
- సీసీ కెమెరాలు 50 వేలు.. పని చేస్తున్నవి 40 వేలే..
- నిఘా నేత్రాల ఏర్పాటుకు ముందుకు రాని జనం
- దొంగలు, నేరస్తుల గుర్తింపులో సీసీ కెమెరాలే కీలకం
- అవగాహన కల్పిస్తేనే ప్రయోజనం
హనుమకొండ, వెలుగు: వరంగల్ కమిషనరేట్ లో నిఘా లోపం సమస్యగా మారుతోంది. కమాండ్ కంట్రోల్ సెంటర్ ఉన్నా, కాలనీల్లో సీసీ కెమెరాలు సరిగా లేక చోరీలు, ఇతర నేరాలు జరిగిన సందర్భాల్లో నిందితులను గుర్తించడం కష్టమవుతోంది. నేరాల నియంత్రణలో పోలీసులు కూడా ఇబ్బందులు పడాల్సి వస్తోంది. సరైనా నిఘా వ్యవస్థ లేకపోవడం, కాలనీలు, ఇండ్లలో సీసీ కెమెరాల ఏర్పాటులో జనాలు ఇంట్రెస్ట్ చూపకపోవడం వల్ల నేరాలకు అవకాశం ఏర్పడుతోంది. కొన్నిచోట్ల సీసీ కెమెరాలున్నా మెయింటెనెన్స్ లేక అవి పని చేయడం లేదు. నిఘా నేత్రాల ఏర్పాటుపై అవగాహన పెరగాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
5 లక్షల ఇండ్లు, 50 వేల కెమెరాలు..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లాల పరిధిలో 5,633 చదరపు కిలోమీటర్లలో విస్తరించి ఉంది. మొత్తం 39 మండలాలు, దాదాపు ఐదు లక్షల ఇండ్లు, 23.65 లక్షలకు పైగా జనాభా ఉన్నట్లు కమిషనరేట్ రికార్డులు చెబుతున్నాయి. సువిశాలమైన పరిధి కావడం, రైలు, రోడ్డు మార్గాలతో కనెక్టివిటీ ఎక్కువగానే ఉండటంతో అంతర్రాష్ట్ర ముఠాలు వరంగల్ ను టార్గెట్ చేసి చోరీలకు పాల్పడుతున్నాయి. ఇటీవల చెడ్డీ గ్యాంగ్, ట్యాటూ గ్యాంగుల్లాంటివి కూడా నగరంలోకి ఎంటరై ఇండ్లను లూటీ చేస్తున్నాయి.
పెద్ద మొత్తంలో గోల్డ్, నగదు దోచుకుని ఉడాయిస్తున్నాయి. చోరీలకు పాల్పడుతున్న దుండగులను గుర్తించడంలో మాత్రం పోలీసులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కమిషనరేట్ లో దాదాపు 5 లక్షలకుపైగా ఇండ్లు ఉంటే, సీసీ కెమెరాలు అందులో పది శాతం కూడా లేకపోవడం గమనార్హం. కమ్యూనిటీ పోలీసింగ్, నేనుసైతం కార్యక్రమాల ద్వారా పోలీసులు ఇదివరకు 50,563 సీసీ కెమెరాలు ఏర్పాటు చేయగా, అందులో మెయింటెనెన్స్ లేక 10 వేల కెమెరాలకుపైగా నిరుపయోగంగా మారాయి. దీంతో కమిషనరేట్ వ్యాప్తంగా సుమారు 40 వేలకు పైగా సీసీ కెమెరాలు పని చేస్తున్నట్లు తెలుస్తుండగా, వాటితో నేరాలను కట్టడి చేయని పరిస్థితి నెలకొంటోంది.
నిఘా లేక చోరీలు..
'ఒక్క సీసీ కెమెరా.. వంద మంది పోలీసులకు సమానం' అని, తరచూ పోలీస్ అధికారులు చెబుతుంటారు. వాస్తవానికి దొంగతనాలు, దాడులు, ఇతర నేరాలేమైనా జరిగినప్పుడు నిందితుల గుర్తింపులో అవే కీలకం. కానీ సీసీ కెమెరాల ఏర్పాటుకు మాత్రం జనాలు ముందుకు రావడం లేదని పోలీసులు చెబుతున్నారు. ముఖ్యంగా వరంగల్ నగర శివారులో ఏర్పడుతున్న కాలనీల్లో ఇండ్లు కట్టుకుంటున్న వారిలో ఎక్కువ శాతం మంది ఉద్యోగులే ఉంటున్నా, వారు కూడా సీసీ కెమెరాల ఏర్పాటుకు ముందుకు రాకపోవడం ఇబ్బందులకు కారణమవుతోంది. ఇటీవల హనుమకొండ గోపాలపూర్ లో వరుసగా నాలుగు ఇండ్లలో చోరీలు జరగగా, అక్కడ ఒకట్రెండు ఇండ్లలో మినహా ఎక్కడా సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం.
దీంతో అది గమనించిన దుండుగుడు గత నెల 12న అర్ధరాత్రి సైలెంట్ గా వచ్చి దాదాపు 20 తులాల బంగారం, రూ.3 లక్షల నగదుతో ఉడాయించాడు. కాగా, కేసు ఛేదనలో భాగంగా ఆ పక్క కాలనీలో సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించగా, మెయింటెనెన్స్ లేని కారణంగా అవి పనిచేయడం లేదు. దీంతో నిందితుడిని గుర్తించలేక పోలీసులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. వడ్డేపల్లి ఫిల్టర్ బెడ్ సమీపంలోని ఆర్టీసీ కాలనీ, గాయత్రి కాలనీల్లో కూడా ఇదే పరిస్థితి. నగరంలో జరిగిన చోరీల కేసుల ఛేదనలో పోలీసులకు ఇలాంటి ఇబ్బందులే ఎదురవుతుండటం గమనార్హం.
వరంగల్ కమిషనరేట్ పరిధిలో పనిచేయని నిఘానేత్రాలు 10 వేలు
అవగాహన కల్పిస్తేనే మేలు..
సీసీ కెమెరాల ఏర్పాటుపై చాలామంది నిర్లక్ష్యం వహిస్తుండటం వల్ల చోరీలకు అడ్డుకట్ట పడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వ్యాపారులతోపాటు కాలనీ కమిటీ, సంఘాల సమన్వయంతో సీసీ కెమెరాల ఏర్పాటుకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించాల్సిన ఆఫీసర్లు గతేడాది నుంచి లైట్ తీసుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. దీంతోనే కమిషనరేట్ లో గతంతో పోలిస్తే గడిచిన ఏడాది అత్యల్పంగా 617 కెమెరాలు మాత్రమే ఏర్పాటు కావడం గమనార్హం. ఇకనైనా దొంగతనాలు, ఇతర నేరాల కట్టడికి సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్ ఆఫీసర్లు చొరవ చూపాలని, వాటి మెయింటెనెన్స్ కూడా చూసుకునేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సీసీ కెమెరాల ఏర్పాటుతో వ్యక్తిగత భద్రతతోపాటు నేరాల ఛేదనకు కూడా ఉపయోగపడే అవకాశం ఉండగా, మరి వాటి ఏర్పాటు దిశగా పోలీస్ ఆఫీసర్లు చొరవ తీసుకుంటారో లేదో చూడాలి.