
- వరంగల్ పోలీసు కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వెల్లడి
వరంగల్ సిటీ, వెలుగు : నకిలీ పురుగు మందులను అమ్ముతున్న ముఠాను బుధవారం వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద సుమారు రూ. 34 లక్షల విలువైన వివిధ కంపెనీలకు చెందిన నకిలీ పురుగు మందులతో పాటు రెండు కార్లు, ఐదు సెల్ ఫోన్లు, ఫేక్ లేబుల్స్ స్వాధీనం చేసుకున్నారు. వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా బుధవారం మీడియాకు వివరాలు తెలిపారు. రెండు రోజుల కింద టాస్క్ ఫోర్స్ , మట్టెవాడ పోలీసులు కలిసి వరంగల్ గోపాలస్వామి గుడి ఏరియాలో వాహన తనిఖీలు చేస్తున్నారు. అనుమానస్పదంగా వచ్చిన కారును ఆపి తనిఖీ చేశారు.
అందులో పురుగు మందుల డబ్బాలను గుర్తించారు. కారులోని కర్నాటకకు కాట్రగౌడ భాస్కర్ రెడ్డిని అదుపులోకి తీసుకొని విచారించారు. నకిలీ పురుగు మందులను అమ్ముతున్నట్టు తెలిపాడు. కేసు నమోదు చేసి పట్టుబడిన నిందితుడు ఇచ్చిన సమాచారం ఆధారంగా హైదరాబాద్ చర్లపల్లి ఏరియాలో గోడౌన్ దాడి చేశారు. మిగిలిన నలుగురు నిందితులైన కుషాయిగూడకు చెందిన పిల్ల నాగవెంకట రంగారావు, లక్డీకాపూల్ కు చెందిన ముద్దంగుల ఆదిత్య , పిట్ల నవీన్, మిర్యాలగూడకు చెందిన దూదిమెట్ల శ్రీధర్ ను అదుపులోకి తీసుకున్నారు.
నిందితులను అరెస్ట్ చేయడంలో చాకచక్యంగా వ్యవహరించిన సెంట్రల్ జోన్ డీసీసీ షేక్ సలీమా, టాస్క్ ఫోర్స్ వరంగల్ ఏసీపీ మధుసూదన్, నందిరాం నాయక్, మట్టెవాడ ఇన్ స్పెక్టర్లు సార్ల రాజు, గోపి, ఎస్ఐలు భానుప్రకాశ్, లచ్చయ్య, సాంబయ్య, ఏఏఓ సల్మాన్ పాషా, కానిస్టేబుళ్లను పోలీస్ కమిషనర్ అభినందించారు.