
- కీలక నేత కారు దిగడంతో అగమ్యగోచరంగా బీఆర్‍ఎస్
- కడియం చేరికతో కాంగ్రెస్‍లో మారనున్న సమీకరణాలు
- కాంగ్రెస్ టికెట్ కడియం ఫ్యామిలీకే ఇస్తారనే ప్రచారం
వరంగల్/హనుమకొండ, వెలుగు: స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీసుకున్న పార్టీ మార్పు నిర్ణయం ఓరుగల్లు రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించింది. ఉమ్మడి వరంగల్ నుంచి ఇప్పటికే పలువురు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎంపీలు బీఆర్‍ఎస్ కు రాజీనామా చేసినా.. ఆ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఉన్న కడియం కావ్య తప్పుకున్న తీరు బీఆర్ఎస్కు బిగ్‌షాక్ ఇచ్చింది. ఎన్నికల టైంలో సీనియర్ నేత తన కూతురైన ఎంపీ అభ్యర్థితో సహా కారు దిగడంతో పార్టీలో అసలు ఏం జరుగుతుందో తెలియక గులాబీ క్యాడర్అయోమయంలో పడిపోయింది. అటు కడి యం శ్రీహరి, కావ్య కాంగ్రెస్‍లో చేరనుండడంతో ఆ పార్టీలోనూ సమీకరణాలు మారే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరంగల్ కాంగ్రెస్ టికెట్కడియం ఫ్యామిలీకే ఇస్తారన్న వార్తల నేపథ్యంలో ఈ టికెట్‌పై ఆశలు పెట్టుకున్న నేతల్లో టెన్షన్ మొదలైంది.
ఓ వైపు మీటింగ్ ఏర్పాట్లు.. అంతలోనే లేఖాస్త్రం
కడియం శ్రీహరి కూతురు కడియం కావ్యకు బీఆర్ఎస్ వరంగల్ ఎంపీ టికెట్దక్కడంతో ఈ నెల 31న ఉమ్మడి జిల్లా నేతలతో స్టేషన్ ఘన్‍పూర్ నియోజకవర్గంలో పార్లమెంట్‌స్థాయి మీటింగ్ పెట్టాలని నిర్ణయించారు. దాని సక్సెస్ బాధ్యతలు తీసుకున్న లీడర్లంతా ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. అంతలోనే ఎవరూ ఊహించని రీతిలో గురువారం రాత్రి కడియం కావ్య పార్టీ హైకమాండ్‍పై లేఖాస్త్రం సంధించారు. లిక్కర్‌స్కామ్, భూకబ్జాలు, ఫోన్‌ట్యాపింగ్ ఆరోపణలతో బీఆర్ఎస్ ప్రతిష్ట దిగజారిందని, అలాంటి పార్టీ నుంచి తాను పోటీచేయలేనని చెప్పడంతో పార్టీకి బిగ్‌షాక్ తగిలినట్లయ్యింది. గురువారం రాత్రి నుంచి వరంగల్‌లో ఎక్కడ చూసినా ఇదే అంశం మీద చర్చ నడుస్తున్నది.
నిన్నటివరకు నలుగురు పోటీ.. ఇప్పుడంతా ఖాళీ
బీఆర్ఎస్లో వరంగల్ టికెట్ కోసం మొదట్లో ముగ్గురు సీనియర్లు పోటీపడ్డారు. వరంగల్ సిట్టింగ్ ఎంపీ పసునూరి దయాకర్, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే, పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు ఆరూరి రమేశ్, మాజీ డిప్యూటీ సీఎం తాటికొండ రాజయ్య టికెట్ ప్రయత్నాల్లో ఉండగా, అనూహ్య రీతిలో స్టేషన్ ఘన్‍పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కూతురు కావ్య పేరు తెరపైకి వచ్చింది. దీంతో తమకు టికెట్ దక్కదని భావించిన తాటికొండ రాజయ్య, ఆరూరి రమేశ్, పసునూరి దయాకర్ ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్, బీజేపీలో చేరారు. ఈలోగా కడియం కావ్యకే బీఆర్ఎస్ టికెట్ఇవ్వడంతో విషయం సద్దుమణిగింది అనుకునే లోపే ఆమె పోటీ నుంచి తప్పుకుంది. నిన్నమొన్నటి దాకా బీఆర్ఎస్టికెట్ల కోసం కొట్లాడిన నలుగురిలో ఇప్పుడు ఒక్కరు కూడా లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
షాక్‌లో కాంగ్రెస్ ఆశావహులు..
రెండు మూడు వారాల క్రితం కడియం శ్రీహరి కాంగ్రెస్‍లో చేరతారని ప్రచారం జరిగింది. కాగా, శ్రీహరి దీనిని కొట్టిపారేశారు. పార్టీతో పాటు సీఎం రేవంత్‍రెడ్డిని కూడా విమర్శించారు. దీంతో ఆయన పార్టీ మారడం ఉత్తమాటేనని అందరు భావించారు. కానీ, అనుహ్యంగా బీఆర్‍ఎస్ ను వీడి కాంగ్రెస్‍లో చేరేందుకు సిద్ధమయ్యారు. కడియం శ్రీహరికిగానీ, లేదంటే కావ్యకు గానీ వరంగల్ కాంగ్రెస్ టికెట్ ఇస్తామన్న హామీతోనే ఇద్దరూ పార్టీ మారినట్లు చర్చ జరుగుతోంది. దీంతో గతంలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి, ప్రస్తుతం టికెట్వస్తుందన్న నమ్మకంతో ఉన్న దొమ్మాటి సాంబయ్య, సిట్టింగ్ ఎంపీగా అవకాశం వస్తుందని ఆశతో ఉన్న పసునూరి దయాకర్, రామగల్ల పరమేశ్వర్, విద్యాసంస్థల అధినేత పరంజ్యోతి ఆందోళనలో పడ్డారు. మొత్తంగా కడియం ఫ్యామిలీ తీసుకున్న నిర్ణ యం బీఆర్ఎస్ను కుదిపేయగా, కాంగ్రెస్‍లో సరికొత్త సమీకరణాలకు తెరతీసినట్లయ్యింది.