రావద్దనే బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులిపేసుకున్నారు. ప్రైవేట్ అంబులెన్స్ ల విషయంలో ఏమీ చేయలేమని చేతులెత్తేయడంతో ఇటీవల కొంతమంది బాధితులు ఆర్టీఏకు ఫిర్యాదు చేశారు.
జేబు గుల్లా..
వరంగల్ ఎంజీఎంలో నిత్యం 3వేల నుంచి 4వేల మధ్య ఓపీ నమోదవుతోంది. రోజుకు సగటున 200 మంది ఇన్ పేషెంట్లుగా చేరుతున్నారు. ఇందులో పేషెంట్ల కండీషన్‌ను బట్టి డాక్టర్లు ఇతర ఆసుపత్రులకు లేదా రాజధానికి రిఫర్ చేస్తుంటారు. దీంతో ఇదే అవసరాన్ని ప్రైవేట్ అంబులెన్స్ యజమానులు క్యాచ్ చేసుకుని దందా చేస్తున్నారు. పేషెంట్‌ను సిటీలోని ఇతర ఆసుపత్రులకు తీసుకెళ్లాలన్నా రూ.1500 నుంచి రూ.2 వేలు వసూలు చేస్తున్నారు. నార్మల్ కండీషన్ లో ఉన్న పేషెంట్‌ను హైదరాబాద్ లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లాలంటే రూ.7 వేల నుంచి రూ.8 వేల వరకు తీసుకుంటున్నారు. అత్యవసరం అయితే రూ.12 వేల నుంచి రూ.15 వేల వరకు డిమాండ్ చేస్తున్నారు. దీంతో ఉచిత వైద్యం కోసం ఎంజీఎంకు వచ్చిన బాధితులు అంబులెన్స్‌ల దోపిడీకి గురి కావాల్సి వస్తోంది.
డెడ్ బాడీ తరలించాలన్నా తిప్పలే..
వరంగల్ సిటీలో దాదాపు 650 ప్రైవేట్ అంబులెన్స్ లు ఉన్నాయి. ఇందులో సగం వరకు ఎంజీఎం చుట్టుపక్కలే తిరుగుతున్నాయి. మిగతా సగం ప్రైవేట్ ఆసుపత్రుల వద్ద పడిగాపులు కాస్తున్నాయి. ఎంజీఎంలో పేషెంట్ చనిపోతే శవాన్ని తరలించేందుకు ఒకే ఒక ప్రభుత్వ అంబులెన్స్ఉండడంతో బాధితులు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు అంబులెన్స్‌లను ఆశ్రయిస్తున్నారు. ఎంజీఎంలో అంబులెన్స్ లు పెంచాలని ఏండ్లుగా పేషెంట్లు కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేడు. దీంతో డెడ్ బాడీలను తరలించడానికి 20 కిలోమీటర్లకు రూ.2500 నుంచి రూ.3వేలు వసూలు చేస్తున్నారు. రాత్రి సమయంలో ఇంకా ఎక్కువ తీసుకుంటున్నారు.
పట్టించుకోని ఆఫీసర్లు..
ఎంజీఎంలో ప్రైవేటు అంబులెన్సులు సిండికేట్ గా ఏర్పడి దందా సాగిస్తున్నారు. సమస్యను ఎంజీఎం ఆఫీసర్ల దృష్టికి తీసుకెళ్లినా పట్టించు కోకపోవడంతో ఆర్టీఏ ఆఫీసర్లకు ఫిర్యాదు చేశారు. వాస్తవానికి ఎంజీఎం ఆఫీసర్లతో పాటు డీఎంహెచ్‌వో, ఆర్టీఏ, పోలీస్ ఆఫీసర్ల కోఆర్డినేషన్ మేరకు ధరలను నియంత్రించే అవకాశం ఉంటుంది. కానీ ఆ దిశగా చొరవ తీసుకోవడం లేదు. తమ పరిధి కాదంటే తమది కాదంటూ దాట వేస్తున్నారు. దీంతో నిరుపేదల జేబులకు చిల్లులు పడుతున్నాయి.
మా పరిధిలో లేదు..
ప్రైవేటు అంబులెన్సులు ఎంజీఎం లోపల అడ్డాలు పెట్టకుండా ఆసుపత్రి ఆవరణలో బోర్డు పెట్టాం. ధరల విషయమనేది మా పరిధిలో లేదు. దీనిపై జిల్లా ఉన్నతా ధికారులే చర్యలు తీసుకోవాల్సి ఉంది.
– డా.వి.చంద్రశేఖర్, ఎంజీఎం సూపరింటెండెంట్
బండి సీజ్ చేస్తం
ప్రైవేట్ అంబులెన్సులు అధికంగా డబ్బులు గుంజుతున్నట్లు మా దృష్టికి వచ్చింది. ఇతర డిపార్ట్మెంట్ల ఆఫీసర్లతో చర్చించి, ప్రైవేటు అంబులెన్స్ యూనియన్ నాయకులతో మాట్లాడుతాం. బాధితుల స్టేట్మెంట్స్ ఆధారంగా ప్రైవేట్ అంబులెన్స్‌లపై యాక్షన్ తీసుకుంటాం. తీరు మారకపోతే బండి సీజ్ చేస్తాం.
– పురుషోత్తం, డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్, వరంగల్