అయితే వరంగల్​.. లేదంటే ఖమ్మం..!

  •  పార్లమెంట్​ సీటు కోసం ఖర్గే వద్ద 
  • సీపీఐ జాతీయ నేతల ప్రపోజల్​
  • ఈ రెండు చోట్లా కాంగ్రెస్​ లీడర్లలో ఆందోళన

వరంగల్, వెలుగు: వరంగల్, ఖమ్మం పార్లమెంట్​ఎంపీ సీట్లలో ఏదో ఒకటి తమకు కేటాయించాలని సీపీఐ జాతీయ నేతలు ఏఐసీసీ చీఫ్​ మల్లికార్జున ఖర్గేను కోరారు. మంగళవారం సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి వర్గ సభ్యులు రామకృష్ణ పాండే.. కాంగ్రెస్‍ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఇండియా కూటమి పొత్తులో భాగంగా వీలైతే వరంగల్‍ ఎస్సీ నియోజకవర్గాన్ని కేటాయించాలని,  అది సాధ్యం కాకపోతే ఖమ్మం సీటయినా ఇవ్వాలని అడిగినట్లు తెలిసింది. 

ఖమ్మం జనరల్​ స్థానం కావడంతో వరంగల్​కే ఫస్ట్​ ప్రయార్టీ ఇవ్వాలని కోరినట్లు సమాచారం. కాగా, భారత్​జోడోయాత్రలో ఉన్న రాహుల్​తో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని ఖర్గే చెప్పినట్లు  సీపీఐ నేతలు మీడియాకు తెలిపారు. సీపీఐకి చెందిన దివంగత నేత బీఆర్‍ భగవాన్‍దాస్‍ కొడుకు సీనియర్‍ జర్నలిస్ట్ బీఆర్‍ లెనిన్‍ పేరును పార్టీ పెద్దలు ముందుకు తెస్తున్నారు. 

సీపీఐ రాష్ట్ర అధ్యక్షుడు సాంబశివరావు సైతం రెగ్యులర్‍గా జిల్లాలో పర్యటిస్తూ కేడర్‍లో జోష్‍ నింపే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా, పొత్తు చర్చలతో ఖమ్మం, వరంగల్​ జిల్లాల్లో కాంగ్రెస్​ టికెట్​ ఆశిస్తున్న నాయకుల్లో టెన్షన్​ మొదలైంది. ఈ రెండు నియోజకవర్గాల నుంచి పెద్దసంఖ్యలో నేతలు కాంగ్రెస్​ టికెట్​ కోసం అప్లై చేసుకోగా, ఖమ్మం నుంచి మంత్రుల కుటుంబీకులే ఆశావహులుగా ఉన్నారు. దీంతో వరంగల్​వైపు కాంగ్రెస్​ హైకమాండ్​ ఎక్కడ మొగ్గుచూపుతుందోనని ఓరుగల్లుకు చెందిన ఆశావహులు ఆందోళన చెందుతున్నారు.