- వాకీటాకీలు, లేటెస్ట్ కట్టర్లతో ఘజియాబాద్ గ్యాంగ్ దొంగతనాలు
- పట్టుకున్న వరంగల్ పోలీసులు
- 2.38 కిలోల గోల్డ్, డైమండ్ చైన్లు స్వాధీనం
- వివరాలు వెల్లడించిన సీపీ రంగనాథ్
వరంగల్, ఆదిలాబాద్, బెంగళూర్ తదితర ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లలో వరుస చోరీలకు పాల్పడుతున్న గజియాబాద్ గ్యాంగ్‌ను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. రూ.2 కోట్ల విలువైన 2.38 కిలో ల బంగారం, వజ్రాల నెక్లెస్‌లు, 104 కిలోల గంజా యి స్వాధీనం చేసుకున్నారు. పిస్టల్, ఐదు బుల్లెట్లు, కారు, సెల్ఫోన్లు, వాకీటాకీలు, నకిలీ ఆధార్ కార్డులు, ఐదు వేల నగదు సీజ్ చేశారు. వరంగల్ సీపీ ఏవీ.రంగనాథ్ బుధవారం కమిషనరేట్ కాన్ఫరెన్స్ హాల్లో వివరాలు వెల్లడించారు. యూపీలోని గజియాబాద్ కు చెందిన మహమ్మద్ షరీఫ్, ఇతడి కొడుకు షహజాద్ఖాన్, మరో వ్యక్తి అక్బర్ఖురేషీ, మీరట్‌కు చెందిన కపిల్జాటోవు ఈజీ మనీ కోసం దొంగతనాలు చేసేవారు. తాళం వేసి ఉన్న ఫ్లాట్లను టార్గెట్ చేసేవారు. టెక్నీషియన్‌లా లోపలకు వెళ్లేవారు. బయట కారులో ఇద్దరు కూర్చునేవారు. వాకీటాకీల ద్వారా సమాచారం చేరవేసుకునేవారు. తాళం వేసిన ఫ్లాట్లలో కేవలం 8 నుంచి 10 నిమిషాల్లోనే అధునాతన కట్టర్లతో చోరీ పూర్తి చేసేవారు.
ఇలా చోరీలు చేసి ఢిల్లీలో కారు కొన్నారు. ఈ నెల 4న ఆదిలాబాద్ వచ్చారు. అక్కడ రెండు ఇండ్లల్లో చోరీ చేసి, మరునాడు వరంగల్చేరుకున్నారు. పోలీసులంతా క్రైమ్మీటింగ్లో ఉండగా హనుమకొండ, సుబేదారి, మట్వాడా పీఎస్‌ల పరిధిలోని అపార్ట్మెంట్లలో 8 చోరీలు చేశారు. వరంగల్ వద్దిరాజు అపార్ట్మెంట్లోకి వెళ్తండగా వాచ్మెన్ ప్రశ్నించడంతో పిస్టల్‌తో బెదిరించి పరారయ్యారు. కారు నంబర్ ప్లేట్ మార్చుకుని ఏపీలోకి ఎంటరయ్యారు. బాధితుల ఫిర్యాదుల మేరకు దర్యాప్తు చేస్తున్న పోలీసులు ఈ ఏడాది మేలో కర్నూలులో కూడా ఇలాగే చోరీలు చేసి పట్టుబడ్డట్టు గుర్తించారు. అక్కడి పోలీసుల నుంచి సమాచారం తీసుకున్నారు. ఈక్రమంలో నిందితులు ములుగు ప్రాంతంలో 104 కిలోల గంజాయిని కొని వరంగల్ వచ్చారు.
ALSO READ: పరిహారం తక్కువ ఇచ్చారనే మనస్తాపంతో రైతు ఆత్మహత్య
సుబేదారి స్టేషన్ పరిధిలోని తెలంగాణ జంక్షన్ దగ్గర అనుమానాస్పదంగా తిరుగుతుండగా పట్టుకుని విచారించగా నిజాన్ని ఒప్పుకున్నారు. ఈ ముఠాకు ఢిల్లీ పోలీసుల సహకారం ఉన్నట్లు తెలిసిందని, టెక్నికల్‌గా భారీ నెట్‌వర్క్‌కూడా ఉందని సీపీ చెప్పారు. 32 చోరీలు చేశారన్నారు. ప్రతిభ చూపిన వరంగల్ క్రైమ్స్డీసీపీ దాసరి మురళీధర్, ఏసీపీ మల్లయ్య, మట్వాడా, మహిళా పీఎస్, సీసీఎస్, హనుమకొండ, సుబేదారి సీఐలు వెంకటేశ్వర్లు, సూర్యప్రసాద్, శంకర్‌నాయక్, కరుణాకర్, షుకూర్, కర్నూర్ సీఐ శంకరయ్యలను సీపీ అభినందించారు.