20 ఏండ్ల  ట్రాఫికర్ క్లియర్..పెగడపల్లి డబ్బాల సెంటర్​లో కొత్తగా ట్రాఫిక్‍ సిగ్నళ్లు

20 ఏండ్ల  ట్రాఫికర్ క్లియర్..పెగడపల్లి డబ్బాల సెంటర్​లో కొత్తగా ట్రాఫిక్‍ సిగ్నళ్లు
  • సమస్యపై పలుమార్లు కథనాలు రాసిన ‘వీ6 వెలుగు’
  • చొరవ చూపిన వరంగల్‍ సీపీలు రంగనాథ్‍, అంబర్‍ కిషోర్‍ ఝా   
  • రోజుల తరబడి శ్రమించి పరిష్కారం చూపిన ట్రాఫిక్‍ పోలీసులు 
  • 20 నిమిషాలు పట్టిన చోట..  20 సెకన్లలో ట్రాఫిక్‍ క్లియర్‍

గ్రేటర్ వరంగల్​లో పెగడపల్లి డబ్బాల సెంటర్ (హనుమాన్‍ నగర్‍) అంటే మొన్నటివరకు వాహనదారులకు చుక్కలే. ట్రైసిటీ అంతా తిరగడం వేరు... ఈ ఒక్క జంక్షన్‍ దాటడం వేరు అన్నట్టుగా ఉండేది పరిస్థితి. దాదాపు 20 ఏండ్లుగా ఉన్న ఈ సమస్యకు చెక్ పడింది. సెకన్ల వ్యవధిలోనే జనాలు ట్రాఫిక్‍ సమస్య లేకుండా జంక్షన్‍ దాటుతున్నారు. 

వరంగల్‍, వెలుగు: హనుమకొండ కేయూ జంక్షన్‍ నుంచి ములుగు రోడ్డు వెళ్లే దారిలో పెగడపల్లి డబ్బాల జంక్షన్‍ అంటే ఉమ్మడి జిల్లాలో దాదాపు తెలియని వాహనదారుడు ఉండరు. హనుమాన్‍నగర్‍ 1, 2,3 పేరుతోనే  దాదాపు ఈ ఏరియాలో 10 కాలనీలు ఉండగా.. కేయూ, పోచమ్మకుంట, కొత్తూర్‍జెండా, కుమార్‍పల్లి, రెడ్డికాలనీ, యాదవనగర్‍, ప్రేమ్‍నగర్‍ కాలనీ, బొక్కలగడ్డ.. ఇలా 50కి పైగా కాలనీల జనాలు ఈ జంక్షన్‍ మీదుగా నిత్యం ప్రయాణం చేస్తారు.

మరో 20 గ్రామాలు, విలీన గ్రామాలైన పెగడపల్లి, ముచ్చర్ల, నాగారం, సూదన్‍పల్లి, అంబాల, సీతానాగారం, గుండ్లసింగారం, ఇందిరమ్మకాలనీ, ఎస్సీ కాలనీ, ఎస్టీ కాలనీ, పలివేల్పులతో పాటు పదుల సంఖ్యలో కొత్త కాలనీలకు ఇదే మెయిన్ రోడ్డు కావడంతో ఇరవై నాలుగు గంటలు బిజీగా ఉంటుంది.

ఇన్నర్‍ రింగురోడ్డు రాకతో.. జనాలకు చుక్కలు

వ్యాపార సముదాయాలు, కూరగాయలు, చేపల వంటి చిరు వ్యాపారాలు, సిటీలో కూలీల అడ్డాకు ఫేమస్‍గా ఉండే ఈ జంక్షన్‍లో 20 ఏండ్లుగా ట్రాఫిక్‍ సమస్య ఉండటం ఒక ఎత్తైతే.. ఇన్నర్‍ రింగురోడ్డు రాకతో సమస్య ఒక్కసారిగా 10 రెట్లు పెరిగింది.  గ్రేటర్‍ సిటీ నుంచి హైదరాబాద్‍, కరీంనగర్‍, భూపాలపల్లి, ములుగు వైపు వెళ్లే వాహనాలన్నీ ఏడాదిన్నర నుంచి ఇదే జంక్షన్‍ మీదుగా వెళ్తున్నాయి.

గుండ్లసింగారం దాటాక వచ్చిన ఇన్నర్‍ రింగ్​రోడ్డుకు చేరుతున్నాయి. ఉదయం 7 గంటల నుంచి 10 వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల మధ్య ఈ జంక్షన్ నుంచి బయటకు రావాలంటే15 నుంచి 20 నిమిషాల పాటు ట్రాఫిక్‍లో ఇబ్బందులు పడాల్సిందే. ఈ సమస్యపై వీ6 వెలుగు పత్రిక గతేడాది పలుమార్లు కథనాలు ప్రచురించింది. దీంతో నాటి వరంగల్‍ పోలీస్‍ బాస్‍ రంగనాథ్‍ స్పందించారు. ట్రాఫిక్‍ ఎస్సైతో పాటు మరో 10 మందితో కూడిన సిబ్బందికి ఇక్కడ డ్యూటీలు వేశారు. రోడ్డుకు అడ్డుగా ఉన్న నిర్మాణాలను తొలగించారు. ఈ జంక్షన్‍లో ట్రాఫిక్‍ సిగ్నళ్లు పెట్టాలని ఆదేశించారు. 

20 రోజులుగా శ్రమిస్తున్రు.. 20 సెకన్లలో రైట్‍ రైట్‍ 

పెగడపల్లి డబ్బాలు జంక్షన్‍లో ట్రాఫిక్‍ సమస్యను స్వయంగా పరిశీలించిన అప్పటి సీపీ రంగనాథ్‍.. అలాంటి మరో 10 జంక్షన్లపై ఫోకస్‍ పెట్టాలని సూచించారు. ఆయన బదిలీ తర్వాత వచ్చిన సీపీ అంబర్‍ కిషోర్‍ ఝా సైతం ఈ సమస్యపై స్పెషల్‍ ఫోకస్‍ పెట్టారు. మొత్తంగా జంక్షన్​లో కొత్తగా ట్రాఫిక్‍ సిగ్నళ్లు పెట్టడం ఖాయం అయింది. 20 రోజుల కిందట హనుమకొండ ట్రాఫిక్‍ సీఐ సీతారెడ్డి ఆధ్వర్యంలో సిగ్నళ్ల ఏర్పాటు పనులు మొదలు పెట్టారు.

అడ్డుగా ఉన్న నిర్మాణాలు తొలగించారు. జంక్షన్​లో ఏండ్ల తరబడి నోరు తెరిచున్న కల్వర్టుపై స్లాబ్‍ వేయించారు. అన్నివైపులా 100 మీటర్ల వరకు సిమెంట్‍ దిమ్మెలు ఏర్పాటు చేసి సిగ్నళ్లు ఏర్పాటు చేశారు. సీఐతో పాటు మరో ఇద్దరు ఎస్సైలు, సిబ్బంది ఐదు రోజులుగా వీటి పనితీరును పరిశీలిస్తున్నారు. మరిన్ని మార్పుచేర్పులు చేస్తున్నారు. దీంతో గతంలో 20 నిమిషాలు పట్టిన చోట 20 సెకన్లలో ట్రాఫిక్‍ క్లియర్‍ అవుతున్నది. 

ట్రాఫిక్‍ పోలీసులకు థాంక్స్​

పెగడపల్లి డబ్బాల జంక్షన్‍ అంటేనే ట్రాఫిక్ పరంగా ఏండ్ల తరబడి పెద్ద సమస్యగా ఉండేది. ఎన్నోసార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినం. అయితే ఈ సమస్యను ఎలా అదిగమిస్తారో అనే టెన్షన్‍ ఉండేది. మొత్తంగా గడిచిన కొన్ని రోజులుగా ట్రాఫిక్‍ అధికారులు సిగ్నళ్లు ఏర్పాటు చేసి సమస్యకు పరిష్కారం చూపడం అభినందనీయం.. - ఠాకూర్‍ సతీశ్, హనుమాన్‍నగర్‍ 

కష్టపడ్డాం.. పరిష్కారం చూపినం

ఈ జంక్షన్‍లో ట్రాఫిక్‍ క్లియరెన్స్ అంటేనే సవాల్‍గా ఫీలయ్యేవాళ్లం. ఉన్నతాధికారుల ఆదేశాలతో కొత్తగా ట్రాఫిక్‍ సిగ్నళ్లు పెట్టాం. 20 రోజులుగా ఓవైపు పనులు చేస్తూనే మరోవైపు జనాలకు అవగాహన కల్పిస్తున్నాం. దాదాపు 90 శాతం సమస్యను పరిష్కరించాం. ఆఫీసర్ల చొరవ, జనాల సపోర్టుతోనే సక్సెస్‍ అయినం.- సీతారెడ్డి, ట్రాఫిక్‍ సీఐ, హనుమకొండ