హనుమకొండ, వెలుగు: ‘హైదరాబాద్ తరువాత వరంగలే పెద్ద నగరం. కానీ ఇక్కడ పరిస్థితులు బాగా లేవు. ఇక్కడి వ్యవస్థను ప్రత్యక్షంగా చూద్దామని ఇదివరకు ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఇక్కడ రోడ్లన్నీ తిరిగిన. లక్ష్మీపురం, శాకరాసికుంట, గిరిప్రసాద్ నగర్, ప్రగతినగర్, దీనదయాళ్నగర్, అంబేద్కర్‌నగర్, జితేంద్రసింగ్నగర్, ఎస్సార్‌నగర్, గరీబ్‌నగర్, గాంధీ నగర్ చూసిన. ఈ తొమ్మిది కాలనీలకు రూ.400 కోట్లతోటి 3,957 ఇండ్లు మంజూరు చేసినం. రాబోయే రెండు, మూడేండ్లలో ఇండ్లు, పట్టాలు లేని పేదలెవరూ ఉండొద్దు. ఇంకా 60, 70 బస్తీలు ఉన్నయ్.. వాటి దరిద్రం కూడా పోవాలె.’
2015 జనవరిలో వరంగల్ నగరంలో మూడు రోజుల పర్యటన సందర్భంగా సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి.
గుడిసెల్లో ఉంటున్నవారికి డబుల్ బెడ్ రూం ఇండ్లు కట్టిస్తమంటే నమ్మిన్రు. స్వయంగా సీఎం కేసీఆర్బహిరంగ సభలో హామీ ఇచ్చేసరికి సంబురపడ్డరు. ఆ వెంటనే గుడిసెలు ఖాళీ చేయండని లీడర్లు, ఆఫీసర్లు ఆర్డర్ వేస్తే.. పిల్లాపాపలతో బయటికొచ్చి ఇంకో చోట గుడిసెలు వేసుకున్నరు. ఇండ్లు పూర్తయిన మూడేండ్లకు మంత్రి కేటీఆర్అలాట్మెంట్ పేపర్లు ఇవ్వగానే సంబురాలు చేసుకున్నరు. కానీ ఏండ్లు గడుస్తున్నా ఇండ్లు అప్పగించకపోవడంతో ఇంకా గుడిసెల్లోనే బతుకీడుస్తున్నారు. గుడిసెలు వేసుకున్నది ప్రైవేటు స్థలం కావడం.. అక్కడ ఎలాంటి ఫెసిలిటీస్ లేకపోవడంతో ఎండకు, వానకు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిత్యం పాములు, తేళ్లతో అవస్థలు పడుతున్నామని వాపోతున్నారు.
250 కుటుంబాలను ఖాళీ చేయించిన్రు
హైదరాబాద్తరువాత అంతటి ప్రాధాన్యం ఉన్న నగరం కావడంతో ఎంతోమంది నిరుపేదలు ఉపాధి కోసం వరంగల్ సిటీకి వస్తుంటారు. ఇలా కొన్నేండ్ల కిందట బతుకుదెరువు కోసం వచ్చిన చాలామంది స్లమ్ఏరియాల్లో గుడిసెలు వేసుకుని ఉంటున్నారు. సొంత ఇల్లు కట్టుకునే స్థోమత లేకపోవడంతో పరదాలతో గుడారాలు వేసుకుని బతుకుతున్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత సీఎం హోదాలో మొదటిసారి వరంగల్ నగరానికి వచ్చిన కేసీఆర్ మూడు రోజుల పాటు బస్తీల్లో తిరిగి పేదలందరికీ ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికప్పుడు 3,957 ఇండ్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం బాలసముద్రంలోని అంబేద్కర్‌నగర్, జితేంద్రసింగ్ నగర్‌కాలనీలో ఉంటున్న దాదాపు 250 కుటుంబాలను ఇండ్లు కట్టిస్తామని హామీ ఇచ్చి గుడిసెలు ఖాళీ చేయించారు. అనంతరం అంబేద్కర్నగర్వద్ద 13 బ్లాకుల్లో 594 డబుల్‌బెడ్ రూం ఇండ్ల పనులు స్టార్ట్ చేశారు. తమకు ఇండ్లు వస్తాయనే ఆశతో ఈ రెండు కాలనీల వాసులు ఆ పక్కనే ఓ ప్రైవేటు స్థలంలో గుడిసెలు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఇండ్ల పనులు కంప్లీట్అయి మూడేండ్లు దాటినా వాటిని లబ్ధిదారులకు కేటాయించకపోవడంతో గుడిసెవాసులకు ఏండ్ల తరబడి ఎదురుచూపులే మిగులుతున్నాయి. ప్రస్తుతం ఉంటున్నచోట తాగునీరు, బాత్రూం, కరెంట్ సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు. వర్షాకాలం కావడంతో పాములు, తేళ్లు తిరుగుతున్నాయని కొద్దిరోజులుగా అక్కడి స్తంభం నుంచి కరెంట్ వాడుకుంటున్నారు. రెండ్రోజుల కింద ఆఫీసర్లు వచ్చి ఆ వైర్లన్నీ కోసుకుని వెళ్లిపోయారు. అప్పటినుంచి రాత్రయితే చీకట్లో మగ్గుతున్నారు. ఇక వానలు పడినప్పుడల్లా గుడిసెలన్నీ మడుగుల్లా తయారవుతున్నాయని, పాములు, తేళ్లు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వాయిదాల మీద వాయిదాలు
గ్రేటర్ వరంగల్ పరిధిలోకి వచ్చే ఈస్ట్, వెస్ట్, వర్ధన్నపేట, పరకాల నియోజకవర్గాలకు విడతలవారీగా దాదాపు ఐదు వేల ఇండ్లు శాంక్షన్ చేశారు. వీటిలో ఏనుమాముల ఎస్సార్‌నగర్‌లో నిర్మించిన 208 ఇండ్లు కంప్లీట్ కాగా.. వాటిని అక్కడి లబ్ధిదారులకు పంపిణీ చేశారు. ఈస్ట్ నియోజకవర్గంలోని దూపకుంటలో దాదాపు 300 ఇండ్లు, వెస్ట్‌లో అంబేద్కర్ నగర్, జితేంద్రసింగ్నగర్ వాసుల కోసం కట్టిన 594 ఇండ్లు పూర్తయినా వాటిని మాత్రం ఎవరికీ కేటాయించడం లేదు. నిర్మాణ పనులు పూర్తయి మూడేండ్లు దాటినా వాటిని లబ్ధిదారులకు పంచకపోవడంతో గోడలన్నీ బీటలు వారుతున్నాయి. దీంతో ఎన్నోసార్లు ఆందోళనలకు దిగారు. ఎండకు, వానకు అవస్థలు పడుతున్నామంటూ ఆవేదన వెలిబుచ్చారు. స్థానిక కార్పొరేటర్‌తో పాటు ప్రభుత్వ చీఫ్ విప్, ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు వినతిపత్రాలు కూడా అందించారు. ఇండ్లు పంపిణీ చేస్తామని హామీ ఇచ్చిన లీడర్లు ఆ తరువాత లైట్ తీసుకున్నారు. ఇప్పటికీ ఇండ్లు పంపిణీ చేయక ఆగస్టు 15, దసరా, దీపావళి అంటూ కాలం వెళ్లదీస్తూ వస్తున్నారు.
మంత్రి చేతులమీదుగా కాగితాలు..
మంత్రి కేటీఆర్ హనుమకొండ, వరంగల్, నర్సంపేటలో వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసేందుకు ఈ ఏడాది ఏప్రిల్20న ఓరుగల్లు నగరానికి వచ్చారు. ఎప్పటినుంచో అంబేద్కర్‌నగర్, జితేంద్రసింగ్ నగర్‌వాసులు ఆందోళనలు చేస్తుండటంతో వారికి ఇండ్లు కేటాయించేందుకు లీడర్లు ఒక అడుగు ముందుకు వేశారు. హనుమకొండ కలెక్టరేట్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆరుగురు లబ్ధిదారులకు మంత్రి కేటీఆర్ చేతులమీదుగా అలాట్మెంట్ పేపర్లు అందజేశారు. ఆ వెంటనే మిగతా లబ్ధిదారులకు అలాట్మెంట్ పేపర్స్ ఇస్తామన్నారు. 15 రోజుల్లోగా అందరూ గృహప్రవేశం చేసుకోవచ్చని మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు చెప్పారు. ఇది జరిగిన రెండు నెలలు పూర్తయినా ఇండ్లు మాత్రం ఇవ్వడం లేదు.
పేపర్లు ఇచ్చి పంపించిన్రు
డబుల్బెడ్రూం ఇండ్లు ఇస్తామని చెబితే అందరం గుడిసెలన్నీ ఖాళీ చేసినం. అప్పటినుంచి ఇండ్ల కోసం ఎదురుచూస్తూ ఇంకోచోట గుడిసెలు వేసుకుని బతుకుతున్నం. రెండు నెలల కిందట మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా అలాట్ మెంట్ పేపర్లు ఇచ్చిన్రు. మే 6న ఇండ్లలోకి వెళ్లండని మంత్రి కూడా చెప్పిండు. కానీ ఇంతవరకు ఇండ్లు పంపిణీ చేస్తలేరు. లీడర్లు, ఆఫీసర్లను అడిగితే వాయిదాల మీద వాయిదాలు పెడుతున్నరు.
- తేజావత్ బాలు, అంబేద్కర్‌నగర్