బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ అరెస్ట్ తర్వాత.. వరంగల్ తరలించే క్రమంలో పోలీసుల హడావిడి అంతా ఇంతా కాదు. పోలీస్ స్టేషన్ దగ్గరే భారీ కాన్వాయ్ తోపాటు.. అన్ని కార్లకు పేపర్లు అడ్డుపెట్టి మీడియా కంట పడకుండా వ్యవహరించారు పోలీసులు. అక్కడి నుంచి జాతీయ రహదారి మీదుగా వరంగల్ వైపు వెళ్లారు పోలీసులు. అయితే కేసు వరంగల్ జిల్లా పరిధిలో ఉండటంతో.. ఆలేరు మీదుగా జనగామ జిల్లాలోకి ప్రవేశించిన సమయంలో.. జిల్లా సరిహద్దుల దగ్గర ఎంపీ బండి సంజయ్ ను వరంగల్ జిల్లా పోలీసులకు అప్పగించారు యాదాద్రి పోలీసులు.
అప్పటి వరకు యాదాద్రి జిల్లా పోలీసులు రక్షణగా ఉండగా.. జనగామ దగ్గర వరంగల్ జిల్లా పోలీస్ వాహనాల్లోకి బండి సంజయ్ ను మార్చారు. బండి సంజయ్ ను వాహనాలు మారుస్తూ పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బొమ్మల రామారం నుంచి వరంగల్ వస్తున్న విషయాన్ని తెలుసుకున్న బీజేపీ కార్యకర్తలు, నేతలు.. మార్గమధ్యలో ఎక్కడికక్కడ కాన్వాయ్ ను అడ్డుకుంటూ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని పసిగట్టిన పోలీసులు.. ఎంపీ బండి సంజయ్ ఏ వాహనంలో ఉన్నారు అనేది తెలియకుండా ఉండేందుకు వాహనాలను మారుస్తూ వచ్చారు పోలీసులు.
బండి సంజయ్ ను తమ అదుపులోకి తీసుకున్న వరంగల్ జిల్లా పోలీసులు.. జనగామ జిల్లా పాలకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. డాక్టర్లతో వైద్య పరీక్షల తర్వాత.. ఆయన్ను వర్ధన్నపేట మీదుగా హనుమకొండ తరలించారు పోలీసులు.