- ఈ రింగ్ రోడ్ మీదుగానే మేడారం జాతరకు 25 జిల్లాల భక్తులు
- వడ్ల కుప్పలతో ఇటీవలే పదుల సంఖ్యలో ప్రమాదాలు
- గ్రామాల కనెక్టివిటీ వద్ద పనిచేయని ట్రాఫిక్ సిగ్నల్స్, లైట్లు
- కనిపించని పెట్రోలింగ్ వెహికల్స్, పోలిసింగ్
- ధాన్యం కుప్పలు ఆరబోయకుండా చూస్తేనే యాక్సిడెంట్లకు అడ్డుకట్ట
వరంగల్, వెలుగు : మేడారం సమ్మక్క సారక్క జాతరకు మరో రెండు నెలల సమయం ఉండగా.. భక్తులు ఇప్పటినుంచే ముందస్తు మొక్కులు చెల్లించుకుంటున్నారు. సెలవులు, వీకెండ్స్ వచ్చాయంటే మేడారం వైపు వెళ్లే దారులన్నీ రద్దీగా మారుతున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లా తప్పితే హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట వంటి దాదాపు 25 జిల్లాల నుంచి భక్తులు మేడారానికి తరలివెళ్తున్నారు.
వారి వాహనాలు వరంగల్ లోకి ప్రవేశించే క్రమంలో సిటీ చుట్టూ ఉండే ఇన్నర్ కమ్ ఔటర్ రింగ్ రోడ్‍పై డేంజర్ బెల్స్ మోగుతున్నాయి. రోడ్ల మీద ఎక్కడికక్కడ రైతులు వడ్లను పోశారు. దీంతో రింగ్ రోడ్‍పై ప్రయాణించే వాహనదారులకు ఈ వడ్ల కుప్పలు ప్రాణసంకటంగా మారాయి. గడిచిన ఏడాది నుంచి పలివేల్పుల, ముచ్చర్ల, పెగడపల్లి గ్రామాలు కలిసే ఏరియాల్లో పదుల సంఖ్యలో మోటారిస్టులు ప్రాణాలు కోల్పోయారు. కనీసం మేడారం జాతర టైంలో అయినా రైతులు రోడ్డుపై వడ్లు ఆరబోయకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
రింగు రోడ్డుపై అడుగుకో వడ్ల కుప్ప
మేడారం జాతరకు హైదరాబాద్, నల్గొండ మార్గంలో వచ్చే వాహనాలు కరుణాపురం ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వద్ద ఓఆర్‍ఆర్ లో కలుస్తాయి. కరీంనగర్, సిద్దిపేట, నిజామాబాద్ వైపు నుంచి వచ్చే భక్తుల వెహికల్స్ ఎల్కతుర్తి, హసన్‍పర్తి మీదుగా వచ్చి బీమారం వద్ద రింగ్ రోడ్ మీదుగా వెళుతున్నాయి. ఇప్పటికే హసన్‍పర్తి నుంచి ఎల్కతుర్తి వరకు 9 కిలోమీటర్ల ప్రయాణం చాలా ప్రమాదకరమని చెప్పుకుంటారు.
జిల్లాలో ఇటీవలే జరిగిన పెద్ద యాక్సిడెంట్లన్నీ ఈ మార్గంలోనే సంభవించాయి. ప్రయాణికులు ఇవన్నీ దాటుకుని ట్రాఫిక్ బాధలు లేకుండా జర్నీ చేసే రింగు రోడ్డు ఇప్పుడు నిత్యం ప్రమాదాలకు కేరాఫ్‍గా మారింది. కరీంనగర్ రోడ్డులోని బీమారం నుంచి వరంగల్ వైపు వెళ్లే వాహనాలు కలిసే దామెర క్రాస్ వరకు రోడ్లపై కుప్పలు కుప్పలుగా వడ్ల రాశులు పోశారు.
చివరకు ప్రయాణికుల కోసం ఏర్పాటు చేసిన బస్టాప్‍లను సైతం వదల్లేదు. దీంతో రింగు రోడ్డు ఎక్కడ సాఫీగా ఉందో, ఎక్కడ వడ్ల కుప్పలు, గేదెలు అడ్డుగా ఉన్నాయో తెలియని దుస్థితి నెలకొంది. గడిచిన కొన్ని రోజుల్లో దేవన్నపేట టోల్ గేట్ నుంచి దామెర జంక్షన్ వరకు దాదాపు 10 కిలోమీటర్ల దూరం ఉండే ఓఆర్‍ఆర్‍పై నిత్యం ఏదో ఒకచోట వాహనాలు పల్టీలు కొట్టిన ఘటనలు జరిగాయి.
గ్రేటర్ రింగు రోడ్డంతా కారు చీకట్లే
బీమారం నుంచి దామెర జంక్షన్ వరకు సాయంత్రం ఐదు దాటిందంటే కారు చీకట్లు కమ్ముకుంటున్నాయి. రోడ్డు మార్గంలో నాలుగైదు చోట్ల బస్టాప్‍లు కనిపించడానికి అటుఇటు నాలుగైదు స్తంభాలు తప్పితే.. మిగతా ప్రయాణమంతా చీకటిగానే ఉంటుంది. గ్రేటర్ సిటీ ప్రాంతంలో ఎక్కువ రద్దీగా ఉండే ఈ రోడ్డుపై కనీసం లైట్లు, డివైడర్లు కూడా ఏర్పాటు చేయలేదు. రింగు రోడ్డుకు పదుల సంఖ్యలో గ్రామాల కనెక్టివిటీ ఉండే చోట సింగిల్ సిగ్నల్ పాయింట్స్ కూడా సరిగ్గా వెలగడం లేదు. దీంతో వేగంగా వెళ్లే వాహనాలకు చీకట్లో జనం కనిపించక ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రమాదం జరిగినపుడు సహాయం చేయడానికి రింగురోడ్డు మెయింటెనెన్స్ చూసే సిబ్బంది కూడా కనిపించడం లేదు. కనీసం స్థానిక పోలీసులు కూడా గస్తీ నిర్వహించడం లేదు.
కల్వర్టులు కట్టలే, కటాక్షాపూర్ బ్రిడ్జి వెయ్యలే
గ్రేటర్ వరంగల్ ఏరియాలోని రింగు రోడ్డు జర్నీ ప్రయాణికులను ఓవైపు వణికిస్తుండగా.. దామెర జంక్షన్ దాటాక మొదలయ్యే నేషనల్ హైవేపైనా పలుచోట్ల ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. నేషనల్ హైవేలో భాగంగా ఈ రోడ్డును పెద్ద ఎత్తున వెడల్పు చేశారు. అయితే గతంలో ఇరుకుగా ఉన్న కల్వర్టులను ఇంకా వెడల్పు చేయలేదు. రోడ్డు విశాలంగా ఉందనే భావనతో వేగంగా వెళ్లే వాహన డ్రైవర్లు.. కల్వర్టుల వద్దకు వచ్చేసరికి కన్ ఫ్యూజ్ అవుతున్నారు.
వరంగల్ నుంచి మేడారం వెళ్లే దారిలో సిటీకి దగ్గర్లో ఉండే ఒగ్లాపూర్, ఊరుగొండ, జెర్రిపోతుల వాగు వద్ద కల్వర్టలు ప్రమాదకరంగా మారాయి. యాక్సిడెంట్ జోన్‍గా చెప్పుకునే జెర్రిపోతుల వాగు ప్రాంతంలో వంకర టింకరగా ఉండే రోడ్లను విస్తరించలేదు. కటాక్షాపూర్ బ్రిడ్జి నిర్మాణ పనులను గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలకులు పట్టించుకోలేదు. ప్రస్తుతం కటాక్షాపూర్ చెరువు వద్ద రోడ్డు ఇరుకుగా, గతుకులతో ఉండటంతో ట్రాఫిక్ సమస్యలు తప్పడం లేదు.
వడ్ల కుప్పలు డేంజర్‍గా ఉన్నయ్
రింగ్ రోడ్డుపై వడ్ల కుప్పలు మరీ డేంజర్‍గా ఉన్నాయి. హైదరాబాద్, మేడారం జాతర వైపు ఎటు పోదామన్నా అడుగుకో వడ్ల కుప్ప, బస్తాలు అడ్డుగా వస్తున్నయ్. సాయంత్రమైతే రోడ్డుపై ఉడ వడ్లు ఆరబోసిన విషయమే తెల్వడం లేదు. అప్పటికప్పుడు సడెన్ బ్రేక్ వేస్తే బండ్లు బోల్తా పడ్తున్నయ్. వడ్లు, గేదెల కారణంగా ఇటీవలే నాలుగైదు కార్లు పల్టీ కొట్టినయ్. -
బంక సతీశ్, కేయూసీ
సిటీ రింగు రోడ్డు వరకు లైట్లు పెట్టాలే
బీమారం నుంచి దామెర జంక్షన్ వరకు ఉండే రింగు రోడ్డు గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ పరిధిలో ఉంది. ఇరవై నాలుగు గంటలు ఫుల్లు ట్రాఫిక్ ఉంటుంది. ఇదే ఏరియాలో హైదరాబాద్, కరీంనగర్, సిద్దిపేట వైపు నుంచి వచ్చే వాహనాలు కలిసే పాయింట్ ఉంది. కాబట్టి కనీసం సిటీ పరిధి వరకైనా రింగురోడ్డు మొత్తం డివైడర్లు, పెద్ద లైట్లు పెట్టాలి. ఇలా చేస్తే సిటీ యాక్సిడెంట్లను నివారించవచ్చు.
కందికొండ యాదగిరి, హనుమకొండ