ఎంజీఎంలో అక్రమ దుకాణాలు..!

ఎంజీఎంలో అక్రమ దుకాణాలు..!
  •     రెన్యువల్ చేయకుండా కొనసాగిస్తున్న షాపులు
  •     నోటీసులు జారీ చేసిన ఎమ్మార్వో
  •     నలుగురితో కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్​

వరంగల్ సిటీ, వెలుగు : వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో అక్రమ దుకాణాల భాగోతం బయటపడింది. గురువారం వరంగల్ ఎమ్మార్వో ఇక్బాల్ ఆస్పత్రిలోని టీ, మెడికల్​షాపులు, క్యాంటీన్లను తనిఖీ చేశారు. దీంతో ఇవి అక్రమంగా కొనసాగుతున్నాయనే విషయం వెలుగులోకి వచ్చింది. షాప్​ఏర్పాటు చేస్తున్న సమయంలో కలెక్టర్ పర్మిషన్ తీసుకుని, ప్రతి ఏడాది రెన్యువల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆసుపత్రిలో మొత్తం 21 షాపులు ఉండగా, 19 షాపులు పూర్తిగా నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నారు.

ఇక్కడ ఉన్న రెండు హోటళ్లలో గ్యాస్ సిలిండర్లను ఎమ్మార్వో సీజ్ చేశారు. ఆస్పత్రిలో నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం నిర్వహిస్తున్న షాపుల్లో అధిక రేట్లు, అనధికార అమ్మకాలు ఎమ్మార్వో తనిఖీల్లో బయటపడ్డాయి. వీటితోపాటు ఆస్పత్రికి చెందిన కొంతమంది అధికారులకు లంచాలు ఇస్తూ, ఎలాంటి పర్మిషన్ లేకుండా కూడా రెండు షాపులు నిర్వహిస్తున్నట్లు తెలిసింది.

ఒక్కడికే 15 ఏండ్లుగా క్యాంటీన్..

ఆస్పత్రిలోని ఆర్ఎంవో ఆఫీస్ పక్కన ఉన్న డాక్టర్స్ క్యాంటీన్ 15 ఏండ్లుగా ఒక్కరికే ఇస్తున్నారు. ఈ క్యాంటీన్​నిర్వాహకుడు సుమారు మూడున్నర లక్షల రూపాయలు ఎంజీఎంకు బాకీ ఉండటంతోపాటు ఆస్పత్రిలోని కరెంటును సైతం ఉచితంగానే వాడేస్తున్నట్లు ఎమ్మార్వో తనిఖల్లో తేలింది. సఫాయి కర్మచారి (టాయిలెట్స్) నిర్వాహకులు సైతం నాలుగు లక్షలకు పైగా ఎంజీఎంకు బాకీ ఉన్నట్లు తెలిసింది.

ఆస్పత్రిలోని 21 షాపుల్లో రూ. 9.53,000 బాకీ ఉండగా, ఇందులో 80 శాతం వాటా ఈ రెండు షాపులదే ఉంది. జీవన్​ధార ఫార్మసీ సైతం నిబంధనలకు విరుద్ధంగా మందులు విక్రయిస్తున్నారని, మెడిసిన్​కొన్న వారికి రిసిప్ట్ సైతం ఇవ్వడం లేదని ఎమ్మార్వో తనిఖీలో తేలింది. షాపులోని మందులకు టెంపరేచర్ నిర్వహణ సరిగా లేదని తేలింది.

నలుగురితో కమిటీ ఏర్పాటు...

మహాత్మాగాంధీ మెమోరియల్​ఆస్పత్రిలోని అక్రమ షాపుల వ్యవహారం విషయంపై వరంగల్​కలెక్టర్ సత్య శారద నలుగురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేశారు. ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ శశికుమార్, మట్టవాడ సీఐ గోపి, వరంగల్ ఎమ్మార్వో ఇక్బాల్, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్లు ఉన్నారు. ఈ కమిటీ రేపటిలోగా పూర్తి సమాచారాన్ని కలెక్టర్ కు అందజేయాల్సి ఉంది.