
- డ్యూటీలో సమయపాలన పాటించని డాక్టర్లు
- రోజుల తరబడి చుట్టాల ఎదురుచూపులు
- వైద్యులతో మృతుల బంధువుల వాగ్వాదాలు
వరంగల్/వరంగల్ సిటీ, వెలుగు: వరంగల్ ఎంజీఎం మార్చురీలో డెడ్‌బాడీలకు పోస్ట్‌మార్టం కోసం గంటలు, రోజుల తరబడి వేచిఉండాల్సివస్తోంది. డాక్టర్లు టైమ్‌కు రాక మృతుల బంధువులు ఇబ్బంది పడుతున్నారు. సోమ,మంగళవారాల్లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన డెడ్‌బాడీలకు పోస్ట్‌మార్టం ఆలస్యం కావడంతో బంధువులు రోజంతా పడిగాపులు కాశారు. హనుమకొండ జిల్లా కోమటిపల్లికి చెందిన ఉడుత సాయికుమార్ ఆదివారం రైలు కింద పడి అనుమానాస్పదంగా చనిపోయాడు. కాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని సోమవారం ఉదయం ఎంజీఎం మార్చురీకి తరలించారు. మహబూబాబాద్, ధర్మసాగర్, పస్రా, ఇంతేజార్‍గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఐదు మృతదేహాలు సోమవారం మధ్యాహ్నం, సాయంత్ర వేళల్లో ఎంజీఎం మార్చురీకి వచ్చాయి.
ఇంటోళ్లు.. చుట్టాల ఎదురుచూపులు
ప్రమాదాల్లో, ఇతర కారణాలతో చనిపోయిన వారి ఇంటోళ్లు, చుట్టాలు డెడ్‌బాడీల కోసం మంగళవారం ఉదయమే మార్చూరీకి వచ్చినా అక్కడ కనీసం స్పందించేవారు కరువయ్యారు. సిబ్బందిని ఎన్నిసార్లు అడిగినా డాక్టర్ సాబ్ లేరనే సమాధానమే వచ్చింది. రెండ్రోజులు నిద్రహారాలు లేక మృతుల చుట్టాలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మంగళవారం మధ్యాహ్నం తర్వాత పోస్టుమార్టం చేసేందుకు డాక్టర్ రావడంతో అప్పటికే ఆగ్రహంతో ఉన్న మృతుల బంధువులు డాక్టర్, సిబ్బందితో వాదనకు దిగారు. అనంతరం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు.
ఒక్కటే పని కాదనే సమాధానం
ఎంజీఎం మార్చురీలో పోస్ట్‌మార్టం చేయాల్సిన డాక్టర్లు టైమ్‌కు రావడంలేదు. తమకు కేవలం ఫోరెన్సిక్ డ్యూటీలే లేవని, కేఎంసీ స్టూడెంట్లకు పాఠాలు చెప్పాలని, కొన్ని కేసుల్లో కోర్టులకు వెళ్లాల్సిఉంటుందని అంటున్నారు. రోస్టర్ ప్రకారం పోస్టుమార్టం డ్యూటీ చేయాలి. కానీ మార్చురీకి వచ్చే శవాలసంఖ్యకు తగ్గట్టు డాక్టర్లు, సిబ్బంది లేకపోవడం సమస్యగా మారుతోంది. తమ కుటుంసభ్యుడు చనిపోయి పుట్టెడు దు:ఖంలో ఉన్నవారు పోస్ట్‌మార్టం కోసం రోజుల తరబడి ఎదురుచూడాల్సిరావడం దారుణమని, కావాల్సిన వైద్యసిబ్బందిని నియమించాలని బాధిత కుటుంబాలు కోరుతున్నాయి.