
పొదలు, పుట్టల్లోంచే వార్డుల్లోకి పాములు
పగిలిన డ్రైనేజీ పైపుల నుంచి ఎలుకలు
ఏండ్లుగా పాత పైపులే దిక్కు ఆసుపత్రి ఆవరణలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు
అస్తవ్యస్తంగా ఆసుపత్రి పరిసరాలు
వరంగల్ : వరంగల్ ఎంజీఎం అపరిశుభ్రతకు కేరాఫ్ గా మారింది. ఆసుపత్రి ఆవరణలో ఎటుచూసినా పిచ్చి మొక్కలు, ముళ్ల పొదలే కనిపిస్తున్నాయి. కొన్నిచోట్ల పుట్టలు కూడా దర్శనమిస్తున్నాయి. ఇక డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. ఏండ్ల కింద ఏర్పాటు చేసిన పైపులు పగిలిపోయాయి. ఎక్కడ చూసినా లీకేజీలు కనిపిస్తున్నాయి. దీంతో ఎలుకలు, విష పురుగులు, సర్పాలు విచ్చలవిడిగా తిరుగుతున్నాయి. గోడలకున్న రంధ్రాలు, పగిలిన డ్రైనేజీ పైపుల ద్వారా వార్డుల్లోకి వస్తున్నాయి. దీంతో పేషెంట్లు ఆందోళన చెందుతున్నారు.
ఇదీ సంగతి..
వరంగల్ ఎంజీఎం 21.15 ఎకరాల్లో విస్తరించి ఉంది. దాదాపు 43కు పైగా పాత బిల్డింగులున్నాయి. కాగా, వీటి మధ్యనుండే ఖాళీ స్థలాలు పిచ్చి చెట్లతో నిండిపోయాయి. వాటర్ ట్యాంక్, నర్సింగ్ హాస్టల్ ప్రాంతాలను డంపింగ్ యార్డుగా మార్చారు. మార్చురీ వెనక వైపు, కబరిస్థాన్ వైపు, పిచ్చిచెట్లు ఐదారడుగుల ఎత్తుతో ఉన్నాయి. కార్పొరేషన్ ఆఫీస్ వైపునున్న క్యాన్సర్ వార్డ్, ఎక్స్ రే, స్కానింగ్ సెంటర్ల బిల్డింగ్‍ల ప్రాంతాలు పాముల పుట్టలతో ఉన్నాయి. తీగచెట్లు గోడలను ఆనుకుని రెండో అంతస్తు కిటికీల వరకు పెరిగాయి. ఆహ్లాదాన్ని, పచ్చదనాన్ని పంచే చెట్లను వదిలి మిగతా పిచ్చి చెట్లను తొలగించాల్సి ఉండగా.. అధికారులు ఏ రకమైన చర్యలు తీసుకోవడం లేదు.
టాయిలెట్లకు తాళాలు!
వరంగల్ సిటీ, వెలుగు: ఎంజీఎం ఆసుపత్రిలోని సిబ్బంది వింత నిర్ణయాలు.. పేషెంట్లకు ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. రోగులు, వారి బంధువుల కోసం ఏర్పాటు చేసిన టాయిలెట్లకు మంగళవారం తాళాలు వేశారు. చెత్త వేసినందుకే తాము టాయిలెట్లకు తాళాలు వేశామని సిబ్బంది చెప్పడం గమనార్హం. టాయిలెట్లు, పరిసర ప్రాంతాలను ఎప్పటికప్పుడు క్లీన్ చేయాల్సింది పోయి టాయిలెట్లకు తాళాలు వేయడం వివాదాస్పదంగా మారింది.
రెండు గంటలకే ఓపీ సేవలు
వరంగల్ ఎంజీఎంలో డాక్టర్లు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. ఉదయం 9గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఓపీ నిర్వహించాల్సిన డాక్టర్లు.. 10 గంటల నుంచి 12గంటల వరకే నిర్వహించి, చేతులు దులుపుకుంటున్నారు. పేషెంట్లు భారీగా తరలివచ్చినా పట్టించుకోవడం లేదు. ఇదేంటని ప్రశ్నిస్తే వచ్చే వారం రావాలంటూ ఉచిత సలహా ఇస్తున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ ఆగం..
హాస్పిటల్లోని డ్రైనేజీ వ్యవస్థ అధ్వానంగా ఉంది. వార్డుల్లో 1450 బెడ్లతో సేవలు అందిస్తున్న క్రమంలో పేషెంట్లు వారి బంధువులు వాడే వృథా నీరు, టాయిలెట్ల నీరు, ఆపరేషన్ థియేటర్లలోని నీరు వెళ్లే డ్రైనేజీలు ఎక్కడికక్కడ మురుగుతో నిండిపోయాయి. మోరీలు ఎలుకలకు స్థావరంగా మారాయి. ఇంటర్నల్ పైపులు దెబ్బతిన్నాయి. మట్టి, వ్యర్థాలతో నీరు ముందుకువెళ్లలేని దుస్థితి. ఇక చాంబర్లపై మూతలు లేక ఓపెన్‍గా ఉన్నాయి. హాస్పిటల్ ఏరియాలు దుర్వాసన రావడానికితోడు దోమల విజృంభణకు కారణమవుతున్నాయి. వార్డులకు సరఫరా అయ్యే నీటి పైపులు, టాయిలెట్ పైపులు చాలాచోట్ల పగిలిపోయాయి. దీంతో వాటిగుండా ఎలుకలు, పాములు పేషెంట్ల వద్దకు వస్తున్నాయి.
తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం
హాస్పిటల్ చుట్టూ పిచ్చి మొక్కలు, పాముల పుట్టలు ఉన్నవి వాస్తవమే. కొన్ని రోజులుగా వాటిని తొలగిస్తున్నాం. ఈ క్రమంలోనే అక్కడుండే ఎలుకలు.. వాటిని తినేందుకు పాములు అప్పుడప్పుడు వార్డుల్లోకి వస్తున్నాయి. కొందరు వ్యక్తులు, సిబ్బంది హాస్పిటల్ పేరును చెడగొట్టేలా పాత వీడియోలను సోషల్ మీడియా గ్రూపుల్లో వేస్తున్నారు. ఈ విషయంలో ఒకరిపై చర్యలు తీసుకున్నాం. ఏపుగా పెరిగిన పిచ్చి చెట్లను తొలగిస్తాం. పగిలిన పైపులు, డ్రైనేజీ వ్యవస్థను మెరుగుపరుస్తాం. - డాక్టర్ వి.చంద్రశేఖర్ (ఎంజీఎం సూపరింటెండెంట్)