
- హనుమకొండ ఏసీపీ దేవేందర్ రెడ్డి వెల్లడి
హనుమకొండ, వెలుగు: వరంగల్ ఎన్‌ఐటీలో జాబ్, స్టూడెంట్‌కు సీటు ఇప్పిస్తానంటూ మోసగించిన ప్రైవేట్ టీచర్ ను హనుమకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడి వద్ద రూ.2.68 లక్షల నగదు, రూ.5.1 లక్షల విలువైన గోల్డ్, 3 సెల్ ఫోన్లు, ఒక డెబిట్‌కార్డు స్వాధీనం చేసుకున్నామని హనుమకొండ ఏసీపీ దేవేందర్‌రెడ్డి శుక్రవారం మీడియాకు తెలిపారు.
ఏపీలోని కడప జిల్లా వీరపునాయునిపల్లి మండలం ఇందుకూరు కొత్తపల్లికి చెందిన కొమ్మ వివేకానందరెడ్డి అలియాస్ కిశోర్‌రెడ్డి ప్రైవేటు టీచర్‌గా పని చేసేవాడు. వచ్చే జీతం జల్సాలకు సరిపోకపోతుండగా తోటి టీచర్ల వద్ద డబ్బులు, గోల్డ్ తీసుకుని మోసగించేవాడు. దీంతో అతడిపై మూడు కేసులు నమోదు చేసి జైలుకు పంపారు. రెండు నెలల జైలు జీవితం గడిపిన తర్వాత బయటకు వచ్చిన కిశోర్ రెడ్డి హనుమకొండకు మకాం మార్చాడు.
ఇక్కడ ప్రైవేటు స్కూల్ లో టీచర్‌గా చేరాడు. అక్కడ మహిళా టీచర్ తో పరిచయం పెంచుకుని.. తనకు వరంగల్ ఎన్‌ఐటీలో తెలిసినవారు ఉన్నారని ల్యాబ్ అసిస్టెంట్ జాబ్ ఇప్పిస్తానని ఆమె నుంచి రూ.8 లక్షలు తీసుకున్నాడు. ఆ తర్వాత ఆమె కొడుకుకు ఎన్‌ఐటీలో సీటు ఇప్పిస్తానని 60 గ్రాముల గోల్డ్ తీసుకుని పారిపోయాడు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడిపై నిఘా పెట్టారు. శుక్రవారం ఇంట్లోని సామగ్రి తీసుకెళ్తున్నట్టు సమాచారం అందడంతో హనుమకొండ పోలీసులు వెళ్లి అరెస్ట్ చేశారు. నిందితుడు మరో ముగ్గురి నుంచి కూడా పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు గుర్తించారు.