పూడికతీత.. నిధుల మేత!

  • గ్రేటర్​లో రూ.84 లక్షలతో డీసిల్టేషన్​ వర్క్స్​
  • క్షేత్రస్థాయిలో పూర్తి కాని పనులు
  • వంద శాతం కంప్లీట్​చేశామంటున్న కాంట్రాక్టర్లు
  • తమ డివిజన్లలో అడుగే పెట్టలేదంటున్న కార్పొరేటర్లు
  • నాలాల్లో  చెత్త పేరుకుపోయి వరద ప్రవాహానికి ఇబ్బందులు

హనుమకొండ, వెలుగు: వరంగల్ సిటీలో చిన్నపాటి వానకే నాలాలు, డ్రైన్లు ఏరులై పారుతున్నాయి. పూడిక, చెత్తాచెదారంతో వరద నీటి ప్రవాహానికి అడ్డంకులు ఏర్పడి, రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. ఆఫీసర్లు చెత్తాచెదారం తొలగింపు కోసం డీసిల్టేషన్ చేపట్టినా పనులు పూర్తి కాకుండానే బిల్లులు ఎత్తేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. వంద శాతం పూడిక తీశామని కాంట్రాక్టర్లు, ఆఫీసర్లు చెబుతుండగా.. అసలు తమ డివిజన్లలో అడుగే పెట్టలేదని కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు. క్షేత్రస్థాయిలో పర్యవేక్షించాల్సిన ఆఫీసర్లు లైట్​తీసుకోవడం, పనులు చేయాల్సిన కాంట్రాక్టర్లు నామమాత్రపు చర్యలతో చేతులు దులిపేసుకోవడంతో కాల్వల్లో పూడిక అలాగే ఉంది. ఇదిలా ఉంటే బల్దియా ఆధ్వర్యంలోనే సొంతంగా డీసిల్టేషన్​కు వెహికల్స్ ఉన్నా.. పనులు మాత్రం కాంట్రాక్టర్లకు అప్పగించడం పట్ల విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.

రూ.84 లక్షలతో వర్క్స్..

2020లో కురిసిన వానల వల్ల సిటీలో నాలాలు పొంగిపొర్లాయి. అప్పటి నుంచి ఏటా ఆఫీసర్లు డీసిల్టేషన్ చేయిస్తున్నారు. ఒక మీటర్​కంటే తక్కువ వెడల్పు ఉన్న 318 కాల్వలను మున్సిపల్ పబ్లిక్ హెల్త్​ డిపార్ట్​ మెంట్ ఆధ్వర్యంలో క్లీన్​ చేస్తుండగా.. మీటర్ కంటే ఎక్కువ వెడల్పు ఉండి, జేసీబీలు, హిటాచీలు అవసరమయ్యే 29 నాలాలను శుభ్రం చేసే పనులను ఇంజినీరింగ్ డిపార్ట్​మెంట్​ కు అప్పగించారు. అయితే జీడబ్ల్యూఎంసీ పబ్లిక్​ హెల్త్​ డిపార్ట్​మెంట్​పరిధిలో 12 జేసీబీలు, 3 హిటాచీలు, 2 డోజర్లు ఉన్నా.. పూడిక తీత పనులు కాంట్రాక్టర్లకు అప్పగించారు. ఈ ఏడాది డీసిల్టేషన్​కోసం రూ.84 లక్షలు కేటాయించారు.

చేయకుండానే చేసినట్టు..

డీసిల్టేషన్​లో భాగంగా కాంట్రాక్టర్లు నాలాల్లో గుర్రపు డెక్క, మట్టి, ఇతర చెత్తాచెదారం తొలగించి, వరద ప్రవాహానికి ఆటంకాలు కలగకుండా చూడాల్సి ఉంది. కానీ చాలా డివిజన్లలో నామమాత్రంగా గుర్రపుడెక్క తొలగించి కాంట్రాక్టర్లు చేతులు దులుపుకున్నారు. దీంతో నిధులు దుర్వినియోగం అయ్యాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇంకొన్ని డివిజన్లలో కనీసం జేసీబీలు తిప్పకుండానే పూడిక తీత కంప్లీట్​చేసినట్లు రిపోర్టులు తయారు చేశారని స్థానిక కార్పొరేటర్లే ఆరోపిస్తున్నారు. నాలాలు, డ్రైన్లలో పూడిక పేరుకుపోయి కనిపిస్తుండగా.. గ్రేటర్​ ఇంజినీరింగ్ ఆఫీసర్లు కూడా  వంద శాతం డీ సిల్టేషన్​ పూర్తి చేశామని చెబుతుండటం గమనార్హం. 

ఉలుకరు.. పలుకరు..

డీ సిల్టేషన్​ చేయకపోవడంతో చాలా ఏరియాల్లో కాలనీలు ముంపునకు గురవుతున్నాయి. ఈ సమస్య హనుమకొండ పోచమ్మకుంట, సమ్మయ్యనగర్​, అశోక కాలనీ, గోకుల్​ నగర్​, తిరుమలబార్​ జంక్షన్​, వరంగల్ కాశీబుగ్గ, శివనగర్​, ఎస్సార్​ నగర్​, గాంధీ నగర్​, ఎంజీఎం, రామన్నపేట తదితర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తోంది. ఇదే సమస్యను ఈ నెల 18న జరిగిన పట్టణ ప్రగతి మీటింగ్ లోనూ అశోక కాలనీ, అంబేడ్కర్​ భవన్​ రోడ్డు, గోకుల్  రోడ్ పరిస్థితి గురించి మేయర్​, కమిషనర్​ దృష్టికి అక్కడి కార్పొరేటర్​ తీసుకెళ్లారు. చాలా ఏరియాల్లో డీసిల్టేషన్​ చేయకుండా వంద శాతం పని కంప్లీట్​ చేశామని చెబుతుండటంపై ఫిర్యాదు చేశారు. అయినా పెద్దాఫీసర్ల నుంచి స్పందన కరువైంది. 

కమిషనర్​కు చెప్పినా లాభం లేకపాయే..

మా డివిజన్ లో ఇంతవరకు డీసిల్టేషన్ చేయలేదు. కొన్నిచోట్ల నామమాత్రంగానే చేశారు. ముంపు సమస్య తలెత్తే తిరుమల జంక్షన్, అశోక కాలనీ ఏరియాలను వదిలేశారు. దీనివల్ల నిధులు పక్కదారి పట్టాయనే అనుమానాలు కలుగుతున్నాయి. ఇదే విషయాన్ని కమిషనర్ దృష్టికి కూడా తీసుకెళ్లిన. ఫీల్డ్ విజిట్ చేస్తే అసలు నిజాలు తెలుస్తాయని కూడా చెప్పిన. గ్రీవెన్స్ లో కూడా అప్లికేషన్ ఇచ్చిన. అయినా ఎవరూ పట్టించుకుంటలేరు.

- నల్లా స్వరూపారాణి, 
57వ డివిజన్​ కార్పొరేటర్

ఏటా ఇట్లనే చేస్తున్నరు..

డీసిల్టేషన్ కోసం ఏటా లక్షల నిధులు కేటాయిస్తున్నారు. కానీ అందులో పావువంతు పని కూడా చేయడం లేదు. మీద మీద చెత్త తొలగించి నిధులు మింగేస్తున్నారు. నాలాలు, డ్రైన్లలో పూడిక పేరుకుపోవడం వల్ల వరద నీరు పోవడం లేదు. దీంతో కాల్వలు ఉప్పొంగి వరద నీరు కాలనీలను ముంచెత్తుతోంది. ఆఫీసర్లు కూడా ఎక్కడా ఫిల్డ్ విజిట్ చేయడం లేదు. ఇకనైనా ఆఫీసర్లు కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకొని వరదలను నివారించాలి.

- కల్లూరి పవన్, 
సోషల్ యాక్టివిస్ట్, నయీమ్ నగర్