ఎంజీఎం సూపరింటెండెంట్ రాజీనామా ఇంకా ఆమోదించని ప్రభుత్వం

వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ఎం జీఎం ఆసుపత్రి సూపరింటెండెంట్  మురళి రాజీనామా చేశారు. కాకతీయ మెడికల్  కాలేజ్  ప్రిన్సిపాల్  రాంకుమార్ రెడ్డి ద్వారా డైరెక్టర్  ఆఫ్  మెడికల్  ఎడ్యుకేషన్ కు తన రాజీనామా లేఖను సోమవారం సాయంత్రం పంపించారు. అయితే ఈ లేఖను ప్రభుత్వం ఇంకా ఆమోదించలేదు.  వ్యక్తిగత కారణాలతో రాజీనామా చేస్తున్నట్లు మురళి ప్రకటించినప్పటికీ, రాజకీయ ఒత్తిళ్లతో పాటు ఆసుపత్రికి చెందిన కొంత మంది ఉద్యోగులు, వైద్యులు మురళిని ఇబ్బందులకు గురి చేసినట్లు తెలుస్తోంది. 

గతంలో సూపరింటెండెంట్ గా పని చేసిన చంద్రశేఖర్ బదిలీ కావడంతో ఆ స్థానంలో తాత్కాలికంగా మురళిని ప్రభుత్వం నియమించింది. అనంతరం ఆసుపత్రిలోని  డెర్మటాలజీ విభాగానికి చెందిన స్వర్ణ కుమారిని ఆస్పత్రి సూపరింటెండెంట్​గా ప్రభుత్వం నియమించినప్పటికీ ఆమె నిరాకరించారు. దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మురళి  జూలై 23 నుంచి నేటి వరకు అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆసుపత్రిలోని అనస్థీషియా విభాగానికి అధిపతిగా ఉన్న మురళి అదనంగా సూపరింటెండెంట్ గా సైతం విధులు నిర్వహించారు. తనకు ఆరోగ్యం సహకరించకపోవడం వల్లనే రాజీనామా చేసినట్లు మురళి తెలిపారు.