వరంగల్, వెలుగు : మావోయిస్ట్ కమిటీల్లో ప్రస్తుతం ముసలోళ్లే మిగిలారని వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవీ.రంగనాథ్ చెప్పారు. మావోయిస్ట్ పార్టీ దండకారణ్య స్పెషల్ జోనల్ మెంబర్ మూల దేవేందర్‌రెడ్డి అలియాస్ మాసా దాదా, మరో సానుభూతిపరుడు గుర్రం తిరుపతిరెడ్డి అరెస్ట్ వివరాలను శుక్రవారం కమిషనరేట్‌లో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో వెల్లడించారు. కరోనా టైంలో చాలా మంది మావోయిస్టులు చనిపోయారని, మిగతా వారు అనారోగ్యంతో బాధపడుతున్నారన్నారు. చత్తీస్‌గఢ్‌లో తప్పితే తెలంగాణ, ఏపీలో రిక్రూట్‌మెంట్ జరగడం లేదన్నారు.
మావోయిస్టుల పేరుతో వాట్సాప్, సోషల్ మీడియాలో వస్తున్న లెటర్లు, ప్రకటనలపై దృష్టి పెట్టామని, అవి అసలువో.. కాదో తేలుస్తామన్నారు. దేవేందర్‌రెడ్డి ఎటువంటి ఆయుధాలైన రిపేర్ చేయడంలో ఎక్స్‌పర్ట్ అని చెప్పారు. అతడిపై 33 కేసులు, రూ.20 లక్షల రివార్డ్ ఉందన్నారు. వీరిద్దరూ ట్రీట్‌మెంట్ కోసం హైదరాబాద్ వెళ్తుండగా సుబేదారి పోలీసులకు చిక్కినట్లు తెలిపారు.