వరంగల్ సిటీలో స్పాంజ్‍ పార్కులు .. రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మాణానికి GHMC ఆఫీసర్లు రెడీ

వరంగల్ సిటీలో స్పాంజ్‍ పార్కులు .. రాష్ట్రంలోనే తొలిసారిగా నిర్మాణానికి GHMC ఆఫీసర్లు రెడీ
  • వానాకాలంలో వరదల నియంత్రణకు చర్యలు 
  • వరద పీల్చేలా పార్కులు, తోటలు, వెట్‍ల్యాండ్‍ పార్క్ ల నిర్మాణాలు    
  • ఇప్పటికే ముంబై, చెన్నై సిటీల్లో ప్రయోగాత్మకంగా ప్రాజెక్ట్ అమలు  
  • వరంగల్‍ లోనూ స్మార్ట్ సిటీ–2 ప్రాజెక్టులో చేపట్టాలని నిర్ణయం

వరంగల్‍, వెలుగు:  గ్రేటర్ వరంగల్​ను ముంచెత్తే వరదలను నియంత్రించి, నష్టాలను తగ్గించేందుకు బల్దియా అధికారులు రెడీ అవుతున్నారు. ఇప్పటికే ముంబై, చెన్నైలో ప్రయోగత్మాకంగా నిర్మించిన స్పాంజ్‍ పార్కులను వరంగల్ లోనూ ఏర్పాటు చేసేందుకు ప్లాన్‍ చేస్తున్నారు. అకాల వర్షాలతో   ఉధృతంగా వరద నీరు ప్రవహించినప్పుడు  వాటిని  స్పాంజ్ పార్కులు పీల్చుకుంటాయి.  ‘సస్టైనబుల్‍ అర్బన్‍ డెవలప్‍మెంట్‍ స్మార్ట్ సిటీ –- 2 ప్రాజెక్ట్ లో భాగంగా బుధ, గురువారాల్లో  చెన్నైలో రెండ్రోజుల పాటు ‘స్పాంజ్‍ పార్క్ ఫ్రేమ్‍ వర్క్ ఫర్‍ రెసిడెంట్ ఓపెన్‍ స్పేసెస్ ’  ప్రోగ్రామ్ నిర్వహించారు. దేశ, విదేశాల ప్రతినిధులు, అధికారులతో పాటు వరంగల్‍ బల్దియా కమిషనర్‍ అశ్విని తానాజీ వాఖడే కూడా పాల్గొన్నారు. సిటీల్లో స్పాంజ్‍ పార్కుల ఏర్పాటుకు అవసరమైన ప్లానింగ్‍, డిజైన్‍, సక్సెస్‍ ఫైల్‍ ఇంప్లిమెంటేషన్‍పై ట్రైనింగ్‍ ఇచ్చారు.  

 గ్రీనరీ తోటలు.. చిన్న చెరువులు 

 ఇంట్లో క్లీనింగ్ సమయాల్లో వృథా నీటిని స్పాంజ్‍లతో ఎలా పీల్చేలా చేస్తారో.. స్పాంజ్‍ పార్కులు కూడా అలాంటివే. ఈ పార్కుల్లో ప్రధానంగా చెట్ల పెంపకం, గ్రీనరీ, చిన్నపాటి చెరువులు ఉంటాయి.  వానాకాలంలో వరదనీటిని ఎక్కడికక్కడ ఆపేందుకు పచ్చదనం పెంచడం.. నీటిని ఒడిసిపట్టి భూగర్భ జలాలను పెంచేలా డ్రైయిన్‍లు, రీచార్జ్ బావులు, నీటి నిల్వకు చెరువులను నిర్మిస్తారు. సిటీలో ఖాళీ ప్రదేశాలను ఎంపిక చేసి పచ్చని తోటలు, గార్డెన్స్ ఏర్పాటు చేస్తారు. వీటికి సమీపంలోని లోతట్టు ప్రాంతాల్లో చిన్నపాటి చెరువులను నిర్మిస్తారు. వరద నీటిని చెట్లు, పార్కుల వైపు మళ్లించడం ద్వారా పీల్చుకునేలా చేస్తారు. అంతేకా కుండా భూగర్భ జలాలు పెంపునకు చెరువులుసరస్సులు తవ్వించి స్పాంజ్‍ పార్క్  ప్రదేశాల్లో పైపులను లోపల వరకు వేసి నీటిని పంపుతారు. దీంతో వృథాగా పోయే వరదనీరు ఎక్కడికక్కడ పీల్చుకోవడానికి తోడు ఏడాదంతా పార్కుల అభివృద్ధికి పనికొచ్చేలా చేస్తారు. 

వరల్డ్ లో టాప్‍ 7 స్పాంజ్‍ పార్క్ సిటీస్‍ 

విదేశాల్లో స్పాంజ్‍ పార్క్ సిటీలకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. న్యూజిలాండ్‍లోని ఆక్లాండ్‍ సిటీ స్పాంజ్‍ సిటీ అమలు రేటింగ్‍లో టాప్‍ ప్లేస్‍లో ఉంది. తుపాన్ల కారణంగా భారీగా వచ్చే వరదను సక్రమంగా వాడుకునేలా గ్రీన్‍ పార్కులు, గోల్ఫ్ కోర్సులు, పచ్చని తోటలు ఏర్పాటు చేసి సక్సెస్‍ అయింది. ఆ తర్వాత నైరోబీ, న్యూయార్క్, ముంబై, సింగపూర్‍, షాంగై, లండన్‍ సిటీలో ఉన్నాయి. 
 
వరంగల్‍ సిటీలో స్మార్ట్ సిటీ–2 ప్రాజెక్టు 

స్మార్ట్ సిటీ--–2 ప్రాజెక్టులో వరంగల్‍ సిటీలో త్వరలోనే స్పాంజ్‍ పార్కుల నిర్మాణానికి చర్యలు తీసుకోనున్నట్లు బల్దియా కమిషనర్‍ అశ్విని తానాజీ వాఖడే పేర్కొన్నారు.  హైదరాబాద్‍ తర్వాత పెద్ద సిటీ గ్రేటర్‍ వరంగల్‍ లో గల్లీ గల్లీలో కాంక్రీట్‍ రోడ్ల కారణంగా ఏటా వరదల సమస్య ఉత్పన్నమవుతుండగా.. స్పాంజ్‍ పార్కుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్లు  కమిషనర్‍ తెలిపారు. 

 చెన్నైలో 57 స్పాంజ్‍ పార్కులు 

చైనా, న్యూజిలాండ్ దేశాల్లో ఇప్పటికే స్పాంజ్‍ పార్కులు సక్సెస్‍ అయ్యాయి. మనదేశంలోనూ వరద ముంపునకు గురయ్యే గ్రేటర్‍ చెన్నై కార్పొరేషన్‍ కూడా పోరూర్‍, హోసూర్‍, తొండియార్‍పేటలో ఏరియాల్లో ప్రయోగత్మకంగా ఇలాంటి పార్కులను నిర్మిస్తోంది. తొలిసారిగా 57 కొత్త స్పాంజ్‍ పార్కుల నిర్మాణాలకు చైన్నై కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. వీటి నిర్మాణానికి రూ.6 .76 కోట్లు కేటాయించింది. ఇప్పటికే  ఉన్నవి కాకుండా అదనంగా మరో 2 .50 లక్షల చెట్లను నాటాలని టార్గెట్‍ పెట్టుకుంది. మరిన్ని కొత్త స్పాంజ్‍ పార్కులను నిర్మించాలని ముందుకెళ్తుంది. తద్వారా సిటీలో పచ్చదనాన్ని మరో 33శాతం   పెంచాలని అధికారులు భావిస్తున్నారు.