
- ఉమ్మడి జిల్లాపై టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్ల దృష్టి
- అత్యధిక టీచర్ ఓటర్లు ఇక్కడే..
- 12 జిల్లాల్లో మొత్తం ఎమ్మెల్సీ ఓటర్లు 24,905
- ఓరుగల్లు 06 జిల్లాల్లో 10,797, ఉమ్మడి నల్గొండలో 8,041, ఉమ్మడి ఖమ్మంలో 5,904, సిద్దిపేట జిల్లాలో కేవలం 163 ఓట్లు
- 19 మందిలో వరంగల్‍ను చుట్టేస్తున్న ప్రధాన అభ్యర్థులు
వరంగల్, వెలుగు: వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ క్యాండిడేట్లు ఓరుగల్లుపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నారు. ఈ స్థానానికి గతంలో మూడుసార్లు ఎన్నికలు జరగగా, ఇప్పుడు నాలుగో ఎలక్షన్‍లో తీవ్ర పోటీ నెలకొంది. మూడు ఉమ్మడి జిల్లాలతో పాటు సిదిదపేట జిల్లాలోని కొందరు టీచర్లు ఈ ఎమ్మెల్సీ స్థానం పరిధిలో ఓటు వేయనున్నారు. 2007లో ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య, 2013లో పీఆర్‍టీయూ అభ్యర్థి పూల రవీందర్, 2019లో యూటీఎఫ్ అభ్యర్థి అలుగుబెల్లి నర్సిరెడ్డి విజయం సాధించారు. ప్రస్తుతం జరుగుతున్న ఎన్నికలకు కాంగ్రెస్, బీఆర్‍ఎస్ లు దూరంగా ఉండగా, బీజేపీ తరఫున అభ్యర్థిని బరిలో నిలిపారు. మొత్తంగా 19 మంది టీచర్ ఓట్ల కోసం సై అంటే సై అంటున్నారు. ఉమ్మడి నల్గొండ, ఖమ్మం జిల్లాలతో పోలిస్తే.. అత్యధిక టీచర్ ఓట్లు ఓరుగల్లు కేంద్రంగా ఉండటంతో బీజేపీ ముఖ్యనేతలతో పాటు ఆయా టీచర్ యూనియన్ల అభ్యర్థులు జిల్లాను ఇప్పటికే చుట్టేశారు.
ఓరుగల్లులో 10,797.. సిద్దిపేటలో 163 మంది ఓటర్లు
వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం పరిధిలోని 12 జిల్లాల్లో మొత్తం 24,905 మంది ఓటర్లున్నారు. పురుషులు 14,940 మంది ఉండగా, స్ర్తీలు 9,965 మంది ఉన్నారు. ఇందులో ఉమ్మడి ఓరుగల్లు జిల్లాల నుంచి (వరంగల్, హనుమకొండ, జనగామ, మహబూబాబాద్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు) అత్యధికంగా 10,797 మంది ఓటర్లు ఉన్నారు. రెండో స్థానంలో ఉమ్మడి నల్గొండ (యాదాద్రి, సూర్యాపేట, నల్గొండ) జిల్లాల నుంచి 8,041 మంది, ఉమ్మడి ఖమ్మం (భద్రాద్రి, ఖమ్మం) జిల్లాల నుంచి 5,904 మంది ఉండగా, అత్యల్పంగా సిద్దిపేట జిల్లా నుంచి కేవలం 163 మంది టీచర్ ఓటర్లున్నారు. మొత్తం 200 పోలింగ్ స్టేషన్లు ఉండగా, ఉమ్మడి ఓరుగల్లు 72 సెంటర్లు, ఉమ్మడి నల్గొండ 77, ఉమ్మడి ఖమ్మం 47, సిద్దిపేటలో 04 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు.
12 జిల్లాల పరిధిలో 19 మంది అభ్యర్థులు
వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ స్థానం కోసం 22 మంది నామినేషన్లు వేయగా, ముగ్గురు ఉపసంహరించుకోగా 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. పీఆర్‍టీయూ నుంచి ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పింగళి శ్రీపాల్‍రెడ్డి, టీఎస్ యూటీఎఫ్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, బీజేపీ నుంచి పులి సరోత్తంరెడ్డి, టీపీఆర్టీయూ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు గాల్‍రెడ్డి హర్షవర్ధన్‍రెడ్డి, టీచర్స్ జాక్ పేరుతో మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్, బీసీ నినాదంతో కుడా మాజీ చైర్మన్ సంగంరెడ్డి సుందర్‍రాజ్‍యాదవ్, టీఎస్‍సీపీఎస్‍ఈయూ కొలిపాక వెంకటస్వామి ప్రధాన పోటీదారులుగా టీచర్ ఓట్ల కోసం వేటలో పడ్డారు. ప్రజావాణి పార్టీ తరఫున ఎల్.వెంకటేశ్వర్లుతోపాటు ఇండిపెండెంట్లుగా కంటె సాయన్న, అర్వ స్వాతి, యేలే చంద్రమోహన్, పన్నాల గోపాల్‍రెడ్డి, చాలిక చంద్రశేఖర్, తలకోల పురుషోత్తంరెడ్డి, జంగిటి కైలాసం, జె.శంకర్, తాటికొండ వెంకటరాజయ్య, బంక రాజు, దామెర బాబురావు పోటీచేస్తున్నారు. ప్రచారంలో జీఓ 371, స్పౌస్ ట్రాన్స్ఫర్లు, పెండింగ్ డీఏలు, ప్రైవేటు టీచర్ల డిమాండ్లు ప్రధాన అంశాలుగా మారాయి.
ఓరుగల్లు నుంచి ప్రధాన పోటీదారులు..
టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓరుగల్లు నుంచే ఎక్కువ మంది పోటీ పడుతున్నారు. పీఆర్‍టీయూ అభ్యర్థి పింగళి శ్రీపాల్‍రెడ్డి వరంగల్ జిల్లా నెక్కొండ నుంచే ఉన్నారు. బీజేపీ అభ్యర్థి పులి సరోత్తం రెడ్డి జయశంకర్ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలం మందలూరిపల్లెకు చెందినవారు. బీసీ నినాదంతో పోటీ చేస్తున్న సంగంరెడ్డి సుందర్‍రాజ్‍యాదవ్ హనుమకొండ జిల్లా హసన్‍పర్తి మండలం ముచ్చర్ల గ్రామానికి చెందిన వారు. తెలంగాణ స్టేట్ కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ (టీఎస్‍సీపీఎస్‍ఈయూ) ప్రతినిధిగా ఎంజీఎంలో ప్రముఖ ఎముకల డాక్టర్, మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ కొలిపాక వెంకటస్వామి, గ్రేటర్ హనుమకొండకు చెందిన రిటైర్డ్ డీఈవో యేలే చంద్రమోహన్‍తోపాటు మరో ఇద్దరు ఉమ్మడి వరంగల్ జిల్లాలకు చెందినవారిగా బరిలో ఉన్నారు.
జిల్లాల వారీగా పోలింగ్ సెంటర్లు, ఓటర్ల వివరాలు..
జిల్లా పోలింగ్ సెంటర్లు పురుషులు స్ర్తీలు మొత్తం
హనుమకొండ 15 2884 2214 5098
వరంగల్ 13 1381 844 2225
మహబూబాబాద్ 16 1083 535 1618
జనగామ 12 556 365 921
ములుగు 09 394 218 612
భూపాలపల్లి 07 211 112 323
నల్గొండ 37 2688 1795 4483
సూర్యాపేట 23 1690 947 2637
యాదాద్రి 17 595 326 921
ఖమ్మం 24 2300 1655 3955
భద్రాద్రి 23 1038 911 1949
సిద్దిపేట 04 120 43 163