కాజీపేట జంక్షన్​ను డివిజన్​గా అప్ గ్రేడ్ చేయాలి : ఎంపీ కడియం కావ్య

కాజీపేట జంక్షన్​ను డివిజన్​గా అప్ గ్రేడ్ చేయాలి : ఎంపీ కడియం కావ్య

కాజీపేట, వెలుగు: కాజీపేట రైల్వే జంక్షన్ ను డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలని, రైల్వే బోర్డు మీటింగ్ లో ప్రతిపాదించాలని వరంగల్ ఎంపీ కడియం కావ్య కోరారు. గురువారం సికింద్రాబాద్ రైల్ నిలయంలో తెలంగాణ ఎంపీలతో సౌత్ సెంట్రల్ రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వరంగల్ ఎంపీ కడియం కావ్య హాజరై వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని రైల్వే అంశాలపై చర్చించారు.

సౌత్ సెంట్రల్ రైల్వేకు ముఖ ద్వారంగా ఉన్న కాజీపేట రైల్వే జంక్షన్ ను రైల్వే డివిజన్ గా అప్ గ్రేడ్ చేయాలని కోరారు. కాజీపేట రైల్వే హాస్పిటల్ లో మహిళా డాక్టర్, సిబ్బందిని నియమించాలన్నారు. ఫాతిమానగర్ రైల్వే ఆర్వోబీ పనులను వేగవంతం చేయాలని, కాజీపేట రైల్వే స్టేషన్ లో రైళ్లరాకపోకలకు మరో రెండు ప్లాట్ ఫారాలు నిర్మించాలని సూచించారు. కాజీపేట రైల్వే స్టేషన్ ఆవరణలో ఆర్టీసీ బస్టాండ్ కోసం రైల్వే స్థలం ఇవ్వాలన్నారు.

రైల్వే వ్యాగన్ మానిపాక్చరింగ్ యూనిట్ ను కోచ్ ప్యాక్టరీగా అప్ గ్రేడ్ చేసే ప్రతిపాదనపై జీఎంకు ఎంపీ అభినందనలు తెలిపారు. కొత్తగా ప్రతిపాదించిన నష్కల్ చింతలపల్లి గూడ్స్ లైన్ నిర్మాణంపై పునరాలోచించాలని కోరారు. ఈ కొత్త లైన్ నిర్మాణంపై ప్రజాప్రతినిధులు, రైతులను సంప్రదించలేదని స్థానిక రైతుల నుంచి ఈ గూడ్స్ లైన్ ప్రతిపాదనపై వ్యతిరేకత వస్తుందని ఆమె జీఎం దృష్టికి తీసుకెళ్లారు. సమావేశంలో ఎంపీ ప్రస్తావించిన అంశాలను రైల్వే బోర్డు మీటింగ్ లో పెడుతానని జీఎం చెప్పినట్లు ఎంపీ కడియం కావ్య తెలిపారు.