ట్రాకింగ్ యాప్ పని అదే..
టెక్నాలజీతో పకడ్బందీగా లాక్ డౌన్ రూల్స్ అమలు
సిటిజన్ ట్రాకింగ్ అప్లికేషన్ తీసుకొచ్చిన పోలీసులు
అవసరం లేకున్నా బయటకు వస్తే అంతే
కేసు బుక్ .. వెహికిల్ సీజ్
వరంగల్, వెలుగు: కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న క్రమంలో ప్రజలు ఎవరూ బయటకు రావద్దని ప్రభుత్వం ‘లాక్ డౌన్’ అమలు చేస్తున్న విషయం తెలిసిందే. పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నప్పటికీ కొంతమంది అవసరం ఉన్నా .. లేకున్నా వాహనాలతో రోడ్ల మీదకు వస్తూనే ఉన్నారు. దీంతో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేసేందుకు వరంగల్ పోలీస్ కమిషనరేట్ ఆధ్వర్యంలో టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. ‘సిటిజన్ ట్రాకింగ్ అప్లికేషన్ యాప్’ తో పకడ్బందీ చర్యలు తీసుకుంటూ అవసరం లేకున్నా బయట తిరిగే వాళ్లపై కఠినంగా వ్యవహరిస్తున్నారు.
టెక్నాలజీ సాయంతో..
కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా అందరూ ఇంటికే పరిమితం కావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం మార్చి 23 నుంచి లాక్ డౌన్ అమలు చేస్తోంది. ఇందులో అత్యవసర పనుల కోసం వెళ్లేవారు, వివిధ ప్రభుత్వ సిబ్బందికి మినహాయింపు ఇచ్చారు. చాలామంది అవసరం ఉన్నా లేకున్నా వెహికిల్స్ తో బయటకు వస్తున్నారు. దీంతో పోలీసులు కట్టుదిట్టమైన చర్యలకు ఉపక్రమించారు. తెలంగాణ రాష్ట్ర పోలీస్ విభాగం ‘సిటిజన్ ట్రాకింగ్ అప్లికేషన్ ’యాప్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ అప్లికేషన్ ద్వారా రోడ్డుమీదకు ఎవరెవరు ఎన్ని సార్లు వచ్చారు.. ఎన్ని పోలీస్ చెక్ పాయింట్లను దాటారో లెక్కిస్తారు.
పూర్తి వివరాలు నమోదు చేస్తరు..
పోలీస్ చెకింగ్ పాయింట్ వద్దకు వచ్చే ప్రతి వాహన పూర్తి వివరాలను ఈ యాప్ లో నమోదు చేస్తారు. అక్కడకు వచ్చిన వాహనదారుని పేరు,
మొబైల్ నెంబర్, ఆధార్, వెహికిల్ నెంబర్ తో పాటు డ్రైవింగ్ లైసెన్స్ వివరాలు తీసుకుంటారు. దీంతో వాహనదారుడు లాక్ డౌన్ ను అతిక్రమించి
ఒక చెక్ పాయింట్ నుంచి మరో చెక్ పాయింట్ కు చేరుకున్నప్పుడు ఎన్నిసార్లు రోడ్లమీదకు వచ్చాడో.. ఎంత దూరంనుంచి, ఎన్ని చెక్ పాయింట్లను దాటి వచ్చాడో తదితర సమాచారం అంతా అందులో కనిపిస్తుందన్న మాట. ఇలా అన్ని వివరాలను పరిశీలించి అనవసరంగా రోడ్ల మీదకు వచ్చే వాహన దారులపై చర్యలు తీసుకుంటారు.
అనవసరంగా రావద్దు ..
సిటిజన్ ట్రాకింగ్ యాప్ తో వాహనదారుల వివరాలు సేకరిస్తున్నాం. అనవసరంగా రోడ్లపైకి వచ్చే వారిపై చర్యలు తీసుకుంటాం. వెహికిల్ సీజ్
కూడా చేస్తాం. – వి.రవీందర్, వరంగల్ సీపీ