- మెడికో ప్రీతిది ఆత్మహత్యే
- పోస్టుమార్టం రిపోర్ట్‌లో ‘డెత్ డ్యూ టు పాయిజన్’ అని తేలింది : వరంగల్ సీపీ రంగనాథ్
- సక్సీనైల్ కోలిన్ ఇంజక్షన్ తీసుకోవడం వల్లే మృతి
- ప్రీతి చావుకు ప్రధాన కారణం డాక్టర్ సైఫ్
- వారం రోజుల్లో చార్జిషీట్ వేస్తామని సీపీ వెల్లడి
వరంగల్, వెలుగు : కాకతీయ మెడికల్ కాలేజీ పీజీ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ ధరావత్ ప్రీతి ఆత్మహత్య చేసుకునే చనిపోయినట్లు వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్ చెప్పారు. మెడికో ప్రీతి మృతి కేసుపై శుక్రవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రీతి మరణానికి సంబంధించిన పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చిందని, అందులో ‘డెత్ డ్యూ టు పాయిజన్’ అని తేల్చినట్లు వెల్లడించారు. పోలీసుల విచారణలోనూ దాదాపు అదే విషయం తేలిందన్నారు.
ఫిబ్రవరి 22న ఎంజీఎంలో ప్రీతి అపస్మారక స్థితిలో పడి ఉన్నచోట సిరంజీ దొరికిన విషయాన్ని తాము అప్పుడే చెప్పామన్నారు. కానీ అక్కడ నీడిల్ దొరకకపోవడం వల్లే కన్‍ఫ్యూజన్ ఏర్పడిందన్నారు. దగ్గర్లోని డస్ట్ బిన్ లో చాలా నీడిల్స్ ఉండటంతో ప్రీతి ఇంజక్షన్ తీసుకునేందుకు వాడిన నీడిల్ ను సేకరించలేకపోయామని సీపీ చెప్పారు. దాదాపుగా అప్పుడే ప్రీతిది ఆత్మహత్యేనని 99 శాతం నిర్ధారణకు వచ్చామన్నారు. ఆమె సక్సీనైల్ కోలిన్ అనే ఇంజక్షన్ తీసుకున్నట్లు భావిస్తున్నామని చెప్పారు. అయినా, ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ స్టూడెంట్ డాక్టర్ సైఫ్ ప్రధాన కారణమన్నారు. అతని ర్యాగింగ్ వల్లే మానసిక ఒత్తిడికి గురై ఆమె ఆత్మహత్య చేసుకుందన్నారు.
రెండు నెలల్లో అనేక మలుపులు
మెడికో ప్రీతి ఫిబ్రవరి 22న వరంగల్‍ఎంజీఎం హాస్పిటల్లో డ్యూటీలో ఉన్న సమయంలో సూసైడ్ చేసుకున్నట్లు వరంగల్ మట్వాడా పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆపై మెరుగైన ట్రీట్‍మెంట్ కోసం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. ప్రీతి ఆత్మహత్యకు సీనియర్ స్టూడెంట్ డాక్టర్ సైఫ్ బాధ్యుడని 24వ తేదీన వరంగల్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్ తెలిపారు. అతనిపై ర్యాగింగ్, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. తమ వద్ద అన్ని ఆధారాలు ఉన్నట్లు చెప్పారు. పోలీసులు అదేరోజు సైఫ్‍ను అరెస్ట్ చేసి ఖమ్మం జైలుకు తరలించారు. ఆ తర్వాత రెండ్రోజులకు ఫిబ్రవరి 26న ప్రీతి నిమ్స్ లో ట్రీట్‍మెంట్ పొందుతూ మరణించింది. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి.
ప్రీతి ఆత్మహత్య చేసుకుందని చెప్పిన పోలీసులు.. టాక్సీకాలజీ రిపోర్ట్ వస్తే అన్నీ తెలుస్తాయన్నారు. తీరాచూస్తే మార్చి 5న వచ్చిన ఆ రిపోర్టులో ప్రీతి రక్తం, అవయవాల్లో ఎలాంటి విష పదార్థాలు లేవని తేలింది. దీంతో టాక్సికాలజీ రిపోర్ట్ ఒక్కటే ఫైనల్ కాదని.. ఫొరెన్సిక్ రిపోర్ట్ వస్తే పూర్తి నిజాలు తెలుస్తాతాయని సీపీ రంగనాథ్ చెప్పారు. నెల తర్వాత వచ్చిన ఫోరెన్సిక్ రిపోర్టు సైతం ప్రీతి చావుకు కారణం ఏంటో తేల్చలేకపోయింది. ఇదే విషయాన్ని ఏప్రిల్ 9న సీపీ వెల్లడించారు. ఫోరెన్సిక్ రిపోర్ట్ ఇన్ కంప్లీట్‍గా వచ్చిందన్నారు. హిస్టోపాథాలజీ రిపోర్ట్ కోసం ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. ఆ రిపోర్ట్ కూడా రావడంతో శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు.
ప్రధాన నిందితుడు సైఫ్
ప్రీతి చావుకు డాక్టర్ సైఫ్ ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. అతడు ర్యాగింగ్ చేయడంతోపాటు మానసికంగా ఇబ్బంది పెట్టడంతోనే ఆమె సూసైడ్ చేసుకుందన్నారు. అందుకే అతనిపై ర్యాంగిగ్, ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో 306 సెక్షన్ (ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద వారం రోజుల్లో చార్జిషీట్ వేస్తామని వెల్లడించారు. కాగా, సైఫ్ కు బెయిల్ కోసం అతని కుటుంబసభ్యులు మూడుసార్లు పిటిషన్ లు వేయగా, జడ్జి తిరస్కరించారు.
బుధవారం వరంగల్ జిల్లా ఎస్సీ, ఎస్టీ కోర్టు మాత్రం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. నిందితుడు సైఫ్ 16 వారాల పాటు ప్రతీ శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి 2 గంటల మధ్య ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ ముందు హాజరుకావాలని రెండో అదనపు న్యాయమూర్తి వై.సత్యేంద్ర ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు సైఫ్ శుక్రవారం మట్వాడా పోలీస్ స్టేషన్ లో ఏసీపీ కిషన్ ముందు హాజరయ్యాడు.